ప్రెస్‌రివ్యూ: 'గెలిస్తే నేనే ప్రధానినవుతా!'

  • 9 మే 2018
Image copyright Getty Images

'కాబోయే ప్రధానిని నేనే'

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిస్తే తానే ప్రధానమంత్రి పదవిని దక్కించుకుంటానని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారని 'ఈనాడు' పేర్కొంది.

బెంగళూరులో మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మేధావుల వేదిక-సమృద్ధ భారత్‌ కార్యక్రమంలో ఆయన ఆహూతులతో ముఖాముఖి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు.

యూపీఏ పక్షాల్లో కాంగ్రెస్‌కు అధిక సీట్లు వస్తే తానే ప్రధానినవుతానని వివరించారు. ఆహూతులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏమైనా గిమ్మిక్కులు చేసి ఐదు స్థానాల్లో భాజపా గెలిస్తే గెలవచ్చు కానీ... ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఆ పార్టీ 70 స్థానాలు కోల్పోవడం ఖాయమని రాహుల్‌గాంధీ పేర్కొన్నారని ఈనాడు వెల్లడించింది.

Image copyright AndhraPradeshCM/facebook

ఎంత కష్టపడినా కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారని 'ఈనాడు' వెల్లడించింది.

ఉండవల్లిలోని ప్రజాదర్బారు మందిరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో మంగళవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

పొత్తు పెట్టుకున్నా విభజనప్పటి కంటే కూడా గత నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం జరిగింది.

మనకిచ్చిన హామీలు నెరవేర్చనందునే కేంద్రంతో విభేదించాం. గట్టిగా అడగకపోతే ఇంకా అన్యాయం జరుగుతుందనే ప్రశ్నిస్తున్నాం అని పేర్కొన్నారు.

15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో 2011 జనాభా లెక్కలు ప్రాతిపదికగా తీసుకుంటే ప్రగతిశీల రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారని ఈనాడు పేర్కొంది.

Image copyright Telangana CMO

'పథకాల ప్రచారానికి వెయ్యి కోట్లా'!

తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి పెడుతున్న ఖర్చు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందేనని 'విజయక్రాంతి' దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

పండగలని, పబ్బాలని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలని, కొత్త పథకాలని, ఆ దినాలని, ఈ దినాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ప్రకటనల కోసం ఖర్చు చేస్తోంది.

విస్తృత ప్రచారం కల్పిస్తే ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే అవకాశం ఉంది. ఇంతవరకూ ఓకే. కానీ పథకాల ప్రచారం కన్నా... వ్యక్తుల ప్రచారం తెలంగాణ ప్రభుత్వంలో శృతి మించి రాగాన పడుతోందనే విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర పత్రికలు, టీవీ ఛానళ్లుకే కాకుండా జాతీయ అంతర్జాతీయ పత్రికలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు విడుదల చెయ్యడం చూస్తే... ఒకే రోజు ఇన్ని వందల కోట్ల రూపాయల ప్రకటనలు విడుదల చెయ్యడం వెనుక ప్రచారకాంక్ష కన్నా ఇంకా ఏదో కారణం ఉందనిపిస్తోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శాసనమండలిలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు 2016 డిసెంబర్ 27న మండలిలో సమాధానం ఇస్తూ గడచిన రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికి 872 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు సమాధానం ఇచ్చార'ని విజయక్రాంతి పేర్కొంది.

జూన్ 2 న పీఆర్సీ?

ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 14వ తేదీన భేటీ కానున్నారని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది.

ఉద్యోగుల డిమాండ్లకు సంబంధించి నియమించిన మంత్రివర్గ ఉపసంఘం 11న అందించే నివేదిక ఆధారంగా ఆయన ఉద్యోగ సంఘ నేతలతో మాట్లాడనున్నారు.

అనంతరం ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను సీఎం ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే, పదకొండవ పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని మాత్రం రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్‌ 2న ప్రకటించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలను తక్షణమే ప్రారంభించాలని, ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కు రప్పించాలని, తక్షణమే పదకొండవ పీఆర్సీ ఏర్పాటు, ఆర్డర్‌ టు సర్వ్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు శాశ్వత కేటాయింపులు, సీపీఎస్‌ విధానాన్ని రద్దు తదితర ప్రధాన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలతో ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రి వర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చలు జరిపింది. ఈ చర్చల ఆధారంగా ఓ నివేదికను రూపొందించి 11న సీఎంకు అందజేయనుంది అని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)