ప్రెస్ రివ్యూ : ‘వెంకటేశ్వరుడిపై కేంద్రం కన్ను’

  • 6 మే 2018
Image copyright Facebook

''తిరుమల- తిరుపతి దేవస్థానం, దాని అనుబంధ ఆలయాలను తన పరిధిలోకి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలియడంతో రాష్ట్రమంతా కలకలం రేగింది'' అంటూ.. నవ తెలంగాణ పత్రిక.. వెంకన్నపై ‘మోదీ కన్ను’ పేరుతో ఓ కథనం ప్రచురించింది. అందులో..

టీటీడీ ఆలయాలను తన పరిధిలోకి తీసుకునే అంశంపై కేంద్ర ప్రభుత్వం.. విజయవాడలోని పురాతత్వశాఖ అధికారుల ద్వారా టీటీడీ ఈవోకు నోటీసు పంపడంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

దీంతో కేంద్రం ఒక్క రోజులోనే.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. టీటీడీ ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలోకి చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలను తీసుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది.

రక్షిత కట్టడాలుగా ప్రకటిస్తే.. టీటీడీ కేంద్రం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఆదేశాలు వెనక్కి : సింఘాల్

కేంద్ర పురావస్తుశాఖ ఉత్తర్వులు భక్తుల్లో కలకలం రేపడంతో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర పురావస్తు శాఖ ఉత్తర్వులపై విలేకర్లు ప్రశ్నించగా.. ఉత్తర్వులు వచ్చినమాట వాస్తవమేనన్నారు.

దీనిపై నివేదికను సిద్ధం చేశామనీ, ఇంతలోనే పురావస్తు శాఖ ఉత్తర్వులను వెనక్కితీసుకున్నట్లుగా ఫోన్‌ వచ్చిందని తెలిపారు. పరిశీలన పేరుతో పురాతత్వశాఖ అధికారులు ఫోటోలు తీసుకోవడానికి తాము అంగీకరించబోమన్నారంటూ నవ తెలంగాణ పేర్కొంది.

సౌర తుపాను

సౌర తుపాను ఆదివారం భూమిని తాకే అవకాశముందని పరిశోధకులు అంచనా వేస్తున్నారంటూ.. ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

ఈ నెలలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోనుండటం ఇదే తొలిసారి. దీని వల్ల స్వల్పకాలంపాటు ఉపగ్రహ ఆధారిత సేవలకు ఆటంకం ఏర్పడే అవకాశముంది.

సూర్యుడి నుంచి భారీ స్థాయిలో కాస్మిక్‌ రేణువులు భూమివైపుగా వస్తున్నట్లు ''స్పేస్‌ వెదర్‌'' వెబ్‌సైట్‌ తెలిపింది. సూర్యుడి ఉపరితలంపై కనిపిస్తున్న ఓ భారీ రంధ్రం భూమి వైపుగా సౌర పవనాలను నెడుతోందని వెల్లడించింది.

నాసా సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ తీసిన ఓ చిత్రాన్నీ పంచుకుంది. దీనిలో సూర్యుడి బాహ్య పొరలో ఓ రంధ్రం కనిపిస్తోంది. ఇక్కడి నుంచే సూర్యుడి అయస్కాంత క్షేత్రం తెరుచుకుని భారీ పరిమాణంలో వాయువులు బయటకు వస్తాయి.

అయితే తాజా చిత్రంలో ఈ రంధ్రం చీకటిగా కనిపిస్తోంది. భారీ వెలుగులు విరజిమ్మే వాయువులు ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు ఈ తుపానును స్వల్పతీవ్రత గల 'జీ-1'గా నేషనల్‌ ఓసియానిక్‌ అండ్‌ అట్మాస్ఫిరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌వోఏఏ) అంచనా వేసిందంటూ ఈనాడు కథనం తెలిపింది.

Image copyright MCI

150 ఎంబీబీఎస్ సీట్లకు కోత

ఆంధ్రప్రదేశ్‌‌లో 150 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడిందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

తగిన సౌకర్యాలు లేని కారణంగా గుంటూరు, కాకినాడ, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 సీట్ల చొప్పున భారతీయ వైద్య మండలి కోత వేసింది. నెల్లూరు, తిరుపతిలోని పద్మావతి కళాశాలలు సీట్ల కోత నుంచి తృటిలో తప్పించుకున్నాయి.

మే 6న దేశవ్యాప్తంగా నీట్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం 1900 సీట్లలో 150 సీట్లకు కోత పడటంతో ఆందోళన చెందుతున్నారు.

గుంటూరు, కాకినాడ, తిరుపతిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన దారుణంగా ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎంసీఐ.. సమాచారం పంపింది.

అనాటమీ విభాగంలో మృతదేహాలను, అవయవాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు కూడా లేవని ఎంసీఐ పాలకమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది.

గతేడాది 50 సీట్ల చొప్పున పెంచారు. అందుకు తగ్గట్లు వసతులు కల్పించాలని సమయమిచ్చినా ప్రభుత్వం చేయలేకపోయిందని, అందుకే 50 సీట్ల చొప్పున కోత విధించామని ఎంసీఐ పేర్కొన్నట్లు సాక్షి దినపత్రిక తెలిపింది.

నారా చంద్రబాబునాయుడు Image copyright Nara Chandrababu Naidu/Facebook

రాష్ట్ర రహదారుల నిర్వహణ ప్రైవేటుకే.. : చంద్రబాబు

'రాష్ట్ర రహదారుల నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది' అంటూ.. ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

రాష్ట్రంలోని సుమారు 4వేల కిలోమీటర్ల రహదారి నిర్వహణ బాధ్యతలను ఇక ప్రైవేటుకు ఇచ్చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రోడ్లు భవనాల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

పైలట్‌ ప్రాజెక్టు కింద కనీసం ఐదేళ్లపాటు ప్రైవేటు నిర్వహణకు ఇచ్చేయాలని స్పష్టం చేసింది. శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్లు భవనాల శాఖ ప్రాజెక్టులపై సమీక్ష చేశారు.

ఫిబ్రవరి నెలాఖరుకల్లా గుంతలు కనబడకూడదని తాను ఆదేశించినా.. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో రోడ్లు బాగుచేయలేకపోయారని ఆక్షేపించారు.

''ఇకపై ఎక్కడా రహదారులపై గుంతలు కనిపించకూడదు. ఎప్పటికప్పుడు ప్రైవేటు సంస్థలతో మరమ్మతులు చేయించాలి. ఇందుకోసం ఆర్‌అండ్‌బీకి రూ.250 కోట్లు కేటాయించాలి. రహదారుల నిర్మాణం, నిర్వహణను సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలి.

డ్రోన్‌ కెమేరాలతో వాటి స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. సమయానికి నిర్మాణం పూర్తిచేయని సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాలి. 2021-22కల్లా రాష్ట్రంలోని 1,800 కి.మీ. రోడ్లను రూ.1500 కోట్లతో బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాలి.

ఈ ఏడాది రూ.500 కోట్లతో 570 కి.మీ. బీటీ రహదారులను నిర్మించాలి. సాగునీటి ప్రాజెక్టుల తరహాలోనే రహదారి ప్రాజెక్టులనూ ప్రాధాన్య క్రమంలో నిర్దుష్ట కాలంలో పూర్తిచేయాలి’’ అని చంద్రబాబు ఆదేశించారంటూ ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)