నాడు చెత్త ఏరిన చేతులు నేడు కెమెరా పట్టుకున్నాయి!

  • 7 మే 2018
మాయా ఖోడ్వే Image copyright MAYA KHODVE / FACEBOOK
చిత్రం శీర్షిక చెత్తను ఏరుకోవడం నుంచి వీడియోలు తీయడం వరకు...

ఆమెకు రాయడం రాదు. అయితేనేం.. కెమెరా ద్వారానే తన కథలను చెబుతుంది.

''ఒకరోజు ఒక పోలీసు నా చేతిలో కెమెరాను చూశాడు. మరో ఆలోచన లేకుండా నన్ను కొట్టాడు'' అన్నారు మాయా ఖోడ్వే.

మహారాష్ట్రలోని నాసిక్‌లో చెత్తను ఏరుకునే మాయా ఫొటోలు తీయడం ప్రారంభించిన మొదట్లో జరిగిన ఒక సంఘటన అది.

''నాసిక్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థ చెత్తను ఏరుకునే మహిళలకు కెమెరాను ఎలా హ్యాండిల్ చేయాలి, ఫొటోలు ఎలా తీయాలన్న దానిపై శిక్షణ ఇచ్చేది. మా రోజువారీ జీవితాలపై షార్ట్ ఫిల్మ్స్ తీయాలనేది వాళ్ల ఉధ్దేశం. మా శిక్షణలో భాగంగా మమ్మల్ని ఒక డంపింగ్ యార్డ్‌కు తీసుకెళ్లారు. మేమంతా కొన్ని షాట్లు తీసుకున్న తర్వాత అందరూ టీ తాగడానికి వెళ్లిపోయారు. నేను మాత్రం మరికొన్ని షాట్లు తీసుకోవాలని అక్కడే ఉండిపోయా. నాకు పెద్దగా తెలియకున్నా కొన్ని ప్రయోగాలు చేద్దామనుకున్నా'' అని మాయా తెలిపారు.

''హఠాత్తుగా ఒక పోలీసు వచ్చి నేను ఒక ఖరీదైన కెమెరాతో ఫొటోలు తీయడం చూసి, ఏమీ అడగకుండానే నన్ను కొట్టాడు. బహుశా నేను దాన్ని దొంగలించానని అతను భావించి ఉండొచ్చు.''

మాయా ఈ విషయాన్ని చాలా మామూలుగా చెప్పారు.

''ఒకానొక సమయంలో నా చేతిలో కెమెరా ఉన్నందుకు నన్ను కొట్టారు. ఈరోజు అదే కెమెరా నా చేతిలో అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమైంది'' అంటారు మాయా.

మాయా చిన్నప్పటి నుంచి తల్లితో పాటు చెత్తను ఏరుకుని జీవించేవారు. ఆమె చదువుకోలేదు.

''చెత్తను ఏరుకునే మమ్మల్ని కూడా చెత్తను చూసినట్లే చూసేవాళ్లు. మేం రోడ్డు మీద వెళుతుంటే, ముక్కు మూసుకునేవాళ్లు. అది చాలా బాధ పెట్టేది. మేం చెత్తను ఎత్తేస్తున్నాం. పరిసరాలను శుభ్రం చేస్తున్నాం. ఓ రకంగా సమాజానికి సేవ చేస్తున్నాం. అయినా ఎందుకు మా పట్ల ఇంత చులకనగా ప్రవర్తిస్తారు? ఈ పరిస్థితిని ఎలా మార్చాలని నేను తీవ్రంగా ఆలోచించాను.''

చదువుకు ప్రత్యామ్నాయంగా కెమెరా

ఈ ఆలోచనతోనే ఆమె నాసిక్‌లోని అభివ్యక్తి మీడియా ఫర్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో చేరారు. 2011లో ఆమె ఆ సంస్థ ద్వారా కెమెరా షూటింగ్‌లో శిక్షణ పొందారు.

''నేనెన్నడూ పాఠశాలకు వెళ్లలేదు. మన భావాలు ఎక్కువ మందికి చేరాలంటే రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఈ విషయంలో నాకు కెమెరా ప్రత్యామ్నాయంగా కనిపించింది'' అని మాయా తెలిపారు.

''సామాన్యులు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. కానీ వాటికి పరిష్కారాలు తెలిసిన వారికి సమస్యలను పరిష్కరించడంపై ఆసక్తి ఉండదు. మాలాంటి చెత్తను ఏరుకునేవాళ్లకు కూడా అనేక సమస్యలు ఉంటాయి. కానీ మా కోసం ఎవరూ ఏమీ చేయడం లేదు. అందుకే నేను మా సమస్యల మీద షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకున్నాను '' అని మాయా వెల్లడించారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక ఎడిటింగ్‌లో నిమగ్నమైన మాయా

కెమెరాతో షూట్ చేస్తుంటే జనం నవ్వేవాళ్లు

మాయాకు శిక్షణ ఇస్తామన్న సంస్థ కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాజెక్టును నిలిపేసింది. మాయా వద్ద సొంత కెమెరా లేదు. అందువల్ల చెత్తను ఏరుకునేవాళ్ల సమస్యలను ప్రపంచానికి చెప్పాలన్న ఆమె కోరిక తీరలేదు.

''నా శిక్షణ అంతా వృధా అయిపోతుందని నాకు భయమేసింది. అదృష్టవశాత్తూ 2013లో నాకు వీడియో వాలంటీర్స్ అనే మరో సంస్థతో పరిచయమైంది. వీడియా ద్వారా సామాజిక న్యాయం సాధించాలనేది ఆ సంస్థ ఆశయం. నేను వారి కోసం పని చేయడం ప్రారంభించాను. మొట్టమొదటిసారిగా నా పనికి ఆదాయం కూడా రావడం ప్రారంభమైంది.'' అని మాయా తెలిపారు.

''నా మొదటి వీడియోను నేను మా ఇంటికి దగ్గర్లో తీసాను. ఒక డ్రైనేజీ పైపు పగిలి మొత్తం నీరంతా ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. నేను దాన్నంతా షూట్ చేస్తుంటే అక్కడున్న వాళ్లంతా నవ్వారు. నాకు పిచ్చి పట్టిందన్నారు. వీడియో తీసి, దాన్ని వాళ్లకు చూపించినపుడు మాత్రం, అది వాళ్లకు బాగా నచ్చింది. మేమంతా కలిసి అధికారుల వద్దకు వెళ్లి, ఈ వీడియో చూపించి సమస్యను పరిష్కరించాలని కోరాం. ఆరోజు ఆదివారమైనా అధికారులు మా మాటను మన్నించి డ్రైనేజీ పైపును రిపేర్ చేయించారు. అది నా కెమెరాకు లభించిన మొదటి విజయం. దాంతో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది.''

వీడియోలు తీసే క్రమంలో మాయా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. పోలీసులు ఆమెను కొట్టేవారు. ప్రభుత్వ అధికారుల దర్పం, నిర్లక్ష్యం ఆమెకు కోపం తెప్పించేవి. ఆమె పోరాటాన్ని చూసి కొంతమంది నవ్వేవాళ్లు. అయినా మాయా పట్టు వీడలేదు.

''ఈ రోజు నేను ఎక్కడికి వెళ్లినా మంచి ప్రతిస్పందన వస్తోంది. ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా నాకు గౌరవం ఇస్తున్నారు.'' అని మాయా తెలిపారు.

టెక్నాలజీ, ఇంగ్లిష్.. జంట సమస్యలు

షార్ట్ ఫిల్మ్ తీయడం ఎంత కష్టమో మీడియా కోర్సును చేసే విద్యార్థులకు తెలుసు. అలాంటిది మాయా ఒంటరిగా షార్ట్ ఫిల్మ్స్ తీయడంలోని మెళకువలు నేర్చుకున్నారు. ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఒక ప్రొఫెషనల్‌లాగా ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ గురించి, మొబైల్ ఎడిటింగ్ యాప్‌ల గురించి వివరించారు.

''గతంలో నాకు ఎడిటింగ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలీదు. వీడియోలు తీసి వాటిని అధికారులకు చూపేదాన్ని, అంతే. కానీ క్రమక్రమంగా సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత తెలిసింది. మంచి వీడియోల వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అర్థమైంది. అందువల్లే ఎడిటింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను. మొదట నేర్చుకోవడం చాలా కష్టమైంది. అవన్నీ ఇంగ్లిష్‌లో ఉండేవి. నాకు ఒక్క ముక్కా అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత నేను చిన్నచిన్న పదాలు నేర్చుకుంటూ, ఎడిటింగ్ నేర్చుకున్నాను'' అని మాయా వివరించారు.

Image copyright MAYA KHODVE / FACEBOOK
చిత్రం శీర్షిక వీలైనంత ఎక్కువ మంది యువతులకు శిక్షణ ఇవ్వాలని మాయా భావిస్తున్నారు

మరో 'మాయ'ను సృష్టించడమే లక్ష్యం

ఇప్పుడు మాయా చెత్త ఏరుకునే పని మానేశారు. అయితే ఆమెలా ఇంకా ఎంతోమంది విద్యకు దూరమైన వారున్నారు. మాయా వారందరితో కెమెరా వాలంటీర్లను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.

''వీలైనంత ఎక్కువ మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలనేది నా ఆశయం. ఇప్పటికే కొంత మందికి శిక్షణ ఇస్తున్నాను. మహిళలు ఎప్పుడూ ముందుకు రావడానికి సంకోచిస్తుంటారు. మొదట నేనూ అలాగే భయపడ్డాను. కానీ అలాంటి భయాలను మన మనసులోంచి తీసేయాలి. నాలాంటి మరో మాయా త్వరలో నా బాధ్యత తీసుకుంటుందని ఆశిస్తున్నాను'' అని ముగించారు ఆమె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)