చంద్రబాబు: ఏపీకి కేంద్రం ఇచ్చింది... పావలా.. అర్ధణా!

  • 30 ఏప్రిల్ 2018
చంద్రబాబు, లోకేశ్ Image copyright FACEBOOK/AndhraPradeshCM

ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతి పక్షాలు సోమవారం పోటాపోటీగా దీక్షలు నిర్వహించాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ అధికార పక్షం టీడీపీ తిరుపతిలో ‘ధర్మ పోరాట దీక్ష’ చేపట్టగా.. ప్రతిపక్షం వైసీపీ విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ నిర్వహించింది.

తిరుపతి ధర్మ పోరాట దీక్ష వద్ద చంద్రబాబు ప్రసంగంలో 6 ముఖ్యాంశాలు

1. ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ ఏం చెప్పారో అందరికీ తెలుసు. ప్రధాని మాటల్లోనే మనం విని. సభను కొనసాగిద్దాం. (నెల్లూరు, తిరుపతి సభల సందర్భంగా మోదీ ప్రసంగాల వీడియోలను ప్రదర్శించారు.) ఇవి మోదీ మాటలా కాదా? ఇందులో మోసముందా? మనం నిలదీయడం తప్పా?

2. చివరకు మనకు రూ. 1,500 కోట్లు ఇచ్చి.. ఒక విగ్రహానికి రూ. 2,500 కోట్లిచ్చారంటే ప్రధానిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నెల్లూరు సభలో మోదీ.. ‘వెంకయ్య నాయుడు పోరాడారు. ప్రత్యేక హోదా సాధించారు. మెరుగ్గా సాయం చేస్తామ’ని చెప్పారు. మరి ఎందుకు కేంద్రం ఇచ్చిన మాటపై నిలబడలేదు?

3. అవినీతిపరులకు, నీతి మాలిన పార్టీలకు మద్దతిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతంది? హైదరాబాద్ అభివృద్ధి నా కష్టార్జితం తప్ప మరోటి కాదు. పార్లమెంటులో పెట్టిన విభజన చట్టానికే దిక్కు లేదంటే ఎవరికి చెప్పుకోవాలి?

Image copyright FACEBOOK/CHANDRABABU
చిత్రం శీర్షిక తిరుపతి సభలో టీడీపీ కార్యకర్తలు

4. పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయం. పూర్తవుతుంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు. మేం విద్యాసంస్థలకని రూ. 11,000 కోట్ల విలువైన ఆస్తులిస్తే.. సెంట్రల్, ట్రైబల్ వర్సిటీలకు బిల్లు కూడా పెట్ట లేదు. ఇది నమ్మక ద్రోహం.

5. దేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడం చాలా దారుణం. కఠువాలో చిన్న పాపపై సామూహిక మానభంగం.. దేనికి సంకేతం? యూపీలో ఘటనలూ బాధాకరం.

6. మేం రూ. 16,000 కోట్లడిగితే.. రూ. 4,000 కోట్లిచ్చారు. ఇలా పావలా, అణా, అర్ధణా ఇచ్చి హక్కులను కాలరాస్తున్నారు. తిరుపతిలో ప్రారంభించిన ఈ ధర్మ పోరాటం ఆగదు. అన్ని జిల్లాలోనూ ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం.

Image copyright YSR Congress Party - YSRCP
చిత్రం శీర్షిక ప్ర‌త్యేక హోదాపై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుకు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ‌ప‌ట్నంలో `వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌` చేప‌ట్టింది. ఈ దీక్ష‌కు సంఘీభావంగా పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న చేతికి న‌ల్ల రిబ్బ‌న్ క‌ట్టుకుని పాద‌యాత్ర ప్రారంభించారు.

హోదా రాలేదంటే కారణం చంద్రబాబే: వైసీపీ

‘‘ఏపీకి ప్రత్యేక హోదా రాలేదంటే దానికి చంద్రబాబే కారణం’’ అని వైసీపీ ఆరోపించింది. విశాఖపట్నంలో జరగిన ‘వంచన వ్యతిరేక దీక్ష’లో వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మొదట ఏపీకి హోదా అవసరం లేదు. ప్యాకేజీ కావాలని కోరుకున్నారు. అందువల్లే ఏపీకి హోదా రాలేదు’’ అని అన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ నాలుగేళ్లుగా హోదా కోసం పోరాటం చేస్తున్నారని ఈ దీక్ష కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి.. మూడు లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టి.. కేంద్రం అంటే భయపడుతున్నారని విమర్శించారు.

‘చంద్రబాబు.. మోదీతో అమీతుమీకి సిద్ధమైనట్లుంది’: డానీ

తాజా ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తోంటే ఆయన ప్రధాని మోదీతో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధమైనట్లు ఉందని.. రాజకీయ విశ్లేషకులు డానీ అన్నారు.

‘‘హోదా పోరాటం చేస్తే.. మోదీ నిధులిస్తాననో.. హోదా ఇస్తాననో చెబుతారేమో సర్దుకుందామని చంద్రబాబు మొదట అనుకున్నారు. ఎందుకంటే ఆయన ఫైటర్ కాదు. ’’ అని డానీ అభిప్రాయపడ్డారు.

‘‘జగన్, చంద్రబాబు.. ఇద్దరూ నంద సునందుల్లాగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టంలో వారు పరస్పరం వ్యతిరేకులు. జాతీయ స్థాయిలో వచ్చేసరికి .. దిల్లీకి వెళ్లేటపుడు వీరు మోదీతో కలవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్తో కలవాలని అనుకోవడం లేదు.’’ అని అన్నారు.

అలాగే బీజేపీ కూడా కర్నాటక ఎన్నికల ఫలితాల ఆధారంగా ఏపీ రాజకీయాలపై ఓ నిర్ణయం తీసుకుంటోందని.. అప్పటి వరకు వేచి చూసే ధోరణి అవలంభించొచ్చని విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)