దాచేపల్లి: ‘‘ఈ దేశానికి ఏమైంది? ఎందుకింత క్రూరంగా మారుతోంది?’’
- పృథ్వీరాజ్
- బీబీసీ ప్రతినిధి

‘‘ఈ దేశానికి ఏమైంది..?’’
‘‘దేశం ఎందుకింత క్రూరంగా మారుతోంది..?’’
‘‘మన చిన్నారులు ప్రతి రోజూ ఎందుకు రేప్‌కు గురవుతున్నారు..?’’
‘‘ఈ దేశపు పురుషులకు ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమా?’’
దేశంలో చిన్నారులపై అత్యాచారాల పరంపర కొనసాగుతుండటంపై సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు ఇవి.
కఠువా, ఉన్నావ్ ఘటనలతో చెదిరిన గుండెలు కుదురుకోకముందే.. దేశంలోని చాలా ప్రాంతాల్లో బాలికలపై రేప్, హత్యాచారాల వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేకిత్తోస్తోంది.
ఆ పసిపాప రోజూ తాతా అని పిలిచే నిందితుడు సుబ్బయ్య.. బాలికను చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు.
అత్యాచారం తర్వాత ఆ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని కూడా అతడు బెదిరించాడని చెప్తున్నారు. రక్తస్రావం, కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు ఆరా తీసినపుడు విషయం బయటపడింది. బాలికను వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తీసుకెళ్లారు.
విషయం బయటపడటంతో నిందితుడు పరారవగా.. ఈ దారుణంపై ఆగ్రహించిన బాలిక బంధువులు, గ్రామస్తులు అతడి ఇంటిపై దాడిచేశారు.
నిందితుడ్ని అరెస్ట్ చేయాలంటూ గురజాలలో ధర్నా, రాస్తా రోకోలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాలికను జిల్లా కలెక్టర్ తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
నిందితుడు సుబ్బయ్యను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య మీడియాకు తెలిపారు.
‘‘ఆ మహా విలువలు, నైతికతలు ఎక్కడ?
అయితే.. బాలికలపై అత్యాచారాల ఘటనలు వరుసగా జరుగుతుండటంతో సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విటర్లలో #Dachepalli హ్యాష్‌ట్యాగ్‌తో యూజర్లు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
‘‘ఈ దేశానికి ఏమైంది? ఆ మహా విలువలు, నైతికతలు ఎక్కడ? మన చిన్నారులు ప్రతి రోజూ ఎందుకు రేప్‌కు గురవుతున్నారు?’’ అంటూ దళిత, మహిళా ఉద్యమకారిణి, రచయిత సుజాత సూరేపల్లి ఫేస్బుక్లో ప్రశ్నలు సంధించారు.
‘‘బయటకు రాకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలియదు. దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ తండ్రీకొడుకులు అత్యాచారం చేశారు. ఈ అత్యాచారాలు కలచివేస్తున్నాయి. ఈ దేశపు పురుషులకు ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమా? మానసికవేత్తలు ఈ విషయం మీద సీరియస్‌గా దృష్టి పెట్టాలి’’ అని ఆమె సూచించారు.
‘‘గుండె పగిలిపోతోంది...‘‘
‘‘మొన్న కఠువా, ఉన్నావో ఘటనలు నన్ను చాలా బాధించాయి. కానీ ఇప్పుడు అదే ఘటన ఏపీలో జరిగింది. దాచేపల్లి ఘటనపై నేను చాలా సిగ్గు పడుతున్నాను. ఏం జరుగుతోంది?’’ అని పి.వి.సాయిచరణ్ అనే యూజర్ ట్విటర్లో వ్యాఖ్యానించాడు.
‘‘దేశం ఎంత క్రూరంగా మారుతోంది... గుండె పగిలిపోతోంది..’’ అంటూ రంజిత్ రెడ్డి అనే యూజర్ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అమాయకపు పసిపాపకు న్యాయం జరగాల’’న్నారు.
‘‘వ్యవస్థ సరైన దారిలోనే నడుస్తోందా?’’
‘‘12 ఏళ్ల లోపు వయసున్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష: నరేంద్రమోదీ కేబినెట్ ఏప్రిల్ 18వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఒక 9 ఏళ్ల బాలిక మీద 50 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మన వ్యవస్థ సరైన మార్గంలోనే నడుస్తోందా?’’ అని వీరభద్ర అనే యూజర్ ఒక ట్వీట్లో ప్రశ్నించారు.
‘‘దేవుడా. సిగ్గులేని భూస్వామ్య మనస్తత్వాలు. ఆడపిల్లలు వంటగదిలోనే ఉండి పోవాలని మీరు కోరుకుంటున్నారా? ఎన్సీబీఎన్ హయాంలో ఏపీలో మహిళలపై నేరాలు పెరగటంలో ఆశ్చర్యం లేదు’’ అని లక్ష్మి రోణంకి అనే యూజర్ ట్వీట్ చేశారు.
‘‘చనిపోయే వరకూ జనం ముందు ఉరితీయాలి...’’
అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ నిందితులకు మరణ శిక్ష విధించాలని కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి వారిలో సినీ నటి పూనమ్‌కౌర్ కూడా ఉన్నారు.
‘‘కొద్ది మంది మగాళ్ల అదుపుచేసుకోలేని లైంగిక, పశు వాంఛలు జీవితాన్ని భయంకరంగా మారుస్తున్నాయి.. ఇదంతా నిజమైతే.. అతడిని జనం ముందు చనిపోయే వరకూ ఉరి తీయాలి. అతడి మెదడును.. అతడిని మనిషిగా కాకుండా పురుషుడిగా చేస్తున్న అంగాన్ని నరికివేయాలి...’’ అని నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు.
‘‘ఆర్తనాదాలు.. శూన్యమవుతున్నాయి...’’
దాచేపల్లి ఘటన మీద కొంతమంది యూజర్లు తమ ఆవేదనను కవితల రూపంలో కూడా వ్యక్తీకరించారు.
‘‘ఈ నడుమ జనం చెవులు లేకుండా పుడుతున్నారు...’’ అంటూ గుబ్బల శ్రీనివాస్ ఫేస్బుక్లో నిర్వేదం వ్యక్తం చేశారు.
‘‘బాలారిష్టాలను దాటి బతికి బట్టగడితే.. అనునిత్యం ఎదరయ్యే వేధింపుల పర్వాలు.. పెద్దరికం మాటున క్రూరంగా సాగే వికృత చేష్టలు...’’ అంటూ చిన్నారులపై అత్యాచారాల మీద బాలాజి ఎస్ అంటూ యూజర్ ట్విటర్ కవితలో ఆవేదన వ్యక్తీకరించారు.
‘‘ఆడపిల్లలపై దాడులకు మూలకారణం ఏమిటి?‘‘
‘‘ఆడపిల్లల మీద లైంగిక దాడులకు మూలకారణం ఏమిటి?’’ అంటూ దళిత, బహుజన ఫ్రంట్ నాయకుడు, విశ్లేషకుడు జిలుకర శ్రీనివాస్ మహరాజ్ ఫేస్బుక్ వేదికగా విశ్లేషించే ప్రయత్నం చేశారు.
‘‘ఒకటి బ్రాహ్మణిజం. రెండు పితృస్వామిక వ్యవస్థ. ఈ రెండూ ఇంటర్రిలేటెడ్’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘జరిగిన ప్రతి అత్యాచార హత్యల్లో ఒక నిర్దేశిత ప్యాట్రన్ కనిపిస్తుంది. ఇది పితృస్వామ్య భావజాల ఫలితం. అయితే బ్రాహ్మణిజమే పితృస్వామ్య దాడులకు కారణం. స్త్రీని లైంగిక భోగ వస్తువుగా, శూద్ర వర్ణాలను సేవ చేసే బానిసలుగా అది నిర్ధారించింది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
చర్యలు చేపట్టని చంద్రబాబు బాధ్యులు కారా?: జగన్
దాచేపల్లి ఘటన మీద రాజకీయ పక్షాలూ సోషల్ మీడియాలో స్పందించాయి. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఇటీవల చాలా జరుగుతున్నాయని.. నిందితుల్లో అధికులు అధికార పక్షమైన టీడీపీ వారే ఉన్నారని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
‘‘కొద్ది నెలలుగా ఏపీలో ఇలాంటి దారుణ సంఘటనలు చాలా నమోదవుతున్నాయి. దోషుల్లో అత్యధికులు టీడీపీ వాళ్లే కావటం వల్ల వారిని సరిగ్గా చట్టం ముందు నిలబెట్టటం లేదు. దానివల్ల ఈ నేరాలు పెరుగుతున్నాయి. ఏ చర్యలూ చేపట్టకపోవటానికి @ncbn (ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు) మీరు బాధ్యులు కారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు.
పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలి: పవన్‌కళ్యాణ్
‘‘కఠువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రవేదనకి గురవుతోంది’’ అని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ట్విటర్లో వ్యాఖ్యానించారు.
‘‘అసలు ఆడబిడ్డ పైన ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే పబ్లిక్‌గా శిక్షించే విధానాలు రావాలని నేను కోరకుంటున్నాను..’’ అని ఆయన పేర్కొన్నారు.
తక్షణమే కఠిన చర్యలకు ఆదేశించాను: చంద్రబాబు
‘‘దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చాలా ఆగ్రహం కలిగిస్తోంది. నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి మద్దతు అందించాలని ఐజీ, జిల్లా ఎస్పీకి నిర్దేశించాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే.. దాచేపల్లి అత్యాచారం కేసులో నిందితుడైన సుబ్బయ్య శవం లభ్యం కాగా, ఆయన చెట్టుకు ఉరి వేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)