కర్ణాటకలో ఎవరు ఎవరి ఓటును ఎవరికి అమ్మేశారు.. ఎందుకు?

  • 11 మే 2018
ఓటరు గుర్తింపు కార్డులు Image copyright DD NEWS

కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని ఒక ఫ్లాట్ నుంచి 10 వేల ఓటరు గుర్తింపు కార్డులు దొరకడం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పరస్పర ఆరోపణలకు తెరతీసింది.

ఇంతలో అధికారులు కూడా ఈ ఓటరు గుర్తింపు కార్డులు చెల్లుబాటు అవుతాయని ధ్రువీకరించారు.

బీజేపీ రాష్ట్ర నేతలతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఓటరు గుర్తింపు కార్డులు దొరికిన విషయాన్ని వదిలి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో గందరగోళం సృష్టిస్తున్నారని రెండు పార్టీలూ పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఎందుకంటే ఎన్నికల్లో తమ ప్రత్యర్థి పార్టీ ఓడిపోతుంది కాబట్టే ఇలాంటి పనికి పాల్పడిందని రెండు పార్టీలూ అనుకుంటున్నాయి.

కర్ణాటకలో మే 12న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఓటరు గుర్తింపు కార్డులు అసలైనవే

బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ)కు చెందిన ప్రత్యేక ఎన్నికల కమిషనర్ మనోజ్ రాజన్ మాట్లాడుతూ.. "స్వాధీనం చేసుకున్న 10 వేల ఓటరు గుర్తింపు కార్డుల్లో మేం 800 కార్డులు పరిశీలించాం. ఇవన్నీ రాజరాజేశ్వరీ అసెంబ్లీ నియోజకవర్గంలోని 31వ పోలింగ్ బూత్‌కు చెందినవి. అక్కడి ఓటర్ల అసలు గుర్తింపు కార్డులు, వీటిపై ఉన్న పేర్లు నిజమైనవే" అని బీబీసీతో చెప్పారు

"ఈ 800 కార్డుల్లో 688 పాత ఓటరు జాబితాలోనివి కాగా, మిగతా ఓటరు గుర్తింపు కార్డులు, అపెండిక్స్ ఒకటి రెండు ఓటరు జాబితాలకు చెందినవి" అని ఆయన తెలిపారు.

బెంగళూరులోని ఒక ఫ్లాట్‌లో భారీగా ఓటరు గుర్తింపు కార్డులు దొరకడంపై కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మినహా మిగతా పార్టీలేవీ అంతగా ఆందోళన చెందలేదు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) రాష్ట్ర జనరల్ సెక్రటరీ క్లిఫ్టన్ డీ'రోజారియో మాట్లాడుతూ.. "ఇది చాలా కాలం నుంచీ జరుగుతోంది. ఓటు వేయడానికి ప్రజలకు డబ్బులు పంచుతున్న విషయం మీకు తెలుసా" అన్నారు.

Image copyright AnanthKumar_BJP

'ఇలా ఎప్పట్నుంచో జరుగుతోంది'

అధికారులే కాదు, తమ పేర్లు బయటపెట్టవద్దనే షరతుతో మరి కొందరు కూడా ఒక విషయం చెప్పారు. ఒక వర్గానికి చెందిన ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వారు, వారిని తమ అధీనంలో ఉంచుకోగలిగిన వారు మాత్రమే ఇలా ఓటరు గుర్తింపు కార్డులను భారీగా సేకరించగలరని తెలిపారు.

"వాళ్లు అభ్యర్థుల దగ్గరికి వెళ్లి మీరు మాకు ఇంత డబ్బివ్వండి, బదులుగా ఇన్ని ఓట్లు తీసుకోండి అని చెబుతారు. ఓటరు గుర్తింపు కార్డుల్ని అభ్యర్థుల ఏజెంటు చేతికి ఇచ్చేస్తారు. ఓటు వేయడానికి ఓటరు పోలింగ్ బూత్‌కు వచ్చినప్పుడు ఈ గుర్తింపు కార్డులు వారికి ఇస్తారు." అని డీ'రోజారియో చెప్పారు.

‘‘కొత్త కొత్త పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. వీటిలో ఒకే ఒక విషయంపై మనం దృష్టి పెట్టాలి. ఎన్నికల్లో బలం, డబ్బు ఉపయోగించి ఓట్లు కొనేస్తారు. అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం’’ అని డీ'రోజారియో తెలిపారు.

Image copyright rssurjewala

ఈ విషయం ఎలా బయటపడింది

ఆల్టర్నేటివ్ లా ఫోరంకు సంబంధించిన వినయ్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. "ఇందులో ఏదో జరిగింది. సోదాలు జరిగిన ఆ రోజు, ఆ తనిఖీలు చేసింది బీబీఎంసీ ఎన్నికల అధికారులు కాదు. కాసేపట్లోనే కేంద్ర మంత్రి ఆ అపార్ట్‌మెంట్ చేరుకున్నారు. అర్థరాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు" అని చెప్పారు.

దీనికి సంబంధించి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపార్ట్‌మెంట్‌‌కు చేరుకున్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు.

అది జరిగిన కాసేపటికే జలహళ్లి ప్రాంతంలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు దొరికాయని ఎన్నికల ప్రధాన అధికారి ( సీఈఓ ) కార్యాలయంలో ఫిర్యాదు నమోదు చేశారు.

సమయానికి అక్కడికి చేరుకున్న ఎన్నికల కమిషన్ అధికారులకు వేల సంఖ్యలో ఓటరు గుర్తింపు కార్డులు దొరికాయి. వాటిని చాలా ఆసక్తికరంగా ప్యాక్ చేసి ఉంచారు. గుర్తింపు కార్డుల పైన ఓటర్ల ఫోన్ నంబర్లు కూడా లభించాయి.

ప్రధాన ఎన్నికల అధికారి దాదాపు అర్థరాత్రి మీడియా ముందుకు వచ్చారు. అరగంట తర్వాత బీజేపీ కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, ప్రకాష్ జవదేకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కూడా మీడియాతో మాట్లాడారు.

బీబీఎంసీ ప్రత్యేక ఎన్నికల కమిషనర్ రాజన్ మాట్లాడుతూ.. "ఒక విషయం స్పష్టమైంది. ఎవరో ఈ ఓటరు గుర్తింపు కార్డులను సేకరించారు. తర్వాత వారిని ప్రలోభ పెట్టాలని, లేదా వేరే ఏదైనా చేయాలని అనుకున్నారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా పరిశీలనలో మాత్రం ఇవి నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు కావని తేలింది" అని చెప్పారు.

ఈ ఘటనపై పబ్లిక్ రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ సెక్షన్ 135 ఎ ప్రకారం కేసు నమోదైంది. ఈ సెక్షన్ ప్రకారం బూత్ కాప్చరింగ్, ఓటరు గుర్తింపు కార్డులు సేకరించడం లాంటివి నేరం. ఇవి రుజువైతే ఐదేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)