మే డే: కార్మికులు ఏ దేశాల్లో ఎక్కువ సేపు పనిచేస్తున్నారు?

  • 1 మే 2018
పని ఒత్తిడి Image copyright Getty Images
చిత్రం శీర్షిక వారానికి గరిష్ఠంగా 48 లేదా అంతకంటే తక్కువ పనిగంటలు ఉండాలని ఐఎల్‌వో సిఫార్సులు చెబుతున్నాయి.

కార్మికులు ధనిక దేశాల్లో ఎక్కువ సమయం పనిచేస్తున్నారా, పేద దేశాల్లో ఎక్కువ సమయం పనిచేస్తున్నారా? అసలు ప్రపంచవ్యాప్తంగా పనిగంటలు ఎలా ఉన్నాయి? సెలవులు ఎలా ఉన్నాయి? 'మే డే' సందర్భంగా ప్రత్యేక కథనం...

దక్షిణ కొరియా చట్టసభ నేషనల్ అసెంబ్లీ దేశంలోని ఉద్యోగులకు, కార్మికులకు ఊరట కలించేలా పనిగంటలను తగ్గిస్తూ మార్చిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. వారానికి గరిష్ఠంగా 68గా ఉన్న పనిగంటలను 52 గంటలకు కుదించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, మరిన్ని ఉద్యోగాలు సృష్టించేందుకు, ఉత్పాదకతను పెంచేందుకు ఈ చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

పనిగంటల తగ్గింపుతో దేశంలో జననాల రేటు కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో దక్షిణ కొరియాలో జననాల రేటు బాగా తగ్గింది.

Image copyright Getty Images

'ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్-ఓఈసీడీ)' 2016లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం- అత్యధిక పనిగంటలున్న అభివృద్ధి చెందిన దేశం దక్షిణ కొరియానే. ఒక్కో కార్మికుడు సగటున ఏడాదికి 2,069 గంటలు పనిచేస్తున్నట్లు ఓఈసీడీ నివేదిక తెలిపింది. ఓఈసీడీ 38 దేశాలపై ఈ విశ్లేషణ జరిపింది.

ఓఈసీడీ సభ్య దేశాల్లో సుదీర్ఘ పనిగంటలు ఉన్న దేశాలు
ర్యాంకు దేశం సగటున ఏడాదికి పనిగంటలు
1 మెక్సికో 2,225
2 కోస్టారికా 2,212
3 దక్షిణ కొరియా 2,069
4 గ్రీస్ 2,035
5 రష్యా 1,974
5 చిలీ 1,974
14 టర్కీ 1,832
16 అమెరికా 1,783
22 జపాన్ 1,713
26 బ్రిటన్ 1,676
38 జర్మనీ 1,363

వ్యతిరేకించిన కంపెనీలు

కంపెనీల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను పక్కనబెట్టి దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది జులై నుంచి అమలవుతుంది. దీనిని తొలి దశలో భారీ కంపెనీలు అమలు చేయాల్సి ఉంటుంది. తర్వాత చిన్నస్థాయి కంపెనీలు కూడా దీని ప్రకారం పనిగంటలను తగ్గించాల్సి ఉంటుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కంపెనీల వ్యతిరేకతను పక్కనబెట్టి దక్షిణ కొరియా ప్రభుత్వం పనిగంటలను తగ్గించే చట్టాన్ని తీసుకొచ్చింది.

దక్షిణ కొరియా: కారణాలు ఏమిటి?

సంపన్న దేశాలతో పోలిస్తే దిగువ, మధ్యస్థాయి ఆదాయాలున్న దేశాల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) అధ్యయనాలు చెబుతున్నాయి. సంపన్న దేశమే అయినప్పటికీ దక్షిణ కొరియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దక్షిణ కొరియాలో స్వయం ఉపాధి కార్మికులు ఎక్కువగా ఉండటం, వేతనాలు తక్కువగా ఉండటం, ఉద్యోగ అభద్రత, ఇతరత్రా అంశాలు దీనికి కారణం.

జపాన్‌లోనూ అధిక పనిగంటలు

దక్షిణ కొరియా మాదిరే సంపన్న దేశమైన జపాన్‌లోనూ అధిక పనిగంటలు ఉన్నాయి. వారానికి ఉండాల్సిన పనిగంటలపై పరిమితిని విధించే చట్టమేదీ జపాన్‌లో లేదు. జపాన్‌లో పని ఒత్తిడి, సుదీర్ఘ సమయం పనిచేయడం కొందరు కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇది మరణాలకూ దారితీస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక వారానికి ఉండాల్సిన పనిగంటలపై పరిమితిని విధించే చట్టమేదీ జపాన్‌లో లేదు.

పని ఒత్తిడి కారణంగా సంభవించే మరణానికి జపాన్ భాషలో ప్రత్యేకంగా ఒక పదమే ఉంది. ఈ మరణాన్ని 'కరోషి' అంటారు. పని ఒత్తిడి కారణంగా గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చనిపోవడాన్ని లేదా బలవన్మరణానికి పాల్పడటాన్ని కరోషి అని వ్యవహరిస్తారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో 1,456 కరోషి కేసులు నమోదైనట్లు ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ఈ కేసులు ఇంతకన్నా ఎక్కువే ఉంటాయని, చాలా కేసులు రికార్డుల్లో నమోదై ఉండవని కార్మిక హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

చట్టప్రకారం వారానికి అత్యధిక పనిగంటలు ఉన్న దేశాలు
దేశం పనిగంటలు
థాయ్‌‌ల్యాండ్ 84
సేషల్స్ ఐలాండ్స్ 74
కోస్టారికా 72
నేపాల్ 68
ఇరాన్ 64
మలేషియా 62
సింగపూర్ 61

ఆసియా: ఎక్కువ మంది.. ఎక్కువ గంటలు

అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలి గణాంకాల ప్రకారం- ఆసియా దేశాల్లో ఎక్కువ మంది కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు.

ఆసియాలో 32 శాతం దేశాల్లో పనిగంటలపై జాతీయస్థాయిలో ఎలాంటి సార్వజనీనమైన పరిమితి లేదు. 29 శాతం దేశాల్లో వారానికి 60 లేదా అంతకంటే ఎక్కువ పనిగంటలు ఉన్నాయి. వారానికి గరిష్ఠంగా 48 లేదా అంతకంటే తక్కువ పనిగంటలు ఉండాలనే ఐఎల్‌వో సిఫార్సులను కేవలం నాలుగు శాతం దేశాలే అమలు చేస్తున్నాయి.

అమెరికా: నిబంధన లేదు

ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికాల్లో, కరీబియన్ ప్రాంతంలో 34 శాతం దేశాల్లో వారానికి గరిష్ఠ పనిగంటలపై సార్వజనీన నిబంధనేదీ లేదు. ఎంతో అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలోనూ ఈ నిబంధన లేదు.

మధ్యప్రాచ్యం: పనిగంటలు 60కి పైనే

మధ్యప్రాచ్యంలో చట్టపరంగానే సుదీర్ఘ పనిగంటలు ఉన్నాయి. పది దేశాలకుగాను ఎనిమిది దేశాల్లో వారానికి పనిగంటలు 60కి పైన ఉన్నాయి.

యూరప్: బెల్జియం, టర్కీ తప్ప..

యూరప్‌లో బెల్జియం, టర్కీ మినహా అన్ని దేశాల్లో వారానికి గరిష్ఠంగా 48 పనిగంటలు ఉన్నాయి. ఈ రెండు దేశాల్లో మాత్రమే అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి.

ఆఫ్రికా: అలాంటి దేశాలు అత్యధికం ఇక్కడే

ఆఫ్రికాలో చాలా దేశాల్లో కార్మికులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు. మూడింట ఒక వంతు మందికి పైగా కార్మికులు 48 గంటలకు మించి పనిచేస్తున్న దేశాలు అత్యధికంగా ఆఫ్రికాలో ఉన్నాయి.

Image copyright Getty Images

నగరాల్లో పనిగంటలు: ముంబయిలో 43.7, దిల్లీలో 42.6

నగరాల వారీగానూ సగటు పనిగంటల వివరాలనూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకు యూబీఎస్ 71 నగరాలపై 2016లో ఒక విశ్లేషణను విడుదల చేసింది.

ఈ విశ్లేషణ ప్రకారం- వారానికి సగటు పనిగంటలు ముంబయిలో 43.7గా, దిల్లీలో 42.6గా ఉన్నాయి.

హాంకాంగ్‌లో అత్యధికంగా 50.1 పనిగంటలు ఉన్నాయి. మెక్సికో సిటీలో 43.5, బ్యాంకాక్‌లో 42.1 పనిగంటలు ఉన్నాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక యూబీఎస్ విశ్లేషణ ప్రకారం వారానికి సగటు పనిగంటలు ముంబయిలో 43.7 కాగా దిల్లీలో 42.6

మెక్సికో: సెలవులూ తక్కువే

మెక్సికోలో పనిగంటలు అత్యధికంగా ఉండటమే కాదు, సెలవులు కూడా చాలా తక్కువ. మెక్సికోలో పెయిడ్ వార్షిక సెలవుల కనీస సంఖ్య 10లోపే. జపాన్, చైనా, నైజీరియాల్లోనూ దాదాపు ఇంతే. బ్రెజిల్‌లో ఈ సెలవుల సంఖ్య 20-23 మధ్య ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)