'మేము క్షేమం': కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

  • 9 మే 2018
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు Image copyright Masapu santhosh/whatsapp
చిత్రం శీర్షిక కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

చార్‌ధామ్ యాత్రకు వెళ్లి మంచు వర్షంలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, అధికారుల బృందం ఈ నెల 3న చార్‌ధామ్ యాత్రకు బయలుదేరింది.

ఈ బృందం కేదార్‌నాథ్‌ పర్యటనలో ఉండగా ఒక్కసారిగా మంచు వర్షం విరుచుకుపడింది. దీంతో వీరంతా కొండపైనే ఒక రోజంతా ప్రాణాలు అరచేత పట్టుకొని బతకాల్సి వచ్చింది.

ఈ ఘటనలో చిక్కుకొని సురక్షితంగా బయటపడ్డ శ్రీకాకుళంవాసి మాసపు సంతోశ్ బీబీసీతో మాట్లాడుతూ, 'మంచు వర్షంలో చిక్కుకొని మరణం దాకా వెళ్లొచ్చాం' అని తెలిపారు.

కేదార్‌నాథ్‌లో దాదాపు 30 గంటలు బిక్కుబిక్కుమంటూ గడిపామని సంతోశ్ తమ అనుభవాలను బీబీసీకి ఫోన్‌లో వివరించారు.

Image copyright Masapu santhosh
చిత్రం శీర్షిక మంచు వర్షం కారణంగా కేదార్‌నాథ్‌లో దాదాపు 30 గంటలు నరకయాతన అనుభవించామని సంతోశ్ తెలిపారు.

'30 గంటల నరకయాతన'

శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో వాటర్ షెడ్ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు, పుణ్యకేత్రాల పర్యటనకు 40 మంది బృందంతో తాము ఉత్తరాఖండ్ వెళ్లామని సంతోశ్ తమ పర్యటన వివరాలు చెప్పారు.

‘దిల్లీ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరాం. 7వ తేదీన కేదార్‌నాథ్‌లో ఉన్నప్పుడు వాతావరణం మారిపోయింది. మంచు వర్షం రావడంతో మేం ఉన్న చోటే ఇరుక్కుపోయాం. తెలిసినవాళ్లు ఎవరూ లేరు. అక్కడి అధికారులు వెంటనే కిందికి వెళ్లాలని ఆదేశించారు. కానీ, బయట అడుగుపెట్టలేని పరిస్థితి. అక్కడే రెండు గదుల్లో రాత్రంతా భయంతో గడిపాము' అని ఆయన తెలిపారు.

‘శ్వాస ఆడదు.. పట్టించుకునే వారు లేరు’

తమ బృందంలో 20 మంది మహిళలు కూడా ఉన్నారని, మంచు వర్షం కారణంగా రాత్రి చాలా మందికి శ్వాస కూడా ఆడలేదని సంతోశ్ చెప్పారు.

'కొండపైన తెలిసిన వారు ఎవరూ లేరు. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. కొందరు సృహతప్పే పరిస్థితికి వచ్చారు. ఇదే చివరి రాత్రి అనుకున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక కేదార్‌నాథ్‌ దేవాలయం

'ఆ ఒక్క ఫోన్‌ పని చేసింది'

కేవలం ఒకే ఒక్క ఫోన్ సిగ్నల్ దొరికింది. దాని వల్లే తమ గురించి బయటి ప్రపంచానికి తెలిసిందని సంతోశ్ తెలిపారు.

'కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నాక మాకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ పరిస్థితిలో కేవలం ఒక కంపెనీకి చెందిన ఫోన్ సిగ్నల్ మాత్రమే పనిచేసింది. దాంతోనే తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి మా పరిస్థితి వివరించాం.

మంచు వర్షం కారణంగా కొండప్రాంతం నుంచి డోలీలు, హెలికాప్టర్ సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు, దీంతో అందరం ప్రతికూల పరిస్థితుల్లో కాలినడకనే 6 కిలోమీటర్లు నడుచుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాము’ అని చెప్పారు.

తిరుగుముఖం

బదరీనాథ్ వెళ్దామనుకున్న ఈ బాధితులు ప్రస్తుతం తిరుగుముఖం పట్టారు.

వీరు మొదట బదరీనాథ్‌కి బయల్దేరి.. రుద్ర ప్రయాగ వరకు వెళ్లారు.

అయితే మార్గ మధ్యంలో పోలీసులు వద్దని సూచించారు. మరింత ముందుకెళ్తే ప్రమాదమని తెలిపారు.

దీంతో బాధితులు తిరుగుముఖం పట్టారు. ప్రస్తుతం వీరు రుషీకేశ్ వచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో స్వస్థలాలకు చేరుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)