సమీక్ష: మహానటి - వెండితెరపై చెరగని వెన్నెల సంతకం

  • 10 మే 2018
మహానటి Image copyright facebook

అందరు సావిత్రి అభిమానుల్లాగే,నేనుకూడా సావిత్రి జీవిత చరిత్ర సినిమా వస్తోందంటే ఆత్రుతగా ఎదురు చూశా. చివరికి నిన్న (మే 9న) మధ్యాహ్నం అంటే విడుదలయిన మొదటిరోజే"మహానటి"ని చూశా.

థియేటర్లో అరుదుగా సినిమా చూసే నేను, మహానటిని అష్టకష్టాలు పడి విజయవాడ వెళ్లి చూసేశా.

అసలు సావిత్రి గొప్పతనం ఏమిటి? ఎలా మహానటి అయ్యింది?,ఎందుకు చెరిగిపోని వెన్నెల సంతకమయ్యింది?-------అద్భుతమైన అందగత్తా? అమలులో ఉన్న కొలమానాల ప్రకారం కాదు.

ఆకట్టుకునే శరీర సౌష్టవమా? అంటే అదీ కాదు, పుష్టిగా బొండుమల్లెలాగా ఉంటుంది. అమలులో ఉన్న పరిభాషలో చెప్పుకుంటే లావు అనాలి. మరెందువల్ల ఆమెకు అంత పేరొచ్చింది?

ఆమెకు అంతమంది అభిమానులు ఎందుకున్నారని ఆలోచిస్తే..

ఆవిడ చక్కటి, గుండ్రటి మొహంలో ,అనేక రకాల భావాలు అలవోకగా పలికించే కళ్లూ.. పాత్రోచితంగా సంభాషణలను రకరకాలుగా పలకగల సామర్థ్యం.. పాత్రలో ఒదిగిపోయి ఆమె చూపే హావభావాలు ఆవిడని ఆడా,మగా తేడా లేకుండా తెలుగు వారు అభిమానించి, ఆరాధించేటట్టుగా చేశాయి. ఇంటింటి పేరుగా మార్చాయి. హీరోలకు అభిమాన బలగం ప్రధానంగా ఫలానా ఫలానా అని చెప్పుకోవచ్చేమో కానీ సావిత్రికి అభిమాన సమూహం ఈ సరిహద్దుల కతీతం.

Image copyright Keerthy Suresh/Mahanati

ఆవిడ చనిపోయి సుమారు 37యేళ్లయినా, ఆమెనేమన్నా అంటే సహించలేని అభిమానులున్నారు.

అప్పటి తరం వాళ్లే కాదు,పాత సినిమాలు చూస్తున్న ఇప్పటి తరంలో కూడా ,ఆవిడ పట్ల గాఢాభిమానం చూపే వాళ్లుండడం ఆశ్చర్యపరిచే విషయం.

అంతే కాదు నటిగానే కాక వ్యక్తి గా కూడా ఎవరి కష్టాలనయినా ,కన్నీళ్లనయినా చూసి కరిగిపోయే మనస్తత్వం, మనుషులను నమ్మే స్వభావం,తనకే పనైనా రాదని యెవరైనా అంటే ఆ పనిని కసిగా సాధించే పట్టుదల, ఇంకా యెన్నో లక్షణాల తెలుపు, నలుపుల సమాహారం సావిత్రి.

నటిగానూ, వ్యక్తిగానూ కూడా ఆమెను ఒక సినిమాలో ఆవిష్కరించబూనడం సామాన్యమయిన విషయం కాదు, అది సాహసం.

నటిగా ఎంతో పేరు, ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించినా, ఆవిడ వ్యక్తిగత జీవితంలో అనేక ఎత్తూ, పల్లాలూ, ఒడుదుడుకులూ ఉన్నాయి.

అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని, స్త్రీల పట్ల బలహీనతతో మెలిగే భర్తతో విభేదాలూ, ఇతరుల కష్టాలకి చలించిపోయి చేసే దానాలూ, క్రమశిక్షణలేని జీవితం, జీవితంలో వేటాడే ఒంటరితనం, అభద్రత, ఆమెను మద్యానికి బానిసను చేసి,ఆమె పతనానికి కారణమయ్యాయంటారు .

పతనమంటే ఏమిటి?అని ఆమె తిరిగి ప్రశ్నిస్తే? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఆలోచిస్తే ఆమె జీవితం పెద్దగా వెలిగి ఆరిపోయిన దీపం లాగా అనిపిస్తుంది. కానీ అభిమానులకు మాత్రం ఎన్నటికీ వెన్నెల పంచే జాబిల్లి.

Image copyright Keerthy Suresh

అసలు బయోపి‌క్‌లు తీసి ఒప్పించడం చాలా కష్టసాధ్యమయిన విషయం. నిజంగా జీవిత చరిత్రని జరిగింది జరిగినట్టుగా ఎవరైనా తియ్యగలరా?,తీస్తే మనం ఒప్పుకోగలమా? చూసి జీర్ణించుకోగలమా?

అందుకే ఈ సినిమాని నాగ అశ్విన్ చాలా తెలివిగా తీశాడనిపించింది.

ఆమె జీవితంలో జరిగిన విషయాలలో ఏవి తీసుకుంటే సినిమా రక్తికడుతుందో, ఎలా చెబితే ఆకట్టుకుంటుందో నిర్ణయించి, వాటిని ఆసక్తికరంగా, మంచిటీమ్ వర్క్ తో తెరకెక్కించడంలో వుంది అతని తెలివి.

ఇందులో మళ్లీ సావిత్రి వ్యక్తిత్వ ఔన్నత్యానికి భంగంరాకుండా, ఉన్న విషయాలని మసి బూసి మారేడుకాయ చేయకుండా చూపించడంలో కూడా అతని ప్రతిభా, ఈ సబ్జెక్ట్ మీద అతని ప్రేమా (ముఖ్యంగా సావిత్రి మీద)ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి.

ఇక నటీ నటుల ఎన్నిక విషయానికొస్తే కీర్తీ సురేష్ పూర్తి మార్కులు కొట్టేస్తుంది. ఆమె ఈ సినిమాకొక ఎస్సెట్ నిజంగా.

సావిత్రికి దగ్గరగా ఆమె ముఖ కవళికలు వుండటం, మేకప్‌లో ఇంకా మెరుగులు దిద్దడం వల్ల.. సావిత్రి అంత లావు లేకపోయినా, నటనలో సావిత్రిలో 50% చూపినా మనకేం లోటుగా అనిపించకపోగా మహాధ్భుతంగా అనిపించింది.

Image copyright Keerthy Suresh/Mahanati

ఒకరకంగా చూస్తే అసలైన సావిత్రికి వన్నెచిన్నెలు అద్దినట్టుగా ఉంటుందీ సావిత్రి."అహ నా పెళ్లియంట "పాటలో అభినయం గురించి నాకు చాలా భయంగా వుండేది యెలా వుంటుందో అని. ఆమె అభినయం సంతృప్తికరంగా ఉంది. నిరాశ పరచలేదు. ఆమెను చూసి సావిత్రి అభిమానులందరూ ఆనందిస్తారనడంలో సందేహం లేదు.

దుల్కర్ సల్మాన్ జెమినీగా ఫిజికల్‌గా సూటవక పోయినా, నటనాపరంగా బాగానే రక్తి కట్టించాడు. మిగతా నటీ,నటుల విషయంలో కె.వి రెడ్డిగా క్రిష్ "శభాష్ "అనిపించాడు. చక్రపాణిగా ప్రకాష్ రాజ్ సూటవలేదనే అనిపించింది. యస్వీఆర్ గా మోహన్ బాబు ఓ.కె.

ఏ.యన్నార్ గా నాగచైతన్య అంతగా ఒప్పించలేక పోయినా మనకేం అభ్యంతరంగా అనిపించదు. మిగతా నటీ ,నటులంతా సరిపోయారు.

అసలు అప్పటి కాలంలోకి తీసుకెళ్లడం ,మనం పుస్తకాలూ మాగజీన్లలో చదివిన ,చూసిన ప్రముఖులు,కె.వి రెడ్డీ, మార్కస్ బార్ట్ లే, చక్రపాణీ, సింగీతం, పింగళీ అలా అందరూ మన కళ్లముందు కనిపించడం నాస్టాల్జిక్ గా భలే బాగుంది.

"మాయాబజార్ "సినిమా షూటింగ్ మన కళ్లముందు జరుగుతున్నట్టుగా వుంటే పాత సినిమా ప్రియులందరికీ అంతకంటే పండగ ఇంకేముంటుందీ..

ఇక సమంతా కేరక్టర్ విషయానికి వస్తే జర్నలిస్ట్ గా ఆమె పాత్ర సావిత్రి గురించి ఫ్లాష్ బాక్ చెప్పడానికి బాగానే ఉపయోగపడింది. సమాంతరంగా ఆమెకు జతగా ఒక మగ కారెక్టర్ విజయ్ దేవరకొండని కల్పించి ఒక ప్రేమకథను సృష్టించడం అంతగా అవసరం లేదేమో! లేకపోయినా బాగానే ఉండేదనిపించింది.

డైలాగ్స్ బాగా కుదిరాయి. ఫోటోగ్రఫీ సినిమాకు తగినట్టుగా వుంది. ముఖ్యంగా చందమామ మీద తీసిన పాట "మూగమనసులు" చాలా బాగుంది. సంగీతం చక్కగా అతికినట్టుగా సరిపోయింది , చారులతామణీ పాడిన పాటతో సహా.

టెక్నిక్ విషయానికొస్తే, దర్శకుడుగా నాగ అశ్విన్ దే ప్రతిభంతా. అయితే అతను ఈ సినిమా విషయంలో "సిటిజన్ కేన్ "ను ఆదర్శంగా తీసుకున్నట్టనిపించింది. సిటిజన్ కేన్ లో "రోజ్బడ్ "వున్నట్టే ఈ సినిమాలో "శంకరయ్య" వున్నాడు. అందులో జర్నలిస్ట్ పాత్రకు సమాంతరంగా జర్నలిస్ట్ పాత్రలో సమంతా వుంది.

Image copyright Keerthy Suresh/FB

సినిమా మొదటి సీన్ లోనే మనసుని తాకుతుంది. చిన్న సతీష్ స్పృహలో లేని తల్లిని తట్టి, తట్టి లేపుతుంటే గుండె పిండినట్టవుతుంది చిత్రం ప్రారంభ సన్నివేశం నుండీ చివరి సన్నివేశం వరకూ "సిటిజన్ కేన్ " ప్రభావం కనపడుతుంది

ఏ మనిషి వ్యక్తిత్వాన్నయినా తీర్చిదిద్దేది బాల్యంలోని అనుభవాలే కదా---పెద్దగా ఎవరికీ తెలియని సావిత్రి బాల్య విశేషాలకీ,తండ్రి పట్ల ఆమెకు గల అనురాగానికీ ప్రాముఖ్యత ఇస్తూ సన్ని వేశాలు సృష్టించడం బాగుంది.

తండ్రి ప్రేమకు దూరమై తపించే బిడ్డగా ఆమెను చూపిస్తూ, చివరకు ఆయన ఫోటో అయినా దొరుకుతుందేమో అని ఆమె పడిన ఆరాటం మనసును పిండేస్తుంది. చిన్నపిల్లలుగా వేసిన వాళ్లుకూడా పోలికల్లో సరిపోయారు. ఇప్పటి సినిమాల్లొ పిల్లల్లాగా ఆరిందా తనం చూపక పోవడం కాస్త రిలీఫ్ గా అనిపించింది.

అంచెలంచెలుగా ఆమె "మహానటి"గా ఎదిగిన విధానం బాగా చూపారు. భర్తకు దూరమైన ఒంటరి తనంలో మద్యానికి బానిసైనపుడూ,జీవిత చరమాంకంలో శరీరం శిథిలావస్థలో వున్నప్పుడూ కూడా ఆమె ఇమేజ్ కు భంగం రాని విధంగా జాగ్రత్తగా షాట్స్ తీసినట్టనిపించింది.

సినిమాలో లోపాలు లేవని కాదు. అవి అంత పట్టించుకోదగ్గవి కాదు. సావిత్రికి నిజ జీవితంలో ఒక అక్క మారుతి అని వుండే వారు .ఆమె గురించిన ప్రసక్తే లేదు సినిమాలో .ఆమె చిన్ననాటి స్నేహితుల ప్రసక్తి వుంది కానీ ఈమె గురించి లేదెందుకో..

ఇంకో సంగతి, చిత్రం చివరలో సావిత్రి నటించిన సన్నివేశమో ,పాటో లేకపోవడం లోటుగా అనిపించింది. ఏవో రెండో,మూడో ఫోటోలు చూపారంతే.

సినిమా మొత్తంగా సావిత్రి గురించి ఒక చక్కటి అవగాహనను కల్పించి, ఆమె మనస్తత్వం గురించీ, ఆమె ఎదుర్కొన్న పరిస్థితుల గురించీ వివరిస్తూ, ఆమె బలహీనతలను స్పృశిస్తూ, నటి గానూ, వ్యక్తి గానూ ఆమె ఎంత ఉన్నతురాలో తెలియజెప్పడంలో నూటికి నూరుపాళ్లూ విజయం సాధించిందని చెప్పొచ్చు

ఈ విజయాన్ని సాధించిన నాగఅశ్విన్ కి అభినందనలు. ఎవరో అన్నట్టు తనచిత్రాన్ని తనే గీసుకుని తన ఇష్టమొచ్చినట్టు తనే చెరిపేసుకున్న ధైర్యశాలికి జోహార్

మంచి చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకి ఇది "వివాహభోజనంబు"తో సమానం. నిజం!

అవునో కాదో చూస్తే మీకే తెలుస్తుంది.

(ఇందులోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు