Nationalism - రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’

 • బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
 • బీబీసీ ప్రతినిధి
రవీంద్రనాథ్ ఠాగూర్

ఫొటో సోర్స్, Getty Images

''జాతీయవాదానికి సరైన అర్థాన్ని భారతదేశం ఎన్నడూ తెలుసుకోలేదు'' అని రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్నారు.

'జాతీయవాదం' పేరిట వెలువడ్డ ఓ పుస్తకంలో పాశ్చాత్య దేశాల్లో, జపాన్‌లో, భారతదేశంలో జాతీయవాదం గురించి ఆయన చేసిన ప్రసంగాలు, రచనలను చేర్చారు.

'ది సన్‌సెట్ ఆఫ్ ద సెంచురీ' అనే కవితను కూడా ఇందులో ప్రచురించారు. 1917లో తొలిసారిగా ప్రచురితమైన ఈ పుస్తకంలో రవీంద్రనాథ్ ఠాగూర్ పేర్కొన్న కొన్ని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

 • భారతదేశంలో సమస్య రాజకీయపరమైనది కాదు. అది సామాజికపరమైనది. ఈ పరిస్థితి భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. అన్ని దేశాల్లోనూ ఇలాగే ఉంది. పాశ్చాత్య దేశాల్లో రాజకీయాలపై పాశ్చాత్య ఆదర్శాల ప్రభావం ఉంది. భారతదేశం వాటిని అనుకరించేందుకు ప్రయత్నిస్తోంది.
 • ప్రేమలోని నైతిక శక్తి, ఆధ్యాత్మిక ఐక్యతా దృష్టి, పరుల పట్ల వీలైనంత తక్కువ శత్రుత్వ భావనలు, ఇతరుల స్థానంలో తమను ఊహించుకునే సానుభూతి ఉన్నవాళ్లే భవిష్యత్తు తరాల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. నిరంతరం పోరాడే తత్వం, పరుల పట్ల అసహనం ఉన్నవాళ్లు తుడిచిపెట్టుకుపోతారు.
 • జాతీయవాదానికి సరైన అర్థాన్ని భారతదేశం ఎన్నడూ తెలుసుకోలేదు.
 • దేశం లేదా జాతి అనేది మానవత్వ ఆదర్శాల కంటే గొప్పది అని బోధించే విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినప్పుడే నా దేశస్థులు నిజమైన భారతదేశాన్ని సొంతం చేసుకుంటారు.
 • ఇతరుల చరిత్రను అద్దెకు తెచ్చుకోరాదని భారతీయులు గుర్తెరగాలి. మన గొంతును మనమే అణచుకుంటే.. మనం ఆత్మహత్య చేసుకుంటున్నట్లే. మన జీవితానికి సంబంధించని వాటిని మనం అద్దెకు తెచ్చుకుంటే.. అవి మన జీవితాన్ని నాశనం చేసేందుకే పనికొస్తాయి.
 • మనం తప్పనిసరిగా ఒకటి గుర్తుంచుకోవాలి. అదేమంటే మనముందు భవిష్యత్ ఉంది. అది గొప్ప నైతిక ఆదర్శాలు ఉన్న వాళ్లకోసమే వేచి చూస్తోంది తప్ప భౌతికాంశాల్లో గొప్పగా ఉన్నవాళ్ల కోసం కాదు.
 • పాశ్చాత్య ప్రపంచం నుంచి భారత్ ఏమీ అడుక్కోవట్లేదు. ఒకవేళ పాశ్చాత్యం అలా అనుకుంటున్నప్పటికీ కూడా. అయితే, పాశ్చాత్య నాగరికతను దూరం చేయాలని, మనం వేరుగా ఉండాలని నేను అనటం లేదు. ఈ రెండింటి మధ్య మంచి సహకారం ఉండాలి.
 • నేను ఏదో ఒక దేశం లేదా జాతికి వ్యతిరేకం కాదు. దేశాలు లేదా జాతులు అనే భావనకే వ్యతిరేకం. అసలు జాతి అంటే ఏంటి?

ఫొటో సోర్స్, unesco

ఫొటో క్యాప్షన్,

రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌

జాతి.. జాతీయవాదం

 • మొత్తం ప్రజలంతా వ్యవస్థీకృత శక్తిగా మారటం. బలీయంగా, సమర్థనీయంగా తయారయ్యేలా ఈ వ్యవస్థ నిరంతరం జనాభాను ప్రేరేపిస్తుంది. ఈ క్రమంలో మనిషి తన సృజనాత్మకతను, అత్యుత్తమ స్వభావాన్ని కోల్పోతున్నాడు. ఈ వ్యవస్థను నిర్వహించేందుకు.. నైతికత అనే ఉత్కృష్ట లక్ష్యం నుంచి మానవుడు తప్పుకుంటున్నాడు. ఈ యాంత్రికతలోని ఘనతల ద్వారా సంతృప్తిని పొందుతున్నాడు. ఇది మానవాళికి పెనుముప్పు.
 • జాతీయవాదం ప్రమాదకారి. ఎన్నో ఏళ్లుగా భారతదేశ సమస్యలకు అదే మూలం.
 • యూరప్ భిన్న దేశాలుగా విడిపోయిన ఒకే దేశం లాంటిదైతే.. భారతదేశం మాత్రం భిన్న దేశాలు కలిసిన ఒకే దేశం. విస్తీర్ణంలోను, జాతుల మధ్య భిన్నత్వంలోనూ భారతదేశం చాలా విస్తృతమైనది. భారతదేశ సహనస్ఫూర్తిలో నుంచి పుట్టుకొచ్చిందే కుల వ్యవస్థ. తమ వైరుధ్యాలను కొనసాగిస్తూనే స్వతంత్రతను అనుభవించేలా.. భిన్న వ్యక్తుల్ని కలిపేందుకు, సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు భారతదేశం చాలా ప్రయోగాలు చేస్తోంది. సంయుక్త రాష్ట్రాల సామాజిక సమాఖ్య వంటి దానిని అది ఉత్పత్తి చేసింది. దీని సార్వత్రిక నామం.. హిందూయిజం.
 • అయితే భారతదేశం ఎక్కడ విఫలమైందంటే.. మానవుల మధ్య విభేదాలు పర్వతాల వంటి, ఎప్పటికీ నిశ్చలంగా ఉండే భౌతిక అడ్డుగోడలు కాదు. జీవన ప్రవాహం లాగే అవి కూడా చలనశీలమైనవి. తమన దిశను, రూపాన్ని, మోతాదును అవి ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి.
 • ఒక నాగరికత నైతిక ఆరోగ్య సూత్రాలను మర్చిపోయి భౌతిక అంశాలను ఆబగా పెంపొందించుకుంటూ పోగలదా?
 • మన సామాజిక ఆదర్శాలే మానవ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. కానీ, అధికారంపై అత్యాశ వల్ల వాటి నుంచి మన మనస్సు పక్కదోవ పట్టిందంటే మనం ఒక మత్తులో, అసాధారణ ప్రపంచంలో బతుకుతుంటాం. అక్కడ మన శక్తి ఆరోగ్యకరమైనది కాదు. మన స్వేచ్ఛ స్వతంత్రం కాదు. కాబట్టి, మన మనస్సు స్వతంత్రంగా లేనప్పుడు రాజకీయ స్వాతంత్ర్యం మనకు స్వేచ్ఛను ఇవ్వలేదు.
 • మన జాతీయవాదులు ఆదర్శాల గురించి మాట్లాడేప్పుడు జాతీయవాదానికి ఆధారం కావాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
 • ప్రస్తుత వాణిజ్య నాగరికత మనిషి సమయాన్ని, పరిధిని చాలా ఎక్కువగా వాడుకోవటమే కాదు వాటిని చంపేస్తోంది. మనిషి తన వ్యవస్థలకు తగినంత స్థానం కల్పించే క్రమంలో తననుతాను తగ్గించేసుకుంటున్నాడు.
 • క్రూరమైన వాణిజ్యవాదం మానవ జాతికి పెను ముప్పు.
 • మన జీవితం బయటకు సాధారణంగానూ, లోపల గొప్పగానూ ఉండాలి.
 • మన నాగరికత వైఖరి.. ఆర్థిక దోపిడీ, సంఘర్షణపై కాకుండా సామాజిక సహకారంపై ఆధారపడాలి.

ఫొటో సోర్స్, E. O. Hoppe/Hulton Archive/Getty Images

ఠాగూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

 • సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఆసియా వాసి రవీంద్రనాథ్ ఠాగూర్. యూరప్‌కు చెందని తొలి వ్యక్తి కూడా ఆయనే. 20వ శతాబ్దంలో భారతదేశం అందించిన గొప్ప కవి, దార్శనికుడు అని ఆయన్ను అభివర్ణిస్తుంటారు. 156 సంవత్సరాల కిందట 1861 మే 7వ తేదీన కలకత్తాలో ఆయన జన్మించారు.
 • సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, శాస్త్రీయ రంగాల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపైన, బెంగాల్ పునరుజ్జీవనంపైన ఠాగూర్ కుటుంబం తనదైన ముద్ర వేసింది.
 • రవీంద్రనాథ్ ఠాగూర్ ముత్తాత జైరామ్ ఠాగూర్ 18వ శతాబ్ధంలో ఈస్టిండియా కంపెనీలో రెవెన్యూ కలెక్టర్‌గా పనిచేశారు. రవీంద్రనాథ్ తాత ద్వారకానాథ్ ఠాగూర్ 19వ శతాబ్ధం ప్రారంభంలో కలకత్తాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందారు. అప్పట్లో కలకత్తా నగరం ఈస్టిండియా కంపెనీకి రాజధానిగా ఉండేది. ఆయన చాలా ధనవంతుడని, బ్రిటిషర్లు, ఆంగ్లో-ఇండియన్లతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉండేవని, బ్రిటన్ రాణి విక్టోరియాతో కలసి భోజనం కూడా చేశారని సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీలో ఆధునిక చరిత్ర విభాగం లెక్చరర్‌ చంద్రికా కౌల్ బీబీసీకి చెప్పారు. ఈస్టిండియా కంపెనీ భారతదేశస్థులకు కల్పించిన వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకుని, లబ్ధి పొందిన వారిలో ఆయన కూడా ఒకరని ఆమె తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి ఆంగ్లో-ఇండియన్ కంపెనీ 'ఠాగూర్ కార్స్ అండ్ సన్స్'ను ఏర్పాటు చేసింది కూడా ఆయనేనని వెల్లడించారు.
 • రవీంద్రనాథ్ ఠాగూర్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ఆయన్ను 1913లో నామినేట్ చేసిన వ్యక్తి థామస్ స్టుర్జ్ మూరే. అప్పట్లో ఆయన లండన్‌లోని రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్‌లో సభ్యుడిగా ఉన్నారు. ''ఆ సమయంలో ఠాగూర్ బ్రిటన్ నుంచి అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా నవంబర్‌లో భారతదేశానికి వచ్చారు. నోబెల్ బహుమతి వచ్చిందని తెలిసినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపోయింది ఠాగూరే'' అని చంద్రికా కౌల్ వెల్లడించారు.
 • బ్రిటిష్ ప్రభుత్వం ఠాగూర్‌ను 1915 జూన్ 3వ తేదీన నైట్‌హుడ్‌ పురస్కారంతో సత్కరించింది. అయితే, 1919లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో బ్రిటిష్ వైఖరికి నిరసనగా, అప్పటికే భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న భారతీయులకు మద్దతుగా ఈ బిరుదును ఉపసంహరించుకుంటున్నానని ఠాగూర్ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Suraj Kumar

విద్యా విధానంపై ఠాగూర్ ఆలోచనలు

1901వ సంవత్సరంలో ఠాగూర్ శాంతినికేతన్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రాచీనమైన తపోవన విద్యావిధానాన్ని ఆయన ప్రోత్సహించారు. గురువు, శిష్యులు ప్రకృతికి దగ్గరగా ఉండే, ఎలాంటి గోడలు లేని విద్యావిధానమే మేలని భావించారు. ఇక్కడ సాహిత్యం, కళలతో పాటు తర్వాత సైన్స్‌ను కూడా బోధించేవారు.

శాంతి నికేతన్‌కు అవసరమైన నిధుల కోసం ఆయన విదేశాల్లో ప్రసంగాలు చేసి, విరాళాలు స్వీకరించేవారు.

విద్యా విధానంపై వందేళ్ల కిందట ఠాగూర్ రాసిన 'బంగారు పంజరంలో చిలుక' కథ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విద్యావిధానంలోని లోపాలను గుర్తు చేస్తుంది. ఆ కథలో ఒక రాజు స్వేచ్ఛగా తిరిగే చిలుకకు చదువు చెప్పాలని ఆదేశాలు జారీ చేస్తాడు. బంగారు పంజరం కట్టి, పనివాళ్లను, పండితుల్ని నియమించి, పుస్తకాలను చిలుక నోట్లో కుక్కుతుంటారు.

రాజు కూడా చిలుక చదువుకు చేసిన ఏర్పాట్లపైనే దృష్టి పెడతాడు తప్ప చిలుక ఏం నేర్చుకుంటోంది? అది సరైన పనేనా? కాదా? అన్నవి పట్టించుకోడు. ఈ విధానాన్ని ఎత్తిచూపిన వ్యక్తిని కూడా శిక్షిస్తాడు. చివరకు చిలుక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. దాని స్వేచ్ఛను కోల్పోతుంది.

సహజ లక్షణాలను ప్రోత్సహించకుండా యాంత్రిక చదువులు సరికాదనే అర్థంతో సరిగ్గా వందేళ్ల కిందట 1918వ సంవత్సరంలో ఠాగూర్ ఈ కథను రాశారు.

ఫొటో సోర్స్, unesco

గాంధీ-ఠాగూర్ స్నేహం..వైరుధ్యం

మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్ ఇద్దరూ స్నేహితుల్లా పరస్పరం గౌరవించుకుంటూనే, కొన్ని విషయాల్లో విరుద్ధమైన భావాలు కలిగి ఉండేవారు. గాంధీ సూచించిన గ్రామ స్వరాజ్యం సిద్ధాంతాలను ఆచరించేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఠాగూర్ కృషి చేశారు.

రాజకీయ అధికారం, స్వాతంత్ర్యం సాధించాలన్నదే గాంధీ ప్రధానోద్దేశం కాగా.. ఠాగూర్ మాత్రం భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం కంటే సమాజాభివృద్ధి, సామాజిక సంస్కరణలే ప్రధానమని భావించారని చంద్రికా కౌల్ తెలిపారు.

ఇంటిని చక్కదిద్దుకోకుండా రాజకీయ స్వాతంత్ర్యం సాధించినప్పటికీ.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను అది పరిష్కరించలేదని ఆయన భావించేవారు. 1920-22 సంవత్సరాల్లో గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టగా.. ఠాగూర్ మాత్రం శాంతి నికేతన్ కోసం విరాళాలు సేకరించేందుకు యూరప్ పర్యటనలో ఉన్నారు.

భారతదేశానికి పాశ్చాత్య యూనివర్శిటీలు, మేధావుల సహకారం అవసరమని ప్రచారం చేస్తున్నారు. విదేశీ వస్తువులను దగ్ధం చేయాలని, పాఠశాలలను బహిష్కరించాలని గాంధీ పిలుపునిస్తే.. దీన్ని ఠాగూర్ వ్యతిరేకించారు.

పేదలకు వస్త్రాలు ఇవ్వకుండా వారివద్ద ఉన్న వాటిని కూడా దగ్ధం చేయాలని కోరడం సమంజసం కాదని, అలాగే.. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా విద్యాసంస్థల్ని బహిష్కరించాలని విద్యార్థులకు పిలుపునివ్వటం ఏమిటని ఠాగూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరువురూ తమతమ అభిప్రాయాలను పత్రికల్లో వ్యాసాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, Topical Press Agency/Getty Images

ఠాగూర్.. అంతర్జాతీయవాది

ఠాగూర్ ఒక అంతర్జాతీయవాది అని చంద్రికా కౌల్ వ్యాఖ్యనించగా.. ఎడిన్‌బరో నేపియన్ యూనివర్శిటీలో ఇంగ్లీష్ లిటరేచర్, క్రియేటివ్ రైటింగ్ ప్రొఫెసర్‌ బషబి ఫ్రేజర్ కూడా ఏకీభవించారు. ఆయన భారతదేశంలోనే కాకుండా జపాన్, అమెరికాల్లో జాతీయవాదాన్ని కూడా విమర్శించారని ఆమె బీబీసీకి చెప్పారు.

పాశ్చాత్య దేశాలతో ఠాగూర్‌కు మంచి సంబంధాలు ఉండేవని, ఆ సంస్కృతిని ఆయన ఇష్టపడేవారని తెలిపారు. అయితే, అంతా పాశ్చాత్య దేశాలవైపు చూస్తున్నప్పుడు ఆయన జపాన్, చైనా వంటి దేశాలపైనా దృష్టి సారించారని వెల్లడించారు. భారతదేశానికి కావాల్సింది స్వాతంత్ర్యం మాత్రమే కాదని, ప్రపంచంతో సంబంధాలని కూడా ఆయన భావించారన్నారు.

అన్ని దేశాలు, వాటి సంస్కృతుల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఠాగూర్ భావించారని లండన్ యూనివర్శిటీ దక్షిణాసియా విభాగంలో పనిచేస్తున్న జాన్ స్టీవెన్స్ తెలిపారు. సంస్కృతులు పరస్పరం పంచుకున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, కాబట్టి భారతదేశం ప్రపంచానికి దూరంగా కాకుండా.. ప్రపంచ దేశాలతో కలసి అభివృద్ధి చెందాలని ఠాగూర్ ఆకాంక్షించారన్నారు. బ్రిటిష్ సంస్కృతిని ఠాగూర్ స్వాగతించినప్పటికీ.. ఆ దృష్టి కోణంలోనే భారతదేశం ఎదగాలని ఆయన కోరుకోలేదన్నారు.

ఠాగూర్ ఐదు ఖండాల్లో దాదాపు 30 దేశాల్లో పర్యటనలు చేశారు. బహుశా ఆయన జరిపిన విస్తృత అంతర్జాతీయ పర్యటనలతో ఏర్పడ్డ భావాలను ఆచరణాత్మకంగా అమలు చేయాలని ఠాగూర్ భావించి ఉండవచ్చునని జాన్ వెల్లడించారు.

(మే 7న రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బీబీసీ ప్రత్యేక వ్యాసం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)