ఏం చేసినా బరువు తగ్గట్లేదా? ఈ ఐదూ కారణాలు కావొచ్చు..

  • 10 మే 2018
అధిక బరువు Image copyright iStock

కొందరు బాగా వ్యాయామం చేస్తారు. మంచి భోజనం తింటారు. వేళకు నిద్రపోతారు. అయినాకానీ బరువు తగ్గట్లేదని బాధపడుతుంటారు.

అయితే బరువు తగ్గడం కేవలం తిండి, నిద్రపైన ఆధారపడి ఉండదనీ, దానికి అనేక ఇతర అంశాలూ కారణం కావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అందులో భాగంగా బరువును నియంత్రించే ఈ ఐదు కారణాలను శాస్త్రవేత్తలు ప్రస్తావించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: బరువు తగ్గకపోవడానికి ఎన్ని కారణాలో చూడండి

1. పేగుల్లోని సూక్ష్మ జీవులు

పేగుల్లో ఉండే రకరకాల సూక్ష్మ జీవులు మన జీర్ణ ప్రక్రియను నియంత్రిస్తాయి. ఎన్ని భిన్నమైన సూక్ష్మ జీవులు కడుపులో ఉంటే, అంత సన్నగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆ సూక్ష్మ జీవుల వృద్ధికి తోడ్పడే పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.

Image copyright Getty Images

2. జన్యువులు

వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటున్నా బరువు తగ్గట్లేదా?.. అయితే జన్యుపరమైన కారణాలు కూడా దానికి కారణం కావొచ్చని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధన చెబుతోంది.

బరువు, జీర్ణశక్తితో పాటు శరీరంలో కెలొరీలు కరిగే విధానంపై దాదాపు 100రకాల జన్యువుల ప్రభావం ఉంటుంది. జన్యుపరమైన సమస్యలు ఉంటే ఆకలి పెరిగి ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది.

Image copyright Getty Images

3. భోజన వేళలు

ఎంత ఆలస్యంగా భోజనం చేస్తే బరువు పెరగడానికి అంత ఎక్కువ అవకాశముంది. సాధారణంగా రాత్రుళ్లు జీర్ణక్రియ వేగం మందగిస్తుంది. అన్ని రకాల పదార్థాలూ అంత త్వరగా అరగవు.

అందుకే సాయంత్రం 7గం.లోపు భోజనం ముగించుకుంటే బరువు నియంత్రణలో ఉండే అవకాశాలున్నాయి.

4. మెదడు పనితీరు

తాము ఎంత తింటున్నామనే విషయాన్ని చాలామంది సరిగ్గా అంచనా వేయలేరు. మెదడు మనం ఏం చెబితే అదే వింటుంది. మనం తక్కువ తింటున్నామనే భావనతో ఉంటే, మెదడు కూడా అదే నిజమనుకుంటుంది. అందుకే చాలామంది సరైన అంచనాలేక ఎక్కువ తినేస్తుంటారు.

అందుకే జంక్ ఫుడ్‌ను తగ్గించి, తక్కువ మొత్తంలో తినడాన్ని సాధన చేస్తే క్రమంగా మెదడు కూడా దానికి అలవాటు పడుతుంది.

Image copyright Getty Images

5. హార్మోన్లు

హార్మోన్లే మన ఆకలిని నియంత్రిస్తాయి.

లండన్‌‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు, కడుపులోని కొన్ని సూక్ష్మజీవుల్ని ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించారు. ఆ సూక్ష్మజీవులు ఆకలిని నియంత్రిస్తాయి.

సాధారణంగా ఒబెసిటీ సర్జరీ పూర్తయ్యాక ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను నియంత్రిస్తారు. ఆ పని చేయడంలో ఈ సూక్ష్మ జీవులే సాయపడతాయి.

కృత్రిమంగా సృష్టించిన ఈ సూక్ష్మజీవులవల్ల ఎలాంటి హానీ లేదని తేలితే వీటిని ఒబెసిటీ చికిత్సలో భాగం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)