బలి అయిన పాప ఎవరు? ఆమె తల్లిదండ్రులెవరు? ఈ ప్రశ్నకు బదులేది?

  • 10 మే 2018
చందమామ Image copyright Getty Images

ప్రియమైన అమ్మకి నాన్నకి,

అమ్మా! నాన్నా! భయపడకండి! ఈ ఉత్తరంలో ఎక్కడా మీ పేర్లు చెప్పను.

నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఇక్కడ అందరూ మంచిగ‌ చూసుకుంటరు.

మనం డబ్బున్నోళ్ళ‌మైనా బాగుండేది కదా! మ‌న ద‌గ్గ‌ర బోలెడు డ‌బ్బు ఉండుంటే, మనం రోడ్డు మీద పడుకునే వాళ్ళమే కాదుగా!

నన్ను మీరు అమ్మారో.. వాళ్లెత్తుకెళ్లారో నాకు తెలవ‌దు. కానీ నేను చనిపోయినంక‌ కూడా ఎందుకు మీరు ముందుకు రావడం లేదు? మనం పేదోళ్లం కాబట్టి.. మనగోడు ఎవరు పట్టించుకుంటారనా??

లేక నేను ఆడ పిల్లననా?

ఆడ‌పిల్ల‌ల‌కు ఇట్నే జ‌రుగుతుంద‌ని మొన్నో తాత అంటే నాకు ఏడుపొచ్చింది.

అమ్మా! నువ్వు నాకు చందమామను చూపించిన‌ప్పుడు మంచిగనిపించేది.

చంద‌మామ అంటే నాకు మ‌స్తు ఇష్టం. లాస్ట్ టైం అంకుల్ వాళ్ళు ఏమేమో చదువుతున్నప్పుడు కూడా చందమామ పెద్దగా, మంచిగుండె!

అట్లా చూస్తుంటేనే... అంతే..

అదే నాకు ఆఖరు రాత్రయింది.

ఉంటా...

పేరు చెప్పను!

ఈ ఏడాది జనవరి 31 చంద్ర‌గ్ర‌హ‌ణం రోజు మూఢ న‌మ్మ‌కానికి బలైపోయిన పాపే ఉత్త‌రం రాస్తే ఇలా ఉంటుందేమో.!!

బ్లడ్ మూన్ Image copyright Getty Images

ఈ ఉత్త‌రంలో పాప పేరు చెప్ప‌లేక‌పోవ‌డానికి అదే కార‌ణం - అస‌లు ఆ పాప ఎవ‌రు? ఏ ఊరు? ఏమీ తెలియ‌దు!

ఇంకా పాప మొండెం కూడా దొర‌క‌లేదు.

ఇంతకీ అసలేం జరిగింది..?

ఈ జనవరి 31న క‌నిపించిన బ్లూ బ్లడ్ మూన్ (పెద్ద చంద్ర గ్ర‌హ‌ణాన్ని) చూడ‌డానికి ప్ర‌పంచమంతా ఆత్రుత‌గా ఎదురుచూసింది. కానీ 3-4 నెల‌ల వ‌య‌సున్న ప‌సిపాప‌కు మాత్రం అదే చివరి రోజయింది.

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒక మూఢ న‌మ్మ‌కానికి బ‌లైపోయింది.

ఆ ఘటన జరిగి నేటికి వంద రోజులు అవుతుంది. కేసు చేధించిన పోలీసులు హంత‌కుణ్ణి క‌నిపెట్టారు. కానీ అమ్మాయి గురించి మాత్రం వివ‌రాలు దొర‌క‌లేదు. త‌ల్లితండ్రులు ఎందుకు బ‌య‌ట‌కు రాలేదో తెలియడం లేదు.

హైదరాబాద్ ఉప్ప‌ల్లో ఉండే రాజ‌శేఖ‌ర్ క్యాబ్ డ్రైవ‌ర్. భార్య శ్రీల‌త అనారోగ్యం పోవాలంటే బ‌లివ్వాల‌ని మేడారం జాత‌ర ద‌గ్గ‌ర ఓ మాంత్రికుడు చెప్పాడత‌నికి. నిందితుడు పోలీసుల‌కు చెప్పిన ప్ర‌కారం, జ‌న‌వ‌రి 31న రాత్రి ఒంటిగంట ప్రాంతంలో రోడ్డు ప‌క్క‌న ప‌డుకున్న వాళ్ళ ద‌గ్గ‌ర నుంచి ఒక పాప‌ను దొంగిలించి హైదరాబాద్ శివార్ల‌లో ప్ర‌తాప సింగారం గ్రామం ద‌గ్గ‌ర‌ మూసీ న‌ది ఒడ్డున‌ పాపను న‌రికి, త‌ల మాత్రం ప్లాస్టిక్ క‌వ‌ర్లో ఇంటికి తెచ్చాడు.

కిడ్నాప్ Image copyright Getty Images

మొండెం మూసీ న‌దిలో విసిరేశాడు. రాత్రి 3 గంట‌ల ప్రాంతంలో క్షుద్ర పూజ‌లు చేశారు. ఆ త‌రువాత పాప త‌ల‌పై చంద్ర‌కిర‌ణాలు, ఉద‌యం సూర్య కిర‌ణాలు ప‌డ‌టం కోసం డాబాపై పెట్టారు.

త‌న మీద అనుమానం రాకుండా ఇంట్లో ర‌క్తం మ‌ర‌క‌లు క‌డిగేశారు.

ఇంట్లో బండ‌ల (టైల్స్) మ‌ధ్య ఉన్న ర‌క్తాన్ని సేక‌రించి ల్యాబులో ప‌రీక్షిస్తే డాబాపై దొరికిన పాప ర‌క్తానికి స‌రిపోయింది.

నిందితులు అరెస్ట‌య్యారు. కానీ పాప మొండెం దొర‌క‌లేదు. పాప కుటుంబం గురించీ తెలియ‌లేదు.

మొన్న‌టి వ‌ర‌కూ మూఢ న‌మ్మ‌కాలు త‌గ్గాయ‌నుకున్నాం. కానీ ఈ మ‌ధ్య మ‌ళ్లీ పెరుగుతున్నాయి. పల్లెల్లో చ‌దువురానివాళ్ల‌ల్లో కాదు. న‌గ‌రాల్లో చ‌దువుకున్న వాళ్ల‌ది కూడా అంతే ప‌రిస్థితి.

మూఢ న‌మ్మ‌కాలు ఎంత దారుణాల‌కు దారి తీస్తాయి, మ‌నిషిని ఎంత మూర్ఖంగా మారుస్తాయ‌న‌డానికి ఈ ఘ‌ట‌న ఒక ఉదాహ‌ర‌ణ‌.

మామూలు సంద‌ర్భంలో వాళ్లు హంత‌కులు కాకపోవచ్చు. కానీ ఒక న‌మ్మ‌కం వాళ్ల చేత క్రూర‌మైన హ‌త్య చేయించింది. పసిప్రాణం బ‌లైపోయింది.

బుజ్జాయి Image copyright Getty Images

ఇటువంటి ఘ‌ట‌న‌ల్లో నిస్స‌హాయులు, పేద‌లు, సామాజికంగా వెన‌క‌బ‌డ్డ‌వారే ఎక్కువగా బలవుతున్నారు.

ఈ సందర్భంగా అఖిల‌భార‌త పీపుల్స్ సైన్స్ నెట్ వ‌ర్క్ ఉపాధ్య‌క్షులు టి ర‌మేశ్ బీబీసీతో మాట్లాడుతూ శాస్ర్తీయ దృక్పథాన్ని ప్రోత్స‌హించాలి. అప్పుడే ఇలాంటి ఘ‌ట‌న‌లు ఆగుతాయి అని అన్నారు.

ఆ ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో నేను తిరిగి కొంద‌రితో మాట్లాడాను. అక్క‌డ రోజువారీ వేత‌నాల‌కు, ఇళ్ల‌ల్లో ప‌నుల‌కు వెళ్లే వాళ్లు, డ్రైవింగ్ చేసే వారు.. పేద, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఎక్కువ‌. కొంత‌మందితో మాట్లాడిన‌ప్పుడు, వారికి మూఢ న‌మ్మకాలు ఎక్కువ‌ని అర్థ‌మైంది.

మూఢ‌న‌మ్మ‌కాలున్నాయి కానీ, ఒక‌రికి హాని క‌లిగించే ఇలాంటి ఘ‌ట‌న‌లు చూస్తే ఒక స‌గ‌టు మ‌నిషిగా బాధ క‌లుగుతుంది అని ఆరోజు తాను రిపోర్టింగ్ చేసిన అనుభ‌వాన్ని బీబీసీతో పంచుకున్నారు ది న్యూస్ మినిట్ విలేక‌రి నితిన్.

కేసు విచార‌ణ కొన‌సాగుతోంద‌ని మ‌ల్కాజ్ గిరి డీసీపీ ఉమామ‌హేశ్వ‌ర రావు బీబీసీకి వివరించారు.

పాప త‌ల్లితండ్రుల గురించి చెబితే బ‌హుమ‌తి ఇస్తామని పోలీసులు ప్ర‌క‌టించారు. వాళ్ల ఆచూకీ దొరికే అవ‌కాశం ఉందా? అస‌లు వాళ్ల‌కు తెలుసా పాప‌కేమైందో? తెలిసీ ఏం చేయ‌లేని నిస్స‌హాయ‌తా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)