విశ్లేషణ: 2019 ఎన్నికలపై కర్ణాటక ప్రభావమెంత?

  • 3 మే 2018
కార్యకర్తల సంబురాలు Image copyright Getty Images

కర్ణాటక ఎన్నికల రణస్థలంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్-బీజేపీలు మరోసారి తలపడబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఎన్నికలు రెండు పార్టీలకూ కీలకంగా మారాయి.

ఈశాన్యంలో జెండా పాతి కొత్త ఉత్సాహంలో ఉన్న కమలనాథులు కన్నడ నాట వికసించాలని పరితపిస్తున్నారు. ఇందుకోసం తమ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. ఇటీవల కొన్ని రాష్ట్రాలు హస్తం చేజారి.. కాషాయ పార్టీ పాలనలోకి వెళ్లాయి.

ఇప్పుడు కర్ణాటకలో అధికారాన్ని నిలుపుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత అవసరం.

మే 15న వెలువడే కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ బలమెంతో స్పష్టం చేసే అవకాశం ఉంది.

Image copyright Getty Images

దక్షిణాదిన వికసించని కమలం

ఉత్తర భారతదేశంలో ఇటీవల బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించింది.

కానీ దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నా దక్షిణాదిన మాత్రం కమలం వికసించలేకపోతోంది.

బీజేపీకి హిందువులు ప్రధాన ఓటు బ్యాంకు. మతాన్ని, జాతీయవాదంతో ముడిపెట్టి బీజేపీ అమలు చేసిన వ్యూహాలు ఉత్తరాదిన చక్కగా పనిచేశాయి.

కానీ దక్షిణాదిన ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు. మతం, భాష, సంస్కృతి, సంప్రదాయాల విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో భిన్నత్వం కనిపిస్తుంది.

బీజేపీని ఉత్తరాది పార్టీగా ఇక్కడి వాళ్లు భావిస్తుంటారు.

అయితే, కర్ణాటక ఎన్నికల్లో గెలిస్తే బీజేపీపై ఉన్న ఆ అభిప్రాయం తొలిగిపోతుంది. అదే జరిగితే 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి ఇదెంతో ఉపయోగపడుతుంది.

బీజేపీ కేవలం హిందువుల పార్టీ మాత్రమే కాదనే సందేశాన్ని పంపేందుకు ఇటీవల ఈశాన్య రాష్ట్రాల గెలుపు సహాయపడింది.

కర్ణాటకలో కూడా గెలిస్తే ఆ విషయాన్ని మరింత విస్తృతంగా చాటుకోవచ్చు.

"దక్షిణాదిన బీజేపీ జెండా పాతడం ఎందుకు ముఖ్యం? ఉత్తరాదిన బీజేపీ అగ్రస్థానంలో ఉంది. ఈశాన్యంలో తొలిసారిగా పాగావేసింది. అందుకే దక్షిణాదిన అధికారంలోకి రావడం బీజేపీకి ముఖ్యం. 2019 ఎన్నికల వ్యూహాంలో ఇది చాలా కీలకం" అని రాజకీయ వ్యాసకర్త కల్యాణి శంకర్ ది ప్రింట్‌ వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు.

గత నెలలో మైసూర్‌లో నిర్వహించిన ర్యాలీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఇదే చెప్పారు.

కర్ణాటకలో గెలిస్తే దక్షిణ భారత దేశంలో బీజేపీ తలుపులు తెరుచుకుంటాయని అన్నారు.

Image copyright Getty Images

మోదీని ఓడించలేరన్న సందేశం పంపించడం ముఖ్యం

కాంగ్రెస్ రహిత భారత్‌ తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతుంటారు. కాంగ్రెస్ పాలన నుంచి దేశానికి విముక్తి కలిగిస్తానని గతంలో అన్నారు. అది జరగాలంటే కర్ణాటకలో గెలుపొందడం ముఖ్యం.

మోదీని ఎవరూ ఢీకొట్టలేరు.. ఓడించలేరు అన్న గట్టి సందేశాన్ని సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యర్థులకు పంపించడం అన్నింటికంటే ముఖ్యమైనది.

కాంగ్రెస్ నుంచి మరొక రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకే కర్ణాటకలో గెలవడం బీజేపీకి ముఖ్యం కాదు. 2019 ఎన్నికల్లో మోదీ ఓడిపోతారన్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా అక్కడ గెలవడం కమలనాథులకు ముఖ్యమని కోల్‌కతా నుంచి వెలువడే 'ది టెలిగ్రాఫ్' పత్రిక ఏప్రిల్‌లో ఒక రిపోర్టు ప్రచురించింది.

సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు కూడా బీజేపీకి ఇప్పుడొక విజయం అవసరం.

ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇది బీజేపీ కార్యకర్తలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

నిజానికి గోరఖ్‌పూర్‌ మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోట. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఇక్కడి నుంచి వరుసగా ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

ఫుల్‌పూర్‌ స్థానాన్ని 2014 ఎన్నికల్లో బీజేపీ తొలిసారి గెలుచుకుంది.

ఈ స్థానాల నుంచి గెలుపొందిన యోగి ఆదిథ్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య 2017లో రాజీనామా చేసి, యూపీ పాలనా పగ్గాలు చేపట్టడంతో గోరఖ్‌పూర్‌, ఫుల్‌పూర్‌ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

కేవలం ఉత్తరప్రదేశ్‌లోనే కాదు.. బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

2017 డిసెంబర్‌లో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 182 సీట్లలో 77 సీట్లు సాధించి కాంగ్రెస్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. అక్కడ రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది.

"గుజరాత్ కంచుకోటను బద్దలుకొట్టి బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లోకి కాంగ్రెస్ చొచ్చుకెళ్లింది. కాంగ్రెస్ గణనీయమైన పురోగతి సాధించింది" అని న్యూదిల్లీ నుంచి వెలువడే మింట్ పత్రిక అభివర్ణించింది.

"2014లో గెలవడం కాదు.. 2019 ఎన్నికల్లో మోదీ గెలుస్తారా లేదా అన్నది ముఖ్యమని ఇప్పుడు దిల్లీ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. ఆనాటి మోదీ ప్రభంజనం ఇప్పుడు చెదిరిపోయి ఉండొచ్చు. కర్ణాటకలో గెలిస్తే పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం వస్తుంది. మోదీకి కష్టకాలం తప్పదని ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయాన్ని చెరిపేయడంలో అది సహాయ పడుతుంది" అని హిందూస్తాన్ టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో వ్యాసకర్త ప్రశాంత్ ఝా అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

అధికారాన్ని కాపాడుకోవడం కాంగ్రెస్‌కు ముఖ్యం

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు కర్ణాటకనూ వదులుకోవద్దని గట్టి పట్టుదలతో ఉంది.

స్వతంత్ర భారతదేశాన్ని కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్లు పాలించింది. కానీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలు పంజాబ్, మిజోరాం, కర్ణాటకలోనే అధికారంలో ఉంది.

"కాంగ్రెస్‌కు కర్ణాటకలో గెలుపు అత్యవసరం. బీజేపీని వ్యతిరేకించే వారు సహజంగా కాంగ్రెస్‌నే ఎంచుకుంటారని రుజువు చేయాలంటే అక్కడ హస్తంపార్టీ విజయం సాధించడం అవసరం" అని ది హిందూ బిజినెస్ లైన్‌ రాసింది.

కాంగ్రెస్ సారధిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీకి కర్ణాటక ఎన్నికలు అగ్నిపరీక్ష లాంటివి.

"2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ విశ్వసనీయత దెబ్బతింటుంది. అది కార్యకర్తల్లో నిర్వేదం నింపుతుంది. ఇక 2019లో ఏం గెలుస్తామన్న నిరాశ పార్టీ కార్యకర్తల్లో కలుగుతుంది" అని హిందూస్తాన్ టైమ్స్‌ పత్రికకు రాసిన వ్యాసంలో వ్యాసకర్త ప్రశాంత్ ఝా అన్నారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఉంది. అయితే, బీజేపీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. గత 30 ఏళ్లలో కన్నడ ప్రజలు అధికారంలో ఉన్న పార్టీని ఏనాడు వెంటనే రెండోసారి గెలిపించలేదు.

సీఎన్‌ఎన్‌ న్యూస్18 ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారం నిలబెట్టుకోవడం మాత్రం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు