ప్రెస్‌రివ్యూ: 'తెలుగు చిత్రసీమ ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం.. ఈ సినిమా'- నాగార్జున

  • 2 మే 2018
నాగార్జున Image copyright Facebook/Akkineni Nagarjuna

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, సావిత్రి- ఈ మూడు పేర్లూ తెలుగు చలనచిత్ర చరిత్రలో మిగిలిపోతాయని ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెప్పారు.

''వాళ్లు లేకుండా 'మాయాబజార్‌' లేదు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలూ లేవు. నా ఎనిమిది నెలల వయసులో నన్ను ఎత్తుకుని చిత్రసీమకు పరిచయం చేశారు సావిత్రి. బయోపిక్‌ తీయాలి అంటే అర్హత ఉండాలి. అది తక్కువ మందికి ఉంది. ఆ గౌరవం సావిత్రిగారికి దక్కింది. తెలుగులో తీసిన తొలి బయోపిక్‌ ఒక స్త్రీ కథ కావడం గర్వంగా ఉంది. తెలుగు చిత్రసీమ ఆడవాళ్లకు ఇచ్చే గౌరవం.. ఈ సినిమా(మహానటి). ఇంత మంచి చిత్రంలో నేను లేనన్న బాధ ఉంది. అయితే చైతూ(నాగచైతన్య), సమంత ఈ చిత్రంలో భాగస్వాములు కావడం సంతోషంగా అనిపించింది'' అని ఆయన చెప్పా రని ఈనాడు తెలిపింది.

సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న 'మహానటి' చిత్రం పాటల సీడీ ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో ఆడవాళ్లపై ఎన్నో అకృత్యాలు: ఎన్టీఆర్

''సమాజంలో ఆడవాళ్లపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ఒక్కసారి 'మహానటి' చూశాక.. ఎందుకు మగాడిగా పుట్టాం అనిపిస్తుంది. ఆడవాళ్ల బలం ఏమిటో చెప్పే సినిమా ఇది. వాళ్లు తలచుకుంటే ఏం సాధిస్తారో అర్థమవుతుంది. ఈ సినిమా చూశాక వాళ్లపై గౌరవం పెరుగుతుంది'' అని జూనియర్ ఎన్టీఆర్‌ చెప్పారు.

నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, సమంత, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంక దత్‌ నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు.

కీర్తి సురేష్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రంలో నేను కథానాయికని కావొచ్చు. కానీ ఈ కథని నడిపే స్టార్‌ మాత్రం సమంతనే'' అన్నారు.

ఈ కార్యక్రమంలో సావిత్రి కుమారుడు సతీష్‌, కుమార్తె విజయ చాముండేశ్వరి పాల్గొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్: వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి

నిరుద్యోగ భృతి పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 2 లేదా 8 నుంచి అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని ఈనాడు తెలిపింది. ప్రస్తుతం.. డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న నిరుద్యోగ యువతకు భృతిని పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొంది.

నిరుద్యోగభృతి పంపిణీ నిమిత్తం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.వేయి కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

నిరుడు కేటాయించిన రూ.500 కోట్లు కలిపితే ప్రస్తుతం రూ.1,500 కోట్లు ఈ పథకం కోసం కేటాయించినట్లయింది.

ఉపాధి కల్పనా కార్యాలయం, ప్రజాసాధికార సర్వే వివరాల ఆధారంగా ఇంటర్‌, ఆపైన విద్యార్హతలు ఉండి నిరుద్యోగులుగా ఉన్నవారు 10 లక్షల మంది వరకు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు.

డిగ్రీ, ఆపైన విద్యార్హత ఉన్నవారికే ప్రస్తుతం నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో, డిగ్రీ, ఆపైన విద్యార్హతలున్న నిరుద్యోగుల సంఖ్య తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

Image copyright JanaSena Party

ఏపీలో 175 స్థానాలకూ పోటీ.. తెలంగాణపై ఆగస్టులో నిర్ణయం: పవన్

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకూ పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది. తెలంగాణలో పోటీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టులో ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.

ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలోపేతం అవుతామని ఆయన తెలిపారు.

హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు. పార్టీ ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ను నియమిస్తున్నట్లు పవన్‌ ప్రకటించారు.

2014 ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాల్లో, ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నా, తరువాతి పరిస్థితుల్లో ఎన్డీఏకు సహకరించామని పవన్‌ చెప్పారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియపరిచేలా ప్రజల మధ్యలోకి వెళదామని పవన్‌ ప్రకటించారు. జనసేన ఏ ఒక్క కులానికో ప్రాతినిథ్యం వహించదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు

కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు కీలక అనుమతులు లభించాయని 'నవ తెలంగాణ' రాసింది. ప్రాజెక్టు సాగునీటి ప్రణాళిక, అంచనా వ్యయానికి సంబంధించిన అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపింది.

ప్రాజెక్టులో 237 టీఎంసీల వినియోగానికి ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతి వీలు కల్పిస్తుంది.

కేంద్ర జలసంఘానికి పంపిన ప్రతిపాదనల్లో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.80,190.46 కోట్లుగా పేర్కొంది. ఇందులో హెడ్‌వర్క్స్ పనులకు రూ.33,145.44 కోట్లు, నీటి సరఫరా వ్యవస్థ (కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు) కోసం రూ.47,045.02 కోట్లు ఖర్చవుతాయని తెలిపింది.

అంచనా వ్యయాన్ని మూడేళ్ల వరకు మార్చకూడదని కేంద్ర జలసంఘం చెప్పింది.

గతంలో వచ్చిన ఏడు అనుమతులు, తాజా అనుమతులు కలిపితే ఈ ప్రాజెక్టుకు ఏడాది కాలంలో తొమ్మిది అనుమతులు లభించాయి. కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా సంఘం అనుమతితోపాటు మరో ఏడు అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెప్పారని నవ తెలంగాణ రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)