కర్ణాటక: రెడ్డి బ్రదర్స్ వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?

  • 8 మే 2018
జనార్దన్ రెడ్డి Image copyright Facebook/GaliJanardhanreddy
చిత్రం శీర్షిక ఒక సభలో ప్రసంగిస్తూ జనార్దన్ రెడ్డి

ఇది 21వ శతాబ్దానికి చెందిన ఒక కథ. ఇందులో ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు తనంతట తాను ఎదిగి మైనింగ్ ప్రపంచంలో రారాజుగా అవతరిస్తాడు.

ఈ కథ గాలి జనార్దన్ రెడ్డిది. భారీగా డబ్బు సంపాదించాలనే పరుగులో ఆయన ఎంత ముందుకు దూసుకుపోయారంటే, ఇప్పుడు ఆయనా, ఆయన సోదరులూ, సహచరులూ తమ సొంత జిల్లా బళ్లారిలో అడుగుపెట్టకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించాల్సొచ్చింది. వారు ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనగూడదని ఆదేశించాల్సొచ్చింది.

జనార్దన్ రెడ్డి రాజకీయ పలుకుబడి విషయానికి వస్తే, ఆయన్ను కాపాడడానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప లాంటి పేరున్న రాజకీయ నాయకులు సైతం ముందుకొస్తారు.

అయితే, ఇదే రెడ్డి సోదరులు 2008లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి యడ్యూరప్పను పదవి నుంచి తప్పించేందుకు చేయాల్సినంతా చేశారన్నది గుర్తుంచుకోవాలి.

Image copyright Getty Images

అధికారంపై రెడ్డి సోదరుల పట్టు

జనార్దన్ రెడ్డి తన సోదరుడిని, సోదరుడిగా భావించే శ్రీరాములును (బళ్లారి నుంచి పార్లమెంటు సభ్యుడు, బాదామీ, మొలొకలమూరు స్థానాల నుంచి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి) ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున మరోసారి అభ్యర్థులుగా నిలిపారు.

బీబీసీ గాలి జనార్దన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు.

అయితే, ఆయన సన్నిహిత మిత్రుడు విరూపాక్షప్ప గౌడ బీబీసీతో మాట్లాడుతూ, "రెడ్డి సోదరుల (జనార్దన్, కరుణాకర్, సోమశేఖర్) నాన్న ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. తర్వాత ఆయనకు బళ్లారి బదిలీ అయ్యింది" అని అన్నారు.

ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు రెండూ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి.

"1956లో రాష్ట్రాల పునర్నిర్మాణం తర్వాత రెడ్డి సోదరుల తండ్రి బళ్లారిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పెరిగి పెద్దవాడైన జనార్దన్‌రెడ్డి కోల్‌కతాకు చెందిన ఒక బీమా కంపెనీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. బీమాకు సంబంధించిన దావాలను పరిష్కరించడంలో రెడ్డి సఫలం అయ్యారు. అలా ఆయన బాగా డబ్బు సంపాదించి, తనే సొంతంగా ఓ చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించారు"

Image copyright AFP

వార్తా పత్రిక ప్రారంభించిన రెడ్డి సోదరులు

"జనార్దన్‌ రెడ్డి ఒక వార్తాపత్రిక కూడా ప్రారంభించారు. దాని పేరు 'నమ్మ కన్నడ నాడు' అంటే 'మన కన్నడ భూమి' అని అర్థం. ఈ క్రమంలో జనార్దన్ రెడ్డి పంచాయితీలు పరిష్కరించడం మొదలు పెట్టారు. పోలీసుల వద్దకు వెళ్తే చిన్న కేసులను కూడా పెద్దవి చేస్తారని భావించిన కొందరు తమ వివాదాలు పరిష్కారించాలంటూ రెడ్డి సోదరుల దగ్గరకు వస్తుండడంతో అలా జనార్దన్‌ రెడ్డి, శ్రీరాములు చాలా మందికి దగ్గరయ్యారు" అని విరూపాక్షప్ప తెలిపారు.

ఇదంతా అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ బళ్లారి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసిన సమయంలో జరిగింది.

కానీ కాంగ్రెస్ కోటలో సోనియా గాంధీకి సవాలు విసరకుండా బీజేపీ ఎలా ఉంటుంది?

అందుకే బీజేపీ సుష్మా స్వరాజ్‌ను రంగంలోకి దించి బళ్లారి స్థానం నుంచి పోటీ చేయించింది. అప్పుడే జనార్దన్ రెడ్డి, శ్రీరాములు ఆ పార్టీకి దగ్గరయ్యారు.

Image copyright IMRAN QURESHI/BBC
చిత్రం శీర్షిక జనార్దన్ రెడ్డి, శ్రీరాములులతో సుష్మా స్వరాజ్

పంచాయితీలతో పేరు గడించిన రెడ్డి సోదరులు

వివాదాలు పరిష్కరించడంలో రెడ్డి సోదరులు బాగా పేరు సంపాదించారు. ఆఖరుకు మైనింగ్ రంగంలో రారాజులైన లాడ్ సోదరులు (అనిల్-సంతోష్), ఆనంద్ సింగ్ (ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి) వంటివారు సైతం మాంగనీస్ ముడి ఖనిజం ధూళిపై యాజమాన్య హక్కు విషయంలో తలెత్తిన ఓ వివాదాన్ని పరిష్కరించాలంటూ జనార్దన్ రెడ్డి, శ్రీరాములులను ఆశ్రయించారు.

ఒక పెద్ద మైనింగ్ కంపెనీతో రెండు లక్షల టన్నుల ఖనిజం పొడి విషయంలో ఈ వివాదం తలెత్తింది. అదే సమయంలో చైనాలో ముడి ఇనుముకు డిమాండ్ బాగా పెరగడంతో దీని విలువ ఆకాశాన్నంటింది.

"ఈ వివాదంలో ఐదు లేదా పది లక్షలు రావాల్సిన చోట రెడ్డి సోదరులు దానికి పది రెట్లు ఎక్కువ సంపాదించారు. ఇదే డబ్బుతో వాళ్లు పక్క జిల్లా అనంతపురంలో (ఆంధ్రప్రదేశ్) ఓబులాపురం మైనింగ్ కంపెనీని కొన్నారు" అని విరూపాక్షప్ప చెప్పారు.

Image copyright KASHIF MASOOD/BBC
చిత్రం శీర్షిక తన కూతురి పెళ్లిలో జనార్దన్ రెడ్డి

రెడ్డి సోదరులు ఈ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?

"రెడ్డి సోదరులు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో స్నేహం చేశారు. ఈ గనుల కోసం లైసెన్స్ తీసుకున్నారు" అని ఎస్.ఆర్. హీరేమఠ్ చెప్పారు. ఆయన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి.

"కర్ణాటక సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెడ్డి సోదరులకు నాలుగు గనులుండేవి. కానీ దాన్నుంచి తీసే ముడి ఇనుముకు కొనుగోలుదారులు చాలా తక్కువగా ఉండేవారు. ఎందుకంటే కర్ణాటకలో దొరికే ముడి ఇనుము కంటే ఈ ముడి ఖనిజం నాణ్యత తక్కువగా ఉండేది."

రెడ్డి సోదరులు ఎగుమతి చేసే ముడి ఇనుము ఆంధ్రప్రదేశ్‌లో దొరికే ముడి ఇనుము కంటే మెరుగ్గా ఉండేది.

Image copyright AFP

రెడ్డి బిజినెస్ మోడల్..

సుప్రీంకోర్టులో పర్యావరణానికి సంబంధించిన కేసులను చూసే ఒక బెంచ్ దీనిపై ఒక కమిటీ వేసింది. అది చాలా సమయం తర్వాత ఈ విషయం గుర్తించింది.

"రెడ్డి సోదరులు వ్యాపారం చేసే తీరు చాలా దూకుడుగా ఉండేది. వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ గనుల లోపలి నుంచి కర్ణాటకలో ఉండే గనుల్లోకి చొరబడి కూడా మైనింగ్ చేసేవారు. ఆ గనులు బళ్లారి ముడి ఇనుము కంపెనీకి దగ్గర ఉండేవి. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌కు కూడా దగ్గరగా ఉండేవి" అని హీరేమఠ్ అంటారు.

"రెడ్డి సోదరులు చేసేవాటిలో ఇదొక పద్ధతి. వీళ్లు మైనింగ్ కార్యకలాపాలతో పాటూ మరో రకం డీల్ కూడా చేసేవారు. ఇందులో భాగంగా 30 శాతం, 70 శాతం ఒప్పందం జరిగేది. జనార్దన్ రెడ్డి చాలా జిత్తులమారి మైనింగ్ వ్యాపారవేత్త."

Image copyright AFP

సీబీఐ పాత్రపై ప్రశ్నలు

బళ్లారిలో గనులతో సంబంధం ఉన్న ఒక కుటుంబాన్ని జనార్దన్‌ రెడ్డి తనతో కలిసి పనిచేయాలని ఒక అటవీ అధికారి ఒత్తిడి చేశారు.

"నేను రెడ్డి సోదరుల ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. కానీ పక్కనే ఉన్న గని లోంచి చొరబడి మా గనిలో తవ్వకాలకు పాల్పడ్డారని మాకు తర్వాత తెలిసింది. దాంతో నేను పోలీసులకూ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశాను. కానీ వాళ్లేమీ పట్టించుకోలేదు. దాంతో నేను కోర్టుకు వెళ్లాను" అని ఆ కుటుంబానికి చెందిన తపల్ గణేష్ బీబీసీతో చెప్పారు.

"మీకు గుర్తుండే ఉంటుంది. రెడ్డి సోదరులు (కరుణాకర్ మినహా) ఒక కొత్త రకం రాజకీయ నేతల వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్లు డబ్బు సంపాదించడంతోపాటూ వాటిని దాచెయ్యడంలో కూడా సమర్థులు" అని హీరేమఠ్ అన్నారు.

అక్రమ మైనింగ్, దేశంలోని పది రేవుల నుంచి చైనాకు ఎగుమతి అవుతున్న ముడి ఖనిజం విలువ సుమారు రూ.16,500 కోట్లని అప్పటి కర్ణాటక లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తన రిపోర్టులో అంచనా వేశారు.

రెడ్డి ఎగుమతి చేసిన ఆ రేవులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవాలలో ఉన్నాయి.

Image copyright Getty Images

లోకాయుక్త నివేదిక

జస్టిస్ హెగ్డే బీబీసీతో మాట్లాడుతూ "దీని విలువ ఇంతకన్నా ఎంతో ఎక్కువ ఉండొచ్చని నాకనిపిస్తోంది. ఎందుకంటే చాలా కేసుల్లో దస్తావేజుల ఆధారాలు మాకు దొరకలేదు" అని చెప్పారు.

"ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపిన విచారణ సంస్థ సీబీఐకి కూడా నివేదిక అందజేయాల్సింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పత్రాలు ఇవ్వలేదు కాబట్టి. మీరొక ఏజెన్సీ అయినప్పుడు, విచారణ జరిపే అధికారం మీకు ఉంటుంది. పత్రాల కోసం కోర్టుకు కూడా వెళ్లొచ్చు. లోకాయుక్త నివేదికలో ఉన్న పత్రాల ఆధారంగా కూడా వారిపై చర్యలు తీసుకోగలిగేవారు" అంటూ జస్టిస్ హెగ్డే ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Image copyright IMRAN QURESHI/BBC

"రాజకీయంగా చూస్తే జనార్దన్ రెడ్డి ఒక వ్యూహకర్త. అయితే ఒక్కోసారి మాత్రం ఆయన తప్పూ, ఒప్పూ అనేదేమీ లేకుండా ప్రకటనలు చేస్తుంటారు" అని విరూపాక్షప్ప చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)