కర్ణాటక ఎన్నికలు: ముస్లింల ఓట్లు ఎవరికి పడతాయి?

  • 4 మే 2018
కర్ణాటక ఎన్నికలు, ముస్లింలు Image copyright Getty Images

కర్ణాటక ఎన్నికలలో కూడా బీజేపీ ముస్లింలతో 'టచ్-దెమ్-నాట్' విధానాన్ని అవలంబిస్తోంది. దీంతో అక్కడ ముస్లింలకు కాంగ్రెస్, జనతా దళ్ సెక్యులర్‌(జేడీఎస్)లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవడం మినహా ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

అయితే పరిస్థితులను బట్టి చూస్తే, ముస్లింలు చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అయితే 'విశ్వసనీయత' కలిగిన జేడీఎస్ అభ్యర్థి కనుక బరిలో నిలబడితే, కులమతాలతో పట్టింపు లేకుండా ముస్లింలు వారికే ఓటు వేసే అవకాశం కూడా ఉంది.

''ఆ ప్రత్యామ్నాయం కూడా కేవలం దక్షిణ కర్ణాటక జిల్లాలలో కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య పోటీ ఉన్న చోట మాత్రమే. కానీ ఉత్తర, కోస్తా, మధ్య కర్ణాటక జిల్లాలు - అంటే సుమారు 150 నియోజకవర్గాలలో ముస్లింలకు ఉన్న ప్రత్యామ్నాయం చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ దాదాపు జేడీఎస్ లేనే లేదని చెప్పొచ్చు'' అని రాజకీయ విశ్లేషకులు అర్షద్ ఆలీ బీబీసీకి తెలిపారు.

ఆయన కర్ణాటకలోని స్థానిక సంస్థలతో తగ్గిపోతున్న ముస్లింల ప్రాతినిధ్యంపై ఒక పుస్తకం రాశారు.

''మెజారిటీ ముస్లింల ఆందోళన తమ భద్రత గురించే. నిస్సందేహంగా 2014 తర్వాత ముస్లింలు చాలా భయాందోళనలతో ఉన్నారు. బీజేపీని ఓడించే అభ్యర్థి బరిలో నిలబడితే అతను స్వతంత్ర అభ్యర్థి అయినా అతనికే ఓటు వేస్తారు'' అని ఆలీ తెలిపారు.

Image copyright Getty Images

6.1 కోట్ల మంది జనాభా కలిగిన కర్ణాటకలో ముస్లింలు సుమారు 12 శాతం మంది ఉన్నారు. దాదాపు 60 నియోజకవర్గాలలో వారికి చెప్పుకోదగిన ప్రాబల్యం ఉంది.

ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 17 మంది, జేడీఎస్ 20 మంది ముస్లింలకు టికెట్లు ఇచ్చాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) నలుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది.

ఇక అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎమ్‌ఐఎమ్) హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో సుమారు 60-70 సీట్లకు పోటీ పెడతామని ప్రకటించింది కానీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గి, జేడీఎస్‌కు మద్దతు ఇస్తామని ప్రకటించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సిద్ధరామయ్య

''ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోలిస్తే కర్ణాటకలోని ముస్లింలు చాలా భిన్నం. ఇక్కడ ముస్లింలు ప్రధాన స్రవంతిలో ఉన్నారు. ఈసారి వారు ఇతర కులాల వారితో కలిసి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటారు. ఉదాహరణకు - ఈసారి వాళ్లు ఓబీసీలు, దళితులు, లింగాయత్‌లతో పాటు వొక్కలిగ వర్గానికి చెందిన వారితో కలిసి సాగాలని నిర్ణయించుకున్నారు'' అని ఎమ్మెల్సీ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రిజ్వాన్ అర్షద్ తెలిపారు.

''బీజేపీ ఈసారి ఎందుకు ఈ సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నించడం లేదంటే, విధానాల రీత్యా ఇతర కులాలు కూడా ఏకం అయ్యాయి'' అని రిజ్వాన్ వివరించారు.

ముస్లింలు ఈసారి తమ అనుకూల పార్టీలకు పూర్తిస్థాయిలో ఓటు వేస్తారని రిజ్వాన్, జేడీఎస్ ప్రతినిధి తన్వీర్ అహ్మద్ ఇద్దరూ విశ్వసిస్తున్నారు.

''ఓటింగ్‌లో ముస్లింలు ఒక పద్ధతిని అనుసరిస్తారు. దీర్ఘకాలం ఎవరితో అయితే తమ సంబంధాలు బలంగా ఉన్నాయో వారికే ముస్లింల ఓట్లు పడతాయి'' అని తన్వీర్ అహ్మద్ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి

‘హిందుత్వమయమైన బీజేపీ రాజకీయాలు’

కానీ మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ ముజఫర్ అసదీ మాత్రం ఈసారి ఎన్నికలలో ముస్లింల దృక్పధం భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

''ఈసారి మైనారిటీలంతా ఒకే బృందంగా ఓటు వేస్తారు. దీనికి మూడు కారణాలున్నాయి. ఒకటి, సిద్ధరామయ్య ప్రభుత్వం గతంలోలాగే తమకు భద్రత కల్పిస్తుందని వాళ్లు విశ్వసిస్తున్నారు. మతపరమైన చెదురుముదురు ఘటనలు - అవి నిజంగా ఘర్షణలు కావు - ఎక్కువగా కోస్తా ప్రాంతంలోనే ఉన్నాయి'' అని ఆయన తెలిపారు.

''రెండోది, ఈసారి ముస్లింలు జేడీఎస్‌ను నమ్మడం లేదు. ఎందుకంటే 2006లో ఆ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఒప్పందంలో భాగస్వామిగా ఉంది'' అని ప్రొఫెసర్ అసదీ వివరించారు.

''మూడోది - ముస్లింలకు సీట్లను నిరాకరించే విధానాన్ని బీజేపీ కొనసాగిస్తోంది. ఆ పార్టీ రాజకీయాలు పూర్తిగా హిందుత్వమయమై పోతున్నాయి. కానీ ఉత్తరప్రదేశ్, బిహార్‌లో మాదిరి కాకుండా ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు'' అని ఆయన వివరించారు.

''అభ్యర్థుల కారణంగానే ముస్లింలు సామూహికంగా ఏదో ఒక పార్టీ వైపు మొగ్గుతారని చెప్పలేం. అయితే అదే సమయంలో, మంచి అభ్యర్థి ఉంటే ముస్లింలు వారికే ఓటు వేసే అవకాశం ఉంది'' అని రిజ్వాన్ అన్నారు.

అందువల్ల జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి లాంటి వారికి రామనగరం నియోజకవర్గంలో మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే ఆ పక్కనే ఉన్న చెన్నపట్నలో అదే పరిస్థితి ఉండకపోవచ్చు.

''కుమారస్వామి ముస్లింలతో చాలా స్నేహపూరితంగా ఉంటారు. అందువల్ల అదేమీ ఆశ్చర్యకరం కాదు. కానీ షికారీపురా నియోజకవర్గంలో బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప ఆ నియోజకవర్గంలోని ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ముస్లింలు, కురబలు (ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం) ఇద్దరూ కూడా ఆయనకే ఓటు వేసే అవకాశం ఉంది'' అని ప్రొఫెసర్ అసాదీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)