సుప్రీంకోర్టుకూ, ప్రభుత్వానికి మధ్య టగ్ ఆఫ్ వార్: ఏమిటి? ఎలా? ఎందుకు?

  • 2 మే 2018
జస్టిస్ కేఎం జోసెఫ్ Image copyright PTI
చిత్రం శీర్షిక జస్టిస్ కేఎం జోసెఫ్

సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం, కొలీజియంల మధ్య ఏం జరుగుతుంది అన్న అంశాన్ని దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.

ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలన్న ప్రతిపాదనను మరోసారి పరిశీలించాలన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు బుధవారం సుప్రీంకోర్టు కొలీజియం తన స్పందన తెలియజేయాల్సి ఉండగా, దీనిపై కొలీజియం ఏకాభిప్రాయానికి రాలేదు.

ఇందూ మల్హోత్రా, కేఎం జోసెఫ్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని కొలీజియం (సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల బృందం) జనవరిలో సిఫారసు చేసింది.

అయితే, దీనిపై చాలా కాలం తర్వాత ఇందూ మల్హోత్రా నియామకానికి సంబంధించిన సిఫారసును కేంద్ర న్యాయశాఖ స్వీకరించింది. కానీ, జస్టిస్ జోసెఫ్ విషయంలో మాత్రం పునరాలోచించాలని సిఫారసును కొలీజియంకు తిప్పి పంపించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కొలీజియం చీఫ్‌ దీపక్ మిశ్రాకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఓ లేఖ రాశారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ జోసెఫ్‌ను ఎందుకు నియమించకూడదో మూడు కారణాలను ఆ లేఖలో పేర్కొన్నారు.

అందులో మొదటి కారణం, సుప్రీంకోర్టులో కేరళ నుంచి ఇదివరకే ఒక న్యాయమూర్తి ఉన్నారు. ఇది రాష్ట్రాల ప్రాతినిధ్య సూత్రానికి అనుగుణమైంది కాదు.

రెండోది, ప్రస్తుతం దేశంలో సీనియారిటీ ప్రకారం జస్టిస్ జోసెఫ్‌ 42వ స్థానంలో ఉన్నారు. అది చాలా తక్కువ.

మూడో కారణం, సుప్రీంకోర్టు జడ్జిలలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సముదాయాలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరు.

చిత్రం శీర్షిక జస్టిస్ ఇందూ మల్హోత్రా

మంత్రి రవిశంకర్ లేఖ అందిన తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిల్లో ఒకరైన కురియన్ జోసెఫ్ స్పందించారు. "మా సిఫార్సులను ప్రభుత్వానికి మరోసారి పంపిస్తాం. ఆయన నియామకానికి సంబంధించిన సిఫారసును తిప్పి పంపించే ముందు ప్రభుత్వం గత ఉదాహరణలను కూడా పట్టించుకోలేదనే విషయాన్ని వాస్తవాలూ, గణాంకాల ఆధారంగా తెలియజేస్తాం." అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో చెప్పారు.

ఆ మరుసటి రోజే అదే పత్రిక మరో కథనం ప్రచురించింది. "ఒకవైపు కొలీజియం సమావేశం జరగాల్సి ఉండగా, ఇలాంటి విషయాలను మీడియాకు వెల్లడించడం సంప్రదాయానికి, నియమాలకు విరుద్ధం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

కొలీజియం అంటే ఏమిటి?

సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు అత్యంత సీనియర్ జడ్జీలను, ప్రధాన న్యాయమూర్తిని కలిపి కొలీజియం అంటారు.

కొలీజియం సిఫారసుల మేరకు జడ్జీల నియామకం, బదిలీలు జరుగుతాయి. కొలీజియం తన సిఫారసులను ప్రభుత్వానికి పంపిస్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపుతుంది. రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జడ్జీలు నియమితులవుతారు.

సాధారణంగా కొలీజియం సిఫారసులకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. కానీ, జస్టిస్ జోసెఫ్ నియామకం విషయంలో మాత్రం మోదీ ప్రభుత్వం పునరాలోచించాలని కొలీజియాన్ని కోరింది.

"ఇప్పుడు కొలీజియం తన సిఫారసులను మళ్లీ ప్రభుత్వానికి పంపిస్తే, ప్రభుత్వం తప్పకుండా దానిని అంగీకరించాల్సి ఉంటుంది" అని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా ఉపకులపతి ఫైజాన్ ముస్తఫా అన్నారు.

Image copyright Getty Images

జస్టిస్ జోసెఫ్ విషయంలో ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది?

లేఖలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్న అంశాలపై కొన్ని దశాబ్దాలుగా న్యాయ సంబంధిత విషయాలను పరిశీలిస్తున్న సీనియర్ పాత్రికేయుడు రాకేశ్ భట్నాగర్ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు.

"సుప్రీంకోర్టు జడ్జి నియామకానికి సంబంధించి ఈ నిబంధనలు ఎవరు, ఎప్పుడు పెట్టారు? ప్రస్తుతం చాలా రాష్ట్రాల నుంచి ఒకరి కంటే ఎక్కువ మంది జడ్జీలు సుప్రీంకోర్టులు ఉన్నారు. జస్టిస్ యంబీ లోకుర్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఏకే సిక్రీలు ముగ్గురూ దిల్లీకి చెందిన వారే కదా" అని భట్నాగర్ అన్నారు.

జస్టిస్ జోసెఫ్ నియామకం విషయంలో మోదీ ప్రభుత్వ తీరును మాజీ న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ కూడా తప్పుపట్టారు.

Image copyright Getty Images

'ఉత్తరాఖండ్' తీర్పే నిరాకరణకు కారణమా?

"ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వానికి మీరు నచ్చకపోతే, మీ నియామకానికి అంగీకరించదు" అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.

దాదాపు 100 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఇదే విషయాన్ని గురువారం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ముందు లేవనెత్తారు.

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని చట్టవిరుద్ధమని జస్టిస్ జోసెఫ్‌ చెప్పినందువల్లనే ఆయన పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని న్యాయవాదుల సంఘం ప్రతినిధి ఇందిరా జైసింగ్ ఆరోపించారు.

2016లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం చట్టవ్యతిరేకమని జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జస్టిస్ జే. చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్

"జస్టిస్ జోసెఫ్ నియామకాన్ని మోదీ ప్రభుత్వం తిరస్కరించడం వెనకున్న అసలు కారణం ఆయన ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను వ్యతిరేకించడమేనన్న విషయం కాస్త ఆలోచించగలిగే ఏ వ్యక్తికయినా స్పష్టంగా అర్థమవుతుంది" అని ఫైజాన్ ముస్తఫా అభిప్రాయపడ్డారు.

ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్‌కు సంబంధించిన మరో ఫైల్ కూడా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

'ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'తో మాట్లాడుతూ కొలీజియం సభ్యుడు జస్టిస్ కురియన్, "జస్టిస్ జోసెఫ్ విషయంలో ప్రభుత్వం ఇలా సాచివేత ధోరణని ప్రదర్శించడం మొదటిసారేమీ కాదు. చల్లగా ఉండే పర్వత ప్రాంతానికి తన శరీరం తట్టుకోవడం లేదు కాబట్టి తనను ఉత్తరాఖండ్ నుంచి బదిలీ చేయాలంటూ ఆయన రెండేళ్ల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. ఆయనను ఆంధ్రప్రదేశ్-తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు సిఫారసు చేసింది. ఆ ఫైల్ ప్రభుత్వానికి పంపించింది కూడా. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటికీ స్పందించలేదు" అని తెలిపారు.

సుప్రీంకోర్టు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని జస్టిస్ కురియన్ అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా

కేరళకు చెందిన జస్టిస్ కురియన్ ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు ఓ లేఖ రాశారు. అందులో ఆయన "కొలీజియం సిఫారసులను ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతోంది. ఇది సుప్రీంకోర్టు అస్తిత్వానికే ప్రమాదకరం" అని రాశారు.

జస్టిస్ కురియన్ మరో ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి జస్టిస్ దీపక్ మిశ్రా పనితీరును ప్రశ్నించారన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొలీజియానికి నేతృత్వం వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వానికి ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టు స్వతంత్రను కాపాడాలన్న ఒత్తిడి ఆయన తన సహచరుల నుంచి ఎదుర్కొంటున్నారు. తమ సిఫారసులను మళ్లీ ప్రభుత్వానికి పంపించాలని వారు కోరుతున్నారు.

అయితే బుధవారం జరిగిన సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై కొలీజియం సభ్యుల మధ్య తలెత్తిన విభేదం ఓ కొలిక్కి రానట్టు వార్తా సంస్థలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు