జర్నలిస్టు జే డే హత్య కేసు: ఛోటా రాజన్ దోషి.. ప్రత్యేక మోకా కోర్టు తీర్పు

  • 2 మే 2018
జే డే హత్యకేసు Image copyright Getty Images

జర్నలిస్టు జ్యోతిర్మయ్ డే హత్య కేసులో ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ప్రధాన ముద్దాయి ఛోటా రాజన్ సహా మొత్తం 8 మంది దోషులని ప్రకటించింది.

కేసు ఏంటి?

ముంబయికి చెందిన ‘మిడ్ డే‌‌ న్యూస్‌‌’ పత్రికలో క్రైమ్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న జ్యోతిర్మయి డే.. జే డే కలం పేరుతో ప్రముఖ పాత్రికేయుడిగా పేరొందారు.

ముంబయి శివారు పావై ప్రాంతంలో 2011 జూన్ 11వ తేదీన జే డే తన మోటారు సైకిల్‌పై తన ఇంటికి తిరిగి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పట్టపగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ హత్య జరిగింది.

జే డే హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా జర్నలిస్టుల్ని షాక్‌కి గురి చేసింది. ఈ హత్యకేసులో మరొక జర్నలిస్టు జింగా వోరాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Image copyright Getty Images

ఎవరీ జే డే?

ముంబయిలో నేర వార్తల రిపోర్టింగ్‌లో ప్రముఖ పాత్రికేయుడిగా జే డే పేరొందారు. ప్రధాన పత్రికలైన ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ వంటి వాటిలోనూ ఆయన విధులు నిర్వర్తించారు.

హత్య జరిగేనాటికి ఆయన ముంబయికి చెందిన మిడ్ డే పత్రికలో పరిశోధనాత్మక కథనాల ఎడిటర్‌గా ఉన్నారు. నగరంలోని ‘ఆయిల్ మాఫియా’ సహా చాలా నేర సంబంధిత వ్యవహారాలపై ఆయన కథనాలు రాశారు.

Image copyright Getty Images

నిందితులెవరు?

జే డే హత్య కేసులో అండర్ వరల్డ్ డాన్‌గా భావించే.. ఛోటా రాజన్‌గా పేరొందిన రాజేంద్ర ఎస్ నిఖల్జే, అప్పట్లో ఏషియన్ ఏజ్ పత్రిక డిప్యూటీ బ్యూరో ఛీఫ్‌గా పనిచేస్తున్న జింగా వోరాలు నిందితులని పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

జే డే ప్రాణాలు తీయాలని ఆదేశించినందుకు ఛోటా రాజన్ నిందితుడని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరాట్ తెలిపారు.

ఇంటర్‌పోల్ సహకారంతో ఇండోనేషియాలో ఉన్న ఛోటా రాజన్‌ను 2015లో భారత్‌కు తరలించి న్యూఢిల్లీలోని తీహార్ కేంద్ర కర్మాగారంలో నిర్బంధించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జే డే ప్రాణాలు తీయాలని ఆదేశించింది ఛోటా రాజన్‌గా పిలిచే రాజేంద్ర ఎస్ నిఖల్జే అని, అతను దోషి అని కోర్టు తీర్పు చెప్పింది

కేసు విచారణ ఇలా సాగింది..

తొలుత ఈ హత్య కేసును మోకా చట్టం కింద ముంబయి పోలీసులు చేపట్టి దర్యాప్తు జరిపారు. ఛోటారాజన్ అరెస్టు తర్వాత సీబీఐ కూడా ఇందులో భాగమైంది.

ముంబయిలోని ప్రత్యేక మోకా కోర్టు ఈ కేసు విచారణ జరిపింది.

మొత్తం 155 మంది సాక్షులను విచారించింది. అయితే, ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ ముందుకు రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)