ఒంటి చేత్తో బీడు భూముల్లో సిరుల పంట పండిస్తున్నాడు!

  • శ్యాంమోహన్
  • బీబీసీ కోసం
ఫొటో క్యాప్షన్,

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న రాజు ప్రమాదంలో చేయిని.. ఆ తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయాడు.. దీంతో వ్యవసాయాన్నే ఉపాధిగా ఎంచుకున్నాడు

జీవిత కాలంలో ఒక్క మొక్కను కూడా పెంచని వారెందరో ఉన్న ఈ కాలంలో.. ఒంటి చేత్తో వందలాది మొక్కలకు ఐదేళ్ల పాటు రోజూ నీరు పెట్టి, కంటికి రెప్పలా కాపాడి రెండెకరాల పండ్ల తోటను సృష్టించాడీ గిరిజన రైతు.

ఒకపుడు పులులు సంచరించిన 'పులిమడుగు'లో బంజరు భూమిని సస్యశ్యామలంగా మార్చాడు.

లంబాడా గిరిజన తెగకు చెందిన బానోతు రాజుకు ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్‌ శివారులోని పులిమడుగు అటవీ ప్రాంతంలో ఎన్నడో సర్కారు వారు ఇచ్చిన నాలుగు ఎకరాల భూమి ఉంది.

బొగ్గు గని నుంచి హరిత వనానికి...

రాళ్లురప్పల మధ్య ఉన్న ఆ భూమిని సాగు చేసే స్తోమతు లేక, సింగరేణి బొగ్గుగనుల్లో చిన్న ఉద్యోగంలో చేరాడు.

కొన్నేళ్లు పనిచేశాక 1997లో లారీ ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. దాంతో కంపెనీ రాజును ఉద్యోగం నుండి తొలగించింది.

ఫొటో క్యాప్షన్,

మూడేళ్ల కిందట ఒంటి చేత్తో మొక్కలు నాటి నీరు పోసిన బానోతు రాజు.. ఇంత కాలం వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు

ఉన్న జీవనాధారం కూడా పోవడంతో అతడు తన బీడు భూమినే నమ్ముకోవాల్సి వచ్చింది.

భార్య కమల సాయంతో భూమిని చదును చేసి.. కొంతకాలం జొన్నలు, పత్తి పండించాడు. కానీ నీటి సదుపాయం లేక నష్ట పోయాడు.

చివరికి రెండు ఎకరాల్లో 140 మామిడి మొక్కలను ఒంటి చేత్తో నాటాడు. పక్కనే ఉన్న వాగులోని నీటిని కుండలతో తెచ్చి ఆ మొక్కలను పెంచాడు.

అంతర పంటలుగా కూరగాయలు పండిస్తూ ఇంటి అవసరాలు తీర్చుకునేవాడు.

సింగరేణిలో పనిచేసినపుడు వచ్చిన జీతంలో పొదుపు చేసిన కొంత డబ్బుతో తన పొలంలో బోరు వేసుకున్నాడు.

వాగు ఎండినపుడు ఈ బోరు నీటితో వ్యవసాయం చేయసాగాడు. మిగిలిన మరో రెండు ఎకరాల్లో వరి కూడా పండిస్తున్నాడు.

వ్యవసాయ నిపుణుల సలహాలతో సాగు చేస్తూ ఎకరాకు 25 నుండి 35 బస్తాల వరకు వరి దిగుబడి సాధిస్తున్నాడు.

ఫొటో క్యాప్షన్,

ఉపాధి హామీ పథకంలో ఇచ్చిన మామిడి, టేకు మొక్కలను నాలుగేళ్ల పాటు నీళ్లు పోసి పెంచానని బానోతు రాజు చెప్తారు

కంపెనీ పొమ్మంది, నేల తల్లి రమ్మంది...

''ప్రమాదంలో చేతిని పోగొట్టుకున్నాక, సింగరేణిలో ఉద్యోగం పోయింది.

ఇంట్లో గడవడానికి కూలిపనులు చేద్దామనుకున్నా కానీ నా అవిటి తనం చూసి ఎవరూ పనికి పిలిచే వారు కాదు.

వేరేదారి లేక మాకున్న బంజరు భూమిని సాగులోకి తేవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.

గిరిజనుల కోసం ఎన్నో పథకాలు ఉన్నాయంటారు కానీ, మాకు ఏ ఒక్కటీ ఉపయోగపడలేదు.

ఉపాధి హామీ పథకంలో మామిడి, టేకు మొక్కలు ఇచ్చారు. వాటినే నాలుగేళ్ల పాటు నీళ్లు పోసి పెంచాను.

నా నలుగురు కొడుకులు డిగ్రీలు చదివారు. కానీ ఎవరికీ ఉపాధి లేదు. వారు కూలీపనులకు పోతున్నారు'' అంటాడు బానోతు రాజు.

జీవితం పట్ల కొంత నిరాశ ఉన్నప్పటికీ, అతడిలో ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు.

మామిడి తోట చుట్టూ కంచెగా 580 టేకు మొక్కలు నాటాడు. అవి నేడు వృక్షాల్లా ఎదుగుతున్నాయి.

ఫొటో క్యాప్షన్,

మూడేళ్ల కిందట బానోతు రాజు నాటిన టేకు మొక్కలు మరో ఐదేళ్లలో సిరుల పంట పండిస్తాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు

స్వేదంతో సేద్యం చేశాడు...

''వ్యవసాయం పట్ల రాజుకున్న ఆసక్తిని చూసి నరేగా పథకం ద్వారా పండ్ల మొక్కలు, టేకు మొక్కలు ఇచ్చాం.

వాటిని రెండు చేతులున్న వారికంటే ఎక్కువ శ్రద్ధగా పెంచాడు. బోరు పని చేయకపోతే బిందెలతో నీటిని మోసే వాడు.

మరో ఏడేళ్లు ఆగితే టేకు కలప కనక వర్షం కురిపిస్తుంది. మామిడి పండ్ల మీద ఏడాదికి రూ. 70 వేల నుండి రూ. 90 వేల వరకు ఆదాయం వస్తుంది.

ఎవరి మీదా ఆధార పడకుండా అతను పడిన కష్టమే నేడు అతనికి ఆదాయ వనరుగా మారింది'' అని జిల్లా డ్వామా ఏపీడీ మల్లేష్‌ డూడీ బీబీసీతో అన్నారు.

ఫొటో క్యాప్షన్,

బానోతు రాజు మామిడి మొక్కలతో పాటు వరి కూడా సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు

రెండు పంటలు వరి...

''పులిమడుగు చుట్టుపక్కల 15 బస్తాలు కూడా పండని పరిస్థితుల్లో బానోతు రాజు పొలంలో 35 బస్తాలకు పైగా పండిస్తూ ఏడాదికి రెండు పంటలు పండించడం అతడి కష్టానికి తగిన ఫలితం’’ అంటూ స్థానిక రైతులు అభినందిస్తున్నారు.

బానోతు రాజు రోజూ ఉదయమే అంబలి తీసుకొని పొలానికి పోయి సాయంత్రం వరకు పని చేసి ఇంటికి చేరతాడు.

పండ్లతోటలకు చీడ, పీడలు రాకుండా సేంద్రియ కషాయాలు చల్లుతాడు. కలుపు మొక్కలను పీకి, వాటినే నేలలో బయోకంపోస్టుగా తయారు చేసి భూసారాన్ని కాపాడుతాడు.

టీవీల్లో వ్యవసాయ కార్యక్రమాలు చూస్తూ వైవిధ్య సాగు పద్ధతులపై అవగాహన పెంచుకుంటాడు.

రెండు చేతులున్న వారు కూడా సాధించ లేని ప్రగతిని రాజు ఒంటి చేత్తో సాధించి అందరికీ అదర్శంగా నిలిచాడు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)