'ఇండియా ఆన్ సేల్': దాల్మియాలకు గండికోట.. ఎర్రకోట

  • 30 ఏప్రిల్ 2018
గండికోట, వారసత్వ కట్టడాలు, ఏపీటీడీసీ Image copyright Gandikota/Facebook
చిత్రం శీర్షిక గండికోటలో వారసత్వ కట్టడాలు

వారసత్వ కట్టడాల అభివృద్ధి పేరిట వాటి నిర్వహణను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది.

'వారసత్వ కట్టడాల దత్తత' పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న గండికోటను దాల్మియా భారత్‌ లిమిటెడ్‌ గ్రూప్‌కు అప్పగించనున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఆ సంస్థకు, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థకు మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని 'ఈనాడు' కథనం పేర్కొంది. ఒప్పందంలోనే గండికోట దత్తత కాలపరిమితినీ ఖరారు చేస్తారు.

గండికోటకు విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు, అక్కడ ల్యాండ్‌ స్కేపింగ్‌, టాయిలెట్లవంటి వాటి నిర్వహణ బాధ్యతనూ దాల్మియా సంస్థ తీసుకోనుంది.

అయితే కేవలం కోట మాత్రమే అభివృద్ధి చేస్తే పర్యాటకులను పెద్దగా ఆకర్షించే అవకాశం ఉండదన్న ఆలోచనతో అక్కడ ఒక మెగా ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు ఏపీటీడీసీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులోనూ దాల్మియా సహకారం తీసుకోవాలని ఏపీటీడీసీ భావిస్తోంది.

Image copyright Gandikota/Facebook
చిత్రం శీర్షిక గండికోట పరిసరాల్లో కనువిందు చేసే దృశ్యాలు

దిల్లీలో ఎర్రకోటనూ...

'వారసత్వ కట్టడాల దత్తత' పథకం కింద దాల్మియా సంస్థ దిల్లీలోని ఎర్రకోటనూ అయిదేళ్లపాటు దత్తత తీసుకుంది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌)లో భాగంగా కార్పొరేట్‌ సంస్థలు ఈ పనులు చేపట్టేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది.

ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత ఏడాది సెప్టెంబరు 17న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 'వారసత్వ కట్టడాల దత్తత' పథకాన్ని ప్రకటించారు.

వారసత్వ కట్టడాలను దత్తత తీసుకునే ప్రైవేటు సంస్థలు వాటి ఆవరణలో తమ గురించి ప్రచారం చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది. టిక్కెట్లు, అద్దెల రూపంలో వచ్చిన నగదు మొత్తాన్ని పూర్తిగా ఆ వారసత్వ కట్టడాల అభివృద్ధికే వ్యయం చేయాలని, లాభాపేక్ష ఉండరాదని షరతులు విధించింది.

Image copyright Getty Images

'ఇండియా ఆన్ సేల్'

ప్రముఖ చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరేతో మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాల పరిరక్షణ విషయానికి వస్తే, ఆర్కియాలజికల్ సర్వేలోనే సరైన సిబ్బంది లేరని తెలిపారు.

గతంలో హుమయూన్ సమాధి పరిరక్షణ బాధ్యత తీసుకున్న ఆగాఖాన్ ట్రస్ట్, పర్యాటకుల కోసం దానిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దినా, దాని చారిత్రకాంశాలను మాత్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. దాని పరిరక్షణ కోసం ఉపయోగించిన రసాయనాల గురించి కూడా ఆగాఖాన్ ట్రస్ట్ చెప్పలేదని వివరించారు.

దాల్మియా లాంటి సంస్థలకు పురాతత్వ శాస్త్రం గురించి, కళాకృతుల గురించి ఏమీ తెలీదని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు. ఈ ప్రైవేట్ సంస్థలు నియమించుకునే సిబ్బందికి పురాతత్వ శాస్త్రంలో ఏ మాత్రం ప్రవేశం ఉంటుందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కేవలం టాయిలెట్ల నిర్వహణ, పరిశుభ్రత కోసమే వాటిని ప్రైవేట్ సంస్థలకు దత్తత ఇచ్చి ఉంటే, భారత పురాతత్వ సంస్థకే కొంత డబ్బు ఇచ్చి ఆ పని చేయించవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

అయితే పర్యాటక శాఖ మాత్రం వారసత్వ కట్టడాల పరిరక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నామని తన చర్యను సమర్థించుకుంది.

ప్రభుత్వ నిర్ణయంపై, దేశ వారసత్వాన్ని కూడా అమ్ముకుంటున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రముఖ చరిత్రకారులు విలియమ్ డాల్రింపుల్ - ''పాత దిల్లీలోని ఒక పురాతన హవేలీని, ఎర్రకోటను దత్తతకు తీసుకోవడంలో చాలా తేడా ఉంది. ఎర్రకోటలాంటి కట్టడాలు జాతి కిరీటంలో వజ్రాలు. వాటితో ఆటలాడుకోకూడదు. వాటికి ఏదైనా జరిగితే కార్పొరేట్ సంస్థలు జవాబుదారీ వహించే పరిస్థితి కూడా లేదు'' అని ట్వీట్ చేశారు.

''జాతీయ భక్తి అంటూ గుండెలు బాదుకుంటున్న మోదీ ప్రభుత్వం వేలంలో చారిత్రక ఎర్రకోటను వేలం వేయడం సిగ్గుచేటు'' అని ద హిందూ పత్రిక హెల్త్ అండ్ సైన్స్ ఎడిటర్ విద్యాకృష్ణన్ ట్వీట్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ 'ఇండియా ఆన్ సేల్' అనే హాష్ ట్యాగ్‌తో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ''ఎర్రకోటను ప్రైవేటుపరం చేయడం జాతిగౌరవానికి భంగం'' అని ఆ పార్టీకి చెందిన రాజేశ్ శర్మ ట్వీట్ చేశారు.

అయితే సోషల్ మీడియాలోనే కొందరు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.

''అమ్మడానికి, దత్తత తీసుకోవడానికి మధ్య తేడా తెలియని మూర్ఖులు'' అంటూ సతిందర్ కె.ధిమాన్ ట్వీట్ చేశారు.

''మన వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ధైర్యంగా తీసుకున్న చర్య'' అని ఆధ్యాత్మికవేత్త సద్గురు ట్వీట్ చేశారు.

Image copyright ADOPTAHERITAGE.IN

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)