బ్లాగ్: ‘తప్పు చేశాను... ఆ అమ్మాయి తల్లి ముందు నేనా పని చేసుండాల్సింది కాదు’

  • 8 మే 2018
అమ్మాయి తల్లి

గతంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఏదైనా కథనం కోసం గ్రౌండ్ వర్క్ చేసేప్పుడు నా నుంచి ఎలాంటి తప్పూ జరగలేదు.

ఇప్పటిదాకా చాలా కథనాలు రాశా. వందల గ్రామాలు తిరిగా. వేలమందిని కలిసి మాట్లాడా. మృతదేహాల మధ్య కూడా ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు నేను మాట్లాడిన కాసేపటికే అవతలి వ్యక్తులు చనిపోయిన రోజులూ ఉన్నాయి.

కానీ తొలిసారి నా వల్ల ఓ తప్పు జరిగినట్లు అనిపిస్తోంది. నేను ఆ పని చేసుండాల్సింది కాదు. నా వ్యవహారశైలి ఆ సమయంలో అలా ఉండకూడదు.

మే 3వ తారీఖు మధ్యాహ్నం ఓ ‘అమ్మ’తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎదురైన అనుభవం ఇది.

నేను చేసిన ఓ తప్పు వల్ల ఆ తల్లి మనసు బాధపడింది. ఆ తరవాత కాసేపటికి నన్ను ఇంట్లోంచి బయటకు పంపించేశారు. నాకు చాలా సిగ్గుగా, ఓడిపోయినట్టుగా అనిపించింది. ఆ ఓటమి, ఒక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మధ్యలో ఆగినందుకు కాదు.. ఓ తల్లి మనసును గాయపరచినందుకు.

ఆ తల్లి ఎవరో కాదు.. ఇటీవల దేశవ్యాప్తంగా వైరల్ అయినా ‘జహానాబాద్’ వీడియోలోని బాధితురాలి మాతృమూర్తి. కొందరు కుర్రాళ్లు బట్టలు చింపేందుకు ప్రయత్నిస్తుండగా, వాళ్ల బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ అమ్మాయికి సంబంధించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తాయి. ఆ వీడియో సోషల్ మీడియా ద్వారా కొన్ని కోట్ల మంది మొబైల్స్‌కు చేరింది.

దాదాపు ఓ డజను మంది కుర్రాళ్లు ఆ అమ్మాయిని అల్లరిపెట్టడానికి ప్రయత్నించినా, ఆమె ఓటమిని ఒప్పుకోలేదు. పోరాడుతూనే ఉంది. చివరి వరకూ తన గౌరవాన్ని కాపాడుకోవడానికి, వాళ్ల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి ఆ ప్రయత్నంలో ఆమె గెలిచింది.

ఆ అమ్మాయికి ఇంకా ఓటు వేసే వయసు కూడా రాలేదు. కానీ తన వయసును మించిన పరిపక్వతను ఆమె ప్రదర్శించింది.

ఆ సంఘటనను ఓ పీడకలగా భావించి మర్చిపోవాలని ఆ అమ్మాయి అనుకుంది. కానీ ఆమెను వేధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కనిపించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్, విద్యుత్ స్తంభం నంబర్, వినిపించిన భాషను బట్టి అది బిహార్‌లో జరిగిన ఘటన అని అర్థమైంది.

బిహార్‌ పోలీసులు కూడా ఆ వీడియోపై వెంటనే స్పందించారు. విషయం వెలుగులోకి రాగానే నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తరవాత ఆ అమ్మాయి వివరాలు కూడా తెలుసుకొని వాళ్ల ఇంటికీ వెళ్లారు.

పోలీసులతో ఆ అమ్మాయి అన్ని విషయాల్ని ధైర్యంగా చెప్పింది. దానివల్లే ఇప్పుడు నిందితులంతా జైల్లో ఉన్నారు. పోలీసులు చొరవ తీసుకున్నారు కాబట్టే ఆ అమ్మాయి కూడా ధైర్యం చేసింది.

పోలీసులు గనుక కాస్త చొరవ చూపిస్తే ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తాయి, నిందితులు పట్టుబడతారనే సందేశం కూడా ఈ చర్య ద్వారా అందరికీ తెలిసింది.

కానీ ఆ అమ్మాయి ఇంట్లోవాళ్లు ఇతరులతో మాట్లాడానికి ఇష్టపడట్లేదు. అతికష్టమ్మీద నేను వాళ్ల ఇంట్లోకి వెళ్లగలిగా.

చిత్రం శీర్షిక ఆ అమ్మాయిని వేధించింది ఇక్కడే

ఆ అమ్మాయి తల్లి నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆమె చాలా ఓపిగ్గా మాట్లాడారు. నేను అడక్కుండానే చాలా విషయాలు చెప్పారు. నేను అడిగినవాటికీ బదులిచ్చారు.

ఆమె చాలా తెలివైన వ్యక్తిలా కనిపించారు. మాటల్లో తడబాటు లేదు కాబట్టి ఆమె చెప్పే విషయాల్ని రికార్డు చేద్దామని ఫోన్ బయటకు తీశా.

ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ ప్రతి ఫోన్‌లో కెమెరా ఉంటుందనీ, వాటితో ఏవైనా రికార్డు చేయొచ్చని ఆమెకు తెలుసు. ఇలాంటి ఫోన్ల వల్ల ఎన్ని అనర్థాలు తలెత్తుతాయో, ఎంత బాధను భరించాల్సి వస్తుందో కూడా ఆమెకు బాగా తెలుసు.

అందుకే నేను ఫోన్ బయటకు తీయగానే ఆమె మాట్లాడటం మానేశారు. తల వంచుకొని వెనక్కి తిరిగారు. నేను మాట్లాడమని అడిగినా నోరు మెదపలేదు. మాట్లాడకపోతే న్యాయం ఎలా జరుగుతుందన్న నా ప్రశ్నకు కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు.

చిత్రం శీర్షిక జహానాబాద్‌లో బథువా గ్రామం

కాసేపటి తరవాత ఆమె మాట్లాడుతూ.. ‘మీరు వీడియో తీస్తారనో, నా మాటల్ని రికార్డు చేస్తారనో తెలిస్తే నేనసలు మిమ్మల్ని ఇంట్లోకి కూడా రానిచ్చేదాన్ని కాదు. దయచేసి ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపోండి’ అని వణుకుతున్న గొంతుకతో కోపంగా చెప్పారు.

దాంతో మేం బయటి వచ్చేశాం. మళ్లీ ఆ ఇంటి తలుపు ఎప్పటిలానే మూసుకుంది.

అంతకు ముందు ఆమె నాతో మాట్లాడుతూ.. తన కూతురు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీకూడదని అన్నారు. ‘నా కూతురిని నేను బాగా చదివించుకోవాలి. ఆమె మంచి ఉద్యోగం చేయాలి. అలా జరిగితే ఎవరికీ పాత విషయాలు గుర్తుకురావు. అందుకే మా మొహాలు చూపించకండి’ అని చెప్పారు.

నేను కూడా మొహాలు చూపించం అని స్పష్టంగా చెప్పా. కానీ నేను ఫోన్‌ను బయటకు తీయడం వల్ల నా మాటల్ని ఆమె నమ్మలేదనుకుంటా. తనకు ఎవరి సాయం అక్కర్లేదనీ, ఒంటరిగా ఉండగలననీ చెప్పారు.

చిత్రం శీర్షిక ఆ ఇంటి తలుపు మళ్లీ మూసుకుంది

ఆ అమ్మాయి ఇటీవలే పదో తరగతి పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.

ఈ విషయాలన్నీ నేను రాయడం మొదలుపెట్టినప్పుడు, ‘యత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత:’ అనే మాట గుర్తొచ్చింది. మన సమాజంలో దేవతలు ఉండాలనుకుంటే, మనం స్త్రీలను గౌరవించాల్సిందే.

అందుకే ఆ అమ్మాయి తల్లికి, ఆమె ధైర్యానికి సలామ్ చేయాలనిపిస్తోంది. అలాగే ఆమె మనసు గాయపర్చినందుకు క్షమాపణ కూడా చెప్పాలనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు