‘కొందరు నన్ను దేవతంటారు.. ఇంకొందరు వేశ్య అంటారు’

  • 9 మే 2018
రుద్రాణి Image copyright RUDRANI CHETTRI

రోడ్డు మీద నిల్చుంటే ఏ ఆకతాయో వచ్చి విజిల్ వేస్తాడనో, నన్ను వేశ్యగా భావించి ‘రేటు ఎంత’ అని అడుగుతాడనో భయమేస్తుంది. లేకపోతే ఎవరైనా వచ్చి కాళ్లు పట్టుకొని ఆశీర్వాదం అడుగుతారేమోనని కంగారు పడుతుంటా.

కొందరు నన్ను మా కుటుంబానికి మచ్చగా భావిస్తారు. ఇంకొందరు నన్ను ‘దేవత’గా గౌరవిస్తారు. మరికొందరైతే నేను వేశ్యననే ముద్ర కూడా వేస్తారు.

ఎవరేం అనుకున్నా.. ‘రూపేష్’ నుంచి ‘రుద్రాణి’గా మారినందుకు నేనెప్పుడూ సిగ్గుపడలేదు.

ఇంట్లో అందరికంటే నేనే పెద్దదాన్ని. మొదట్నుంచీ నా శరీరం అసహజంగా అనిపించేది. ఓ అబ్బాయి శరీరంలో నన్ను బంధించిన భావన కలిగేది. నా ఆలోచనలన్నీ అమ్మాయిల్లానే ఉండేవి. అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడేదాన్ని.

ఓ దశలో.. ఇక నా భావాల్ని అణచుకొని బతకడం వృథా అనిపించింది. దాంతో నేను అనుభవిస్తున్న సంఘర్షణ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పా.

అదృష్టం కొద్దీ మా అమ్మా, నాన్నా, తమ్ముడూ నన్ను అర్థం చేసుకున్నారు. నాకు నచ్చినట్టుగా జీవించే అవకాశాన్ని కల్పించారు. కానీ ఆ అవకాశం ఇంటికే పరిమితం. బయటికి వెళ్తే నేను అబ్బాయిలా ప్రవర్తించాల్సిందే.

Image copyright RUDRANI CHETTRI

నేను చిన్నప్పుడు స్కూల్‌కి అందరు మగపిల్లల్లానే యూనిఫాం వేసుకుని వెళ్లేదాన్ని. కానీ ఆ దుస్తులు నాకు చాలా ఇబ్బందిగా అనిపించేవి. స్కూళ్లో చాలామంది నన్ను చూసి వెక్కిరించేవారు.

దాంతో పన్నెండో తరగతి తరవాత కాలేజీకి వెళ్లాలనిపించలేదు. ఆ తరవాత ఇంటి దగ్గరే ఉండి చదువుకోవడం మొదలుపెట్టా.

నా వయసు పెరిగే కొద్దీ క్రమంగా అబ్బాయిలు నన్ను ఆకర్షించడం మొదలుపెట్టారు. కానీ నేను నా భావాల్ని బయట పెట్టలేను. ఇంట్లోంచి బయటికి వెళ్తే నేను ‘రూపేష్’లా బతకాల్సిందే. ఆ పరిస్థితి నన్ను చాలా కలవరపెట్టేది.

Image copyright RUDRANI CHETTRI

అందుకే లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ అదంత సులువైన పని కాదు. మొదట మా ఇంట్లోవాళ్లు నన్నో సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆమె నాతో చాలా సేపు మాట్లాడారు.

లింగమార్పిడి చేయించుకుంటే తలెత్తే పరిణామాల గురించి ఆమె వివరించారు. సర్జరీ తరవాత నేను అమ్మాయిలా కనిపిస్తాననీ, కానీ స్త్రీలలో ఉండే అన్ని లక్షణాలు నాకు రావనీ వివరించారు. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నానని ఆమె నిర్ధరించుకున్నాక మా ఇంట్లో వాళ్లను పిలిచి విషయం చెప్పారు.

వాళ్లు కూడా ఒప్పుకోవడంతో 2007లో నేను మహిళగా మారే ప్రక్రియ మొదలైంది.

Image copyright RUDRANI CHETTRI
చిత్రం శీర్షిక సోదరుడితో రూపేష్

లింగమార్పిడి చికిత్సలో భాగంగా రకరకాల పరీక్షలు, సర్జరీలు చేయించుకోవాలి. చాలా నొప్పి భరించాలి. దానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ ‘రూపేష్’ నుంచి ‘రుద్రాణి’గా మారే నన్ను నా చుట్టుపక్కలవారు స్వీకరిస్తారా, లేదా అన్న సందేహమే నన్ను తొలిచేసేది.

అయితే లింగమార్పిడి చేయించుకున్నాక నా ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. తరవాత ఓ సంస్థతో కలిసి పనిచేయడం మొదలుపెట్టా. ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా, సంతోషంగా బతుకుతున్నా.

కొందరు స్నేహితులు నాకు తోడుగా నిలిచారు. ఇంకొందరు మాత్రం నా రూపాన్ని చూసి హేళన చేశారు. దాంతో నాలో ఆత్మన్యూనత పెరిగేది. క్రమంగా నాకు నేనే సర్దిచెప్పుకోవడం మొదలుపెట్టా. ఆ కామెంట్లను సవాలుగా తీసుకొని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా.

Image copyright RUDRANI CHETTRI

నెమ్మదిగా అందరితో కలిసిపోవడం, పరిచయాలను విస్తృతపరచుకోవడం మొదలుపెట్టా. కొందరికి నేను ట్రాన్స్‌జండర్‌నని తెలీడంతో మోడలింగ్ అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆపై సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి.

అప్పుడప్పుడూ విదేశాల నుంచి కూడా మోడలింగ్‌ అవకాశాలు వస్తుంటాయి. నా సంపాదనతోనే ఓ చిన్న ఇల్లు కట్టుకున్నా.

నాకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నా. ఒకప్పుడు నాపై వివక్ష చూపినవాళ్లే ఇప్పుడు గౌరవిస్తున్నారు.

Image copyright RUDRANI CHETTRI

నేనిప్పుడు ఓ మోడలింగ్ ఏజెన్సీని నిర్వహిస్తూ, నాలాంటి వాళ్లకు సాయపడుతున్నా.

చికిత్సలన్నీ పూర్తయి నేను మహిళగా మారాక కూడా నన్నో వెలితి వెంటాడుతూనే ఉంది. కొందరు నా జీవితంలోకి వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ నాతో జీవితాన్ని పంచుకోవడానికి మాత్రం ఎవరూ సిద్ధపడరు. ఎందుకంటే.. నేను తల్లిని కాలేను కదా.

(బీబీసీ ప్రతినిధి బుష్రా షేక్‌తో రుద్రాణి పంచుకున్న విషయాలివి)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)