ప్రెస్ రివ్యూ: కర్ణాటకలో బీజేపీకి 70 సీట్లే... ఆరెస్సెస్‌ అంతర్గత నివేదిక!

  • 3 మే 2018
Image copyright Getty Images

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 70కి మించి సీట్లు రావని ఆరెస్సెస్‌ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో అంచనావేసినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది. ఈ నివేదికను దక్షిణ భారత ప్రాంతీయ ప్రముఖ్‌ వి.నాగరాజ్‌ బెంగళూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వయంగా అందజేసినట్లు సమాచారంగా తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 115 నుంచి 120 సీట్లు, జేడీఎస్‌కు 29 నుంచి 34 సీట్లు లభిస్తాయని సర్వే నివేదికలో ప్రస్తావించారు. రాష్ట్రంలో అహింద (అల్పసంఖ్యాకులు, బలహీనవర్గాలు, దళితుల) ఓట్లను క్రోడీకరించే విషయంలో బీజేపీ విఫలమైందని ఆర్‌ఎస్ఎస్‌ తన సమీక్షలో పేర్కొన్నట్లు తెలిసింది.

బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు లింగాయత్‌ కులస్తులపై పట్టు తప్పిందనీ, గాలి టీమ్‌కు పార్టీలో మళ్లీ పెద్దపీట వేయడం, వీటికి తోడు జీఎస్టీ ప్రభావం, నిరుద్యోగ సమస్య, అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలు బీజేపీపై ప్రజల్లో సదభిప్రాయం లేకుండా చేస్తున్నాయని సర్వే పేర్కొన్నట్లు తెలిసింది.

బీజేపీ వర్గాలు మాత్రం ఈ కథనాన్ని తోసిపుచ్చాయి. ఆర్‌ఎస్ఎస్‌ సర్వేలు అత్యంత రహస్యంగా పకడ్బందీగా ఉంటాయని, ఎక్కడా లీకయ్యే అవకాశం ఉండదని పార్టీ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

బ్యాంకుల్లో ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల మోసాలు

దేశంలో గత ఐదేళ్లలో వివిధ బ్యాంకుల్లో 23,000 పైగా మోసాలు జరిగాయని ఈనాడు దినపత్రిక ఒక కథనంలో తెలిపింది. ఆ మోసాల విలువ రూ. లక్ష కోట్లుగా ఉందని ఆర్‌బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలను సేకరించారు.

2017 ఏప్రిల్‌ - 2018 మార్చి 1 మధ్య 5,152 మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటి విలువ కూడా ఇతర ఏడాదులతో పోలిస్తే అత్యధికంగా రూ. 28,459 కోట్లుగా నమోదైంది.

2016-17లో మొత్తం 5,076 కేసుల్లో రూ. 23,933 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. 2015-16లో 4,693 కేసులు (రూ. 18,689 కోట్లు), 2014-15లో 4,639 కేసులు (రూ.19,455 కోట్లు) చొప్పున నమోదయ్యాయి.

2013 నుంచి 2018 మార్చి 1 వరకు అంటే ఐదేళ్లలో 23,866 బ్యాంకు మోసాలు జరగ్గా.. ప్రతి కేసులో రూ. లక్ష అంత కంటే ఎక్కువ మోసం జరిగింది. మొత్తం ఈ కేసులన్నీ కలిపితే వాటి విలువ రూ. 1,00,718 కోట్లుగా ఉంది.

డిసెంబరు 2017 నాటికి దేశంలో అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తం రూ. 8,40,958 కోట్ల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) నమోదయ్యాయి. వీటిలో పరిశ్రమలకిచ్చిన రుణాలే ఎక్కువ. ఇందులోనూ ఎస్‌బీఐయే అధికంగా రూ. 2,01,560 కోట్ల ఎన్‌పీఏలను కలగి ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో పీఎన్‌బీ (రూ. 55,200 కోట్లు); ఐడీబీఐ బ్యాంక్‌ (రూ. 44,542 కోట్లు); బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ. 43,542 కోట్లు); బ్యాంక్‌ ఆఫ బరోడా (రూ. 41,649 కోట్లు); యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ. 38,047 కోట్లు), కెనరా బ్యాంక్‌ (రూ. 37,794 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ. 33,849 కోట్లు) ఉన్నాయి.

Image copyright Getty Images

రూ. 2,000 నోట్లు కనిపించటం లేదు!

తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత విడుదలైన రూ. 2,000 నోట్లు కొన్నాళ్లుగా కనిపించటంలేదని విశాలాంధ్ర దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

మార్కెట్‌లో కేవలం రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లు మాత్రమే చెలామణిలో ఉండడంతో రూ. 2,000 నోట్లు ఏమవుతున్నాయో అర్ధంకాక బ్యాంకర్లు తలలు పట్టుకుంటున్నారని ఆ కథనం చెప్పింది. ఆర్‌బీఐ సహా పలు జాతీయ బ్యాంకులు ఈ నోట్లు నల్లబజారుకు తరలిపోతున్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

2016 నవంబర్‌ ఎనిమిదిన పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ రూ. 7.40 లక్షల కోట్ల విలువైన 370 కోట్ల రూ. 2,000 నోట్లను విడుదల చేసింది. తాజా లెక్క ప్రకారం రూ. 4.94 లక్షల కోట్ల విలువ చేసే నోట్లే చెలామణిలో ఉన్నాయి. మిగిలిన రూ. 2.46 లక్షల కోట్ల విలువైన నగదు ఏమైందో తెలియని పరిస్థితి నెలకొంది.

మార్కెట్‌లో రూ. 2,000 నోట్ల చెలామణి క్రమంగా తగ్గిపోవడాన్ని గుర్తించిన ఆర్బీఐ ఈ నోట్లన్నీ ఎక్కడికి వెళ్లిపోతున్నాయో తెలియక సతమతమవుతోంది. దీంతో ఆయా బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలపై ఆర్‌బీఐ దృష్టి సారించింది.

ఒకవైపు రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ నిలిచిపోగా, మరోవైపు ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు తెచ్చినట్లయితే బ్యాంకుల్లోని డిపాజిట్లకు గ్యారంటీ లేకుండా పోతుందనే ప్రచారంతో ప్రజలు బ్యాంకుల వైపు చూడడం లేదు. ఇళ్లలోనే నగదును భద్రపరచుకోవటంతో చెలామణిలో వ్యత్యాసం వచ్చినట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలు ముందే వస్తాయనే ప్రచారంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా నగదు దారి మళ్లిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆధార్ Image copyright Getty Images

మొబైల్ సిమ్ పొందటానికి ఆధార్‌ అవసరం లేదు

మొబైల్‌ సిమ్‌ పొందడానికి ఆధార్‌ కార్డు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సాక్షి ఒక కథనంలో తెలిపింది. ఈ విషయంపై కేంద్రం టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందని పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ కార్డు వంటి డాక్యుమెంట్లతో సిమ్‌ కార్డును ఇవ్వాలని టెలికాం కంపెనీలను కేంద్రం ఆదేశించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా వెంటనే ఈ ఆదేశాలను అమలు చేయాలని టెలికాం సెక్రటరీ అరుణ్‌ సుందరరాజన్‌ తెలిపారు.

'అన్ని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తున్నాం. ఆధార్‌ నెంబర్‌ లేదని వినియోగదారులకు సిమ్‌ కార్డు ఇవ్వడాన్ని నిరాకరించవద్దు. ఇతర కేవైసీ దరఖాస్తులు, డాక్యుమెంట్లను సమర్పించాలని కోరండి. సిమ్‌ కార్డుల జారీని కొనసాగించండి' అని సుందరరాజన్‌ పేర్కొన్నారు.

అంతకముందు టెలికాం డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన ఆదేశాలతో మొబైల్‌ కంపెనీలు ఆధార్‌ వెరిఫికేషన్‌ను చేపడుతున్నాయి. ఈ ఆదేశాలపై స్పందించడానికి మొబైల్‌ ఆపరేటర్లు నిరాకరించాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు