సివిల్స్ టాపర్ అనుదీప్‌కు వచ్చిన మార్కులు ఎన్ని?

  • 6 మే 2018
అనుదీప్ Image copyright facebook
చిత్రం శీర్షిక అనుదీప్ గతంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)‌కు ఎంపికయ్యారు.

భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయనేది.. ఆ పరీక్షల్లో విజయం సాధించిన వారి మార్కులు చూస్తే తెలుస్తుంది.

2017 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన అనుదీప్ దూరిశెట్టి 55.6 శాతం మార్కులు సాధించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 27వ తేదీన ప్రకటించారు. పరీక్షల్లో ఎంపికైన వారి మార్కుల వివరాలను తాజాగా విడుదల చేశారు.

సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్.. మొత్తం 2,025 మార్కులకు గాను 1,126 మార్కులు సాధించారు.

మొత్తం 2,025 మార్కుల్లో.. ప్రధాన రాత పరీక్షకు 1,750 మార్కులు, ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి.

అనుదీప్‌కు రాత పరీక్షలో 950 మార్కులు, ఇంటర్వ్యూలో 176 మార్కులు వచ్చాయి.

Image copyright upsc.gov.in

రెండో స్థానంలో నిలిచిన అను కుమారి 55.5 శాతం మార్కులు పొందారు. ఆమెకు రాత పరీక్షలో 937 మార్కులు, ఇంటర్వ్యూలో 187 మార్కులు.. మొత్తం 1,124 మార్కులు వచ్చాయి.

మూడో స్థానంలో ఉన్న సచిన్ గుప్తా 55.40 మార్కులు సాధించారు. ఆయనకు రాత పరీక్షలో 946, ఇంటర్వ్యూలో 176 మార్కులు.. మొత్తం 1,122 మార్కులు వచ్చాయి.

అభ్యర్థుల్లో 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ మొత్తం 830 మార్కులు మార్కులు (40.98 శాతం) పొందారు. రాతపరీక్షలో 687 మార్కులు, ఇంటర్వ్యూలో 143 మార్కులు లభించాయి.

ఇంతకుముందు.. 2016 సివిల్స్ టాపర్ నందిని కె.ఆర్. మొత్తం 2,025 మార్కులకు గాను.. 1,120 మార్కులు (రాత పరీక్షలో 927, ఇంటర్వ్యూలో 193) పొందారు.

2015 సివిల్స్ టాపర్ టీనా దాబీ.. రాతపరీక్షలో 868, ఇంటర్వ్యూలో 195 చొప్పున మొత్తం 1,063 మార్కులు సాధించారు.

Image copyright Getty Images

దరఖాస్తుదారులు 9,57,590 మంది.. ఎంపికైంది 990 మంది

2017 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష జూన్ 18వ తేదీ జరిగింది. ఆ పరీక్షకు మొత్తం 9,57,590 మంది దరఖాస్తు చేసినప్పటికీ.. 4,56,625 మంది పరీక్ష రాశారు.

వీరిలో 13,366 మంది ప్రధాన రాత పరీక్ష (మెయిన్)కు అర్హత సాధించారు. అక్టోబర్ - నవంబర్‌లలో జరిగిన ఆ రాత పరీక్షలో 2,568 మంది.. వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూలకు అర్హత పొందారు.

ఈ ఏడాది ఫిబ్రవరి - ఏప్రిల్ నెలల మధ్య జరిగిన ఈ వ్యక్తిత్వ పరీక్ష, ఇంటర్వ్యూల్లో చివరిగా 990 మంది అభ్యర్థులు నియామకాలకు ఎంపికయ్యారు.

ఎంపికైన వారిలో 750 మంది పురుషులు కాగా 240 మంది మహిళలు ఉన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు