ఉత్తరాదిలో భీకర దుమ్ము తుపాను: 100మందికి పైగా మృతి

  • 4 మే 2018
దుమ్ము తుపాను Image copyright Getty Images

ఉత్తర భారత్‌లో దుమ్ము తుపాను బీభత్సం సృష్టించింది. దీని ధాటికి 100 మందికిపైగా చనిపోయినట్టు సమాచారం. కొన్ని వందల మంది గాయపడ్డారు.

ఈ దుమ్ము తుపాను బుధవారం రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లలో మొదలైంది.

దీంతో పలు చోట్ల విద్యుత్తుకు ఆటంకం తలెత్తింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి.

పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. పశువులు కూడా పెద్ద ఎత్తున చనిపోయినట్లు సమాచారం.

వేసవిలో ఉత్తర భారత్‌లో దుమ్ము తుఫాను సాధారణం. కానీ దీని వల్ల ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అరుదని అంటున్నారు.


Image copyright PTI
చిత్రం శీర్షిక ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ దుమ్ము తుపాను వచ్చింది
Image copyright Getty Images

రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, ధోల్‌పూర్‌లలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది.

ఈ జిల్లాల్లోనే కనీసం 29 మందికిపైగా చనిపోయారు.

మృతుల కుటుంబాలకు రాజస్థాన్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.

ఇక ఉత్తర ప్రదేశ్‌లో 73 మంది చనిపోయారు. ఒక్క ఆగ్రా జిల్లాలోనే 40 మందికిపైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఆగ్రాకి 50 కిలోమీటర్ల దూరంలోని ఖెరాగడ్‌ అనే గ్రామంలో 21 మంది మృతి చెందినట్లు స్థానిక జర్నలిస్టు లక్ష్మీకాంత్ పచౌరీ వెల్లడించారు.

ఈ గ్రామంలో ప్రజలు ఇంత భారీ నష్టాన్ని ఊహించలేదన్నారు. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు.

ఈ మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. దుమ్ము తుపాను బాధితులను ఆదుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం దుమ్ము తుపానును పైవీడియోలో చూడొచ్చు.

అసలు కారణమేంటి..

దుమ్ము తుపానుకు కారణాలపై భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ బీబీసీతో మాట్లాడారు.

ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ గాలులు, వర్షాలు కురుస్తున్నాయని.. వాటి ప్రభావంతో దుమ్ము తుపాను రేగిందని వివరించారు.

ప్రస్తుతం గాలులు అరేబియా సముద్రం నుంచి వీస్తున్నాయని.. దీంతో రాజస్థాన్ నుంచి ఈ దుమ్ము తుపాను మొదలైందని తెలిపారు.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Image copyright Venugopal Bollampalli
చిత్రం శీర్షిక బుధవారం దిల్లీ శివారు రాజ్‌నగర్‌లో దుమ్ము తుపాను బీభత్సం

దక్షిణాన పిడుగుల మోత

దుమ్ము తుపాను ఉత్తరాదిని వణికిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులు, మెరుపులు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి.

ఇటీవల ఏపీలోని 11 జిల్లాల్లో ఒక్కరోజులోనే కేవలం 13 గంటల వ్యవధిలో 36,749 పిడుగులు, మెరుపులు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ పరిధిలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి కిషన్ తెలిపారు.

పిడుగుపాటుకు మూడు జిల్లాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఏడాది మార్చి 16 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 10,432 చోట్ల పిడుగులు, మెరుపులు నమోదయ్యాయి.

ఏప్రిల్ 1 నుంచి 24 వరకు 86,526 పిడుగులు పడగా.. అందులో కేవలం ఏప్రిల్ 24న మాత్రమే 36,749 నమోదయ్యాయని కిషన్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు