ప్రెస్‌రివ్యూ: 'మోదీ రాజీనామా అడిగా. దాన్ని మనసులో పెట్టుకునే ఈ కక్ష సాధింపు'

  • 11 మే 2018
చంద్రబాబు నాయుడు Image copyright chandrababu/facebook

'గోద్రా సంఘటనలో గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీతో రాజీనామా చేయించాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయిని డిమాండ్‌ చేశానని, ఆ ఒక్క విషయంలోనే మోదీతో తనకు విభేదం ఉందని, దాన్ని మనసులో పెట్టుకుని రాష్ట్రంపై ఆయన కక్ష సాధిస్తున్నా'రని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ హబ్‌లో రూ.2,938 కోట్లతో నిర్మించే జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ పరిశ్రమకు చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఓర్వకల్లు బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.

ఎక్కడ ఏపీ అభివృద్ధిలో ముందు ఉంటుందోనని అసూయతోనే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

'ప్రత్యేక హోదా.. విభజన హామీలు అమలు చేస్తే గుజరాత్‌ను మించిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌ సాధిస్తుందని వారికి అసూయ. తెలుగువాళ్లు బాగుపడకూడదా? ఆ పేరు నాకు రావడం వారికి ఇష్టం లేదా?

నేను కేంద్రంపై పోరాడుతుంటే ప్రతిపక్ష వైసీపీ నాపై పోరాటం చేస్తుంది. తమ్ముళ్లూ.. ప్రత్యేక హోదా నేను ఇస్తానా...' అని సీఎం వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

Image copyright uttamkumarreddy/facebook

'రైతు బంధు' పేరిట రూ.100 కోట్ల ప్రచారమా?

రైతు బంధు పథకం పేరిట రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు తక్కువ సాయం చేస్తూ ప్రచారం మాత్రం భారీగా చేసుకుంటోందని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారని సాక్షి పేర్కొంది.

ఎవడబ్బ సొమ్మని చెప్పి దేశంలోని అన్ని పత్రికలకు రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి పథకం ప్రారంభ ప్రకటనలిచ్చిందని ఆయన నిలదీశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఎన్నికల్లో ఓట్లు దండుకున్న కేసీఆర్‌...గద్దెనెక్కాక రుణమాఫీ నాలుగుసార్లు చేస్తానని మాట మార్చారని దుయ్యబట్టారు.

నాలుగేళ్లుగా రైతులకు మేలు చేయకపోగా అణచివేత ధోరణితో వ్యవహరించారని, మద్దతు ధర కోసం ఖమ్మంలో ధర్నా చేసిన గిరిజన రైతులకు సంకెళ్లు వేసి దేశద్రోహం కేసులు పెట్టి జైల్లో పెట్టారని విమర్శించారని సాక్షి తెలిపింది.

పార్టీకి 'బంధువే'!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రైతు బంధు పథకం'తో గ్రామాల్లో టీఆర్ఎస్‌కు చాలా ప్రయోజనం కలుగుతుందని ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సాక్షి పేర్కొంది.

వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి రూ.8 వేలు అందజేసే ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై, పార్టీపై రైతుల్లో విశ్వాసం పెరుగుతుందని వారంటున్నారు.

రైతు బంధు చెక్కులు అందుకున్న రైతులు సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపుతున్నాయిని సాక్షి తెలిపింది.

Image copyright Rahul gandhi/facebook

'మోదీకి నేనంటే భయం'

కర్ణాటకలో స్వశక్తితో అధికారాన్ని చేపడతామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారని ఈనాడు పేర్కొంది.

కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని గురువారం దిల్లీకి బయలుదేరి వెళ్లటానికి ముందుఆయన బెంగళూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

'మోదీకి నేనంటే భయం. భాజపా నేతలూ భయపడుతున్నారు. అందువల్లే 22 మంది మంత్రులు ఇక్కడ ప్రచారాన్ని చేస్తున్నారు' అని రాహుల్ అన్నారు.

ఈ ఎన్నికలు రాహుల్‌ గాంధీ - ప్రధాని మోదీ మధ్య సాగుతున్న పోరు మాత్రమే కాదు, సంఘ్‌ పరివార్‌ - కర్ణాటక ఆత్మగౌరవం మధ్య సాగుతున్న పోరాటం' అని పేర్కొన్నట్లు ఈనాడు వెల్లడించింది.

Image copyright Getty Images

‘రజనీ అంతే అంటూ విమర్శలొచ్చినా విజేతగా నిలిచా’

'కాలా' చిత్రం ఆడియో విడుదల వేడుకలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ప్రారంభం గురించి ప్రకటన చేస్తారంటూ రేగిన ఊహాగానాలకు ఆయన ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి ఎప్పటిలానే మరికొంత సమయముందని నాన్చుడు ధోరణినే కొనసాగించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

''రాజకీయ పార్టీని ప్రారంభించే తేదీ ఇంకా ఖరారు కాలేదు. దానికింకా సమయం ఆసన్నం కాలేదు. దానికి నేనేం చేయను. వీలైనంత త్వరగా పార్టీ పేరు ప్రకటిస్తా. ఆ తర్వాత దేవుడిదయవల్ల తమిళ ప్రజలకు మంచి రోజులు వస్తాయి'' అని రజనీకాంత్‌ పేర్కొన్నారు.

చెన్నై నందనం వైఎంసీఏ మైదానంలో బుధవారం జరిగిన 'కాలా' ఆడియో రిలీజ్‌వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. నాలుగు దశాబ్దాలుగా సినిమాల్లో నటిస్తున్నానని, ఏదైనా ఒక చిత్రం పరాజయం చెందితే ఇక రజనీ అంతే అంటూ విమర్శలు రావటం ఆనవాయితీగా మారిందని, ఆ తర్వాత తన చిత్రాలు వరుస విజయాలు తెచ్చిపెట్టడం కూడా అలవాటుగా మారిందన్నారు.

నాలుగు దశబ్దాలుగా తాను విజయాలవైపు పరుగులు తీస్తున్నానని, అభిమానులే తనను పరుగెత్తించేలా చేస్తున్నారని పేర్కొన్నారు.

కాలా చిత్రం రాజకీయ చిత్రం కాకపోయినా అందులో రాజకీయాలు ఉన్నాయని రజనీ చెప్పారు. ప్రస్తుతం వయస్సుకు దగ్గ పాత్రల్లో అభిమానులను ఆకట్టుకునే కథాంశాల్లో నటించాలన్నదే తన ధ్యేయమన్నారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు