ప్రెస్‌రివ్యూ: కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతాం: వైఎస్ జగన్

  • 1 మే 2018
Image copyright ysjagan/facebook

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతానని వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అన్నారని 'ప్రజాశక్తి' కథనం ప్రచురించింది.

కృష్ణాజిల్లాలో జన్మించిన ఎన్టీఆర్‌ తొమ్మిది నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించారని జగన్‌ అన్నారు.

అటువంటి నాయకుడిని సైతం వెన్నుపోటు పొడిచి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

నాలుగేళ్ల పాలనలో ప్రతి కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసే టీడీపీ నాయకులకు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే ధ్యాస లేకుండాపోయిందన్నారు.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ సోమవారం కృష్ణాజిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. గ్రామంలోని చెరువు సుందరీకరణ పనుల్లో అవినీతి జరుగుతోందని, మట్టిని సైతం అమ్మేసుకుంటున్నారని కొందరు స్థానికులు వివరించారు.

Image copyright Getty Images

58 లక్షల మంది రైతులకు చెక్కులు రెడీ..!

తెలంగాణలో రైతుబంధు పథకం కింద మే 10 నుంచి చెక్కులు పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తిచేసిందని 'నమస్తే తెలంగాణ' పత్రిక రాసింది.

వానకాలం పంటల కోసం మే 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎకరాకు రూ. నాలుగువేల చొప్పున చెక్కుల పంపిణీ చేపట్టనున్నారు.

రాష్ట్రంలోని 1,39,71,568 ఎకరాలకు రూ.5,588.62 కోట్ల విలువైన చెక్కులు 58 లక్షల మంది రైతులకు అందిస్తారు.

చెక్కులను, పాస్‌ పుస్తకాలతో కలిపి ఇవ్వనున్నారు. ఇప్పటికే చెక్కులు, పాస్ పుస్తకాలు మండలాలకు చేరాయి. వాటిని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు.

రైతుల సంఖ్యలో, భూమి విస్తీర్ణంలో, ఎక్కువ పెట్టుబడి మొత్తాన్ని అందుకోవడంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

ఈ జిల్లాలో 4,38,589 మంది రైతులకు 11.65 లక్షల ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది. ఇందుకోసం రూ.466 కోట్ల పెట్టుబడిగా అందనుంది. జిల్లాలో సుమారు 6,119 మంది రైతులు రూ.50వేలకుపైగా పెట్టుబడి సాయం అందుకోనున్నారు.

Image copyright facebook.com/KalvakuntlaChandrashekarRao

జాతీయ పార్టీల ఆట కట్టిద్దాం: కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయని, బీజేపీ, కాంగ్రెస్‌ల కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

జాతీయ పార్టీలకు బలం లేకున్నా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని లబ్ధి పొందుతున్నాయని, తర్వాత వాటిని చిన్నచూపు చూస్తూ మోసం చేస్తున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇకపై అలాంటివి సాగనీయ రాదని, ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను దాటి బయటికి వచ్చి జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అన్నారు.

దిల్లీలో ప్రాంతీయ పార్టీలు పాగా వేస్తేనే సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఐకమత్యంగా పనిచేయాలన్నారు.

రెండురోజుల పర్యటనలో భాగంగా చెన్నై వెళ్లిన కేసీఆర్‌తో సోమవారం డీఎంకే ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త సమాఖ్య కూటమి ఏర్పాటు, ఇతర అంశాల గురించి చర్చించారు.

'తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే జాతీయ పార్టీలు అధిక స్థానాలను గెలుస్తున్నాయి. కానీ తర్వాత ప్రాంతీయ పార్టీలకు తగిన ప్రతిఫలాలు అందడం లేదు. యూపీఏ హయాంలో మద్దతు ఇచ్చిన డీఎంకేకి అన్ని విధాలా అన్యాయమే జరిగింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడులో మితిమీరి జోక్యం చేసుకుంటోంది. ఇలాంటి వాటిని సాగనివ్వవద్దనే కొత్త కూటమి వైపు దృష్టి సారించాం. దేశవ్యాప్తంగా దీనికి స్పందన వస్తోంది. అందుకే ఈ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాం' అని కేసీఆర్‌ చెప్పారు.

కేసీఆర్ ఫ్రంట్‌కు స్వాగతం: అమిత్ షా

కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లేదా మూడో కూటమి ఏర్పాటును తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ కూటములను ఏర్పాటు చేసేందుకు అందరికీ హక్కు ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

గతంలో కూడా కేవలం కూటముల ఏర్పాటు ద్వారానే చాలా ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయన్నారు.

కఠువా ఎమ్మెల్యే Image copyright twitter.com/rajiv_jasrotia

కఠువా ఎమ్మెల్యేకు మంత్రి పదవి

జమ్మూ కశ్మీర్‌లోని కఠువా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజీవ్‌ జస్రోతియాను మంత్రి పదవి వరించిందని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనతో కఠువా పేరు మార్మోగింది.

పీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా జస్రోతియాకు స్థానం లభించింది.

కఠువా ఘటనలో నిందితులకు మద్దతుగా హిందూ ఏక్తా మంచ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్‌ జస్రోతియాకు మంత్రి పదవి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదే ర్యాలీలో పాల్గొన్నందుకు ఇద్దరు మంత్రులు లాల్‌ సింగ్‌, చందర్‌ ప్రకాశ్‌ గంగా ఇటీవల రాజీనామా చేశారు.

మరోవైపు మంత్రివర్గ విస్తరణకు వీలుగా ఏప్రిల్‌ 17న బీజేపీ మరికొందరు తన మంత్రులతోనూ రాజీనామా చేయించింది.

ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పు లు జరిగాయి. అసెంబ్లీ స్పీకర్‌ కవీందర్‌ గుప్తా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్‌ శర్మకు మంత్రి పదవులు లభించాయి. మొత్తం ఎనిమిది మంది మంత్రులుగా సోమవారం ప్రమాణం చేశారు. వీరిలో ఏడుగురు కొత్తవారు. ఇద్దరు పీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాగా, కఠువా కేసులో బీజేపీ, ముఫ్తీ వైఖరి ఏమిటని మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)