ఆంధ్రప్రదేశ్: కబడ్డీ క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు

  • 11 మే 2018
కబడ్డీ జట్టు Image copyright SRIKANTH

ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వీర లంకయ్యపై అవినీతి, లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రానికి చెందిన పలువురు కబడ్డీ క్రీడాకారులు ఆయన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆట ఆడని వారికి కూడా కబడ్డీ సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని, క్రీడాకారిణులతో అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి విన్నవించారు. అలాగే, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ విషయం గురించి విజయవాడ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించగా.. క్రీడాకారులు వీర లంకయ్యపై తమకు ఫిర్యాదు చేశారని.. దానిపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వీర లంకయ్య వివరణ తీసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే పలుమార్లు ఫోన్ చేసినా.. ఆయన ఫోన్ తీయలేదు. అందుబాటులోకి రాలేదు.

తనకు అర్హత ఉన్నా.. వీర లంకయ్య సరైన సర్టిఫికెట్ ఇవ్వక పోవడం వల్ల మంచి ఉద్యోగాన్ని కోల్పోయానని కబడ్డీ జాతీయ క్రీడాకారిణి కె. లక్ష్మి వెంకట రమణ బీబీసీకి చెప్పారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఈమె తల్లిదండ్రులు కూలీ పనిచేస్తూ బతుకుతున్నారు.

నాలుగుసార్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆమె బీబీసీతో ఫోన్‌లో మాట్లాడుతూ, 'ఎమ్మెస్సీ చేసి కూడా ఆట అంటే ఇష్టంతో ఇంకా కబడ్డీనే జీవితంగా బతుకుతున్నా' అని చెప్పారు.

Image copyright SRIKANTH
చిత్రం శీర్షిక వీర లంకయ్య

'వీర లంకయ్య మమ్మల్ని అన్ని విధాలుగా వేధిస్తూనే ఉన్నారు. ఇటీవల ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో గ్రేడ్ 3 ఉద్యోగాలు ఉంటే వాటి ఎంపికకు హాజరయ్యాం. స్పోర్ట్స్ కోటా కింద ఆ ఉద్యోగాలు మాకు వచ్చేవే. అయితే, వాటికి ఎంపికవ్వాలంటే మా కబడ్డీ సర్టిఫికెట్లన్నీ సరైనవేనని ధ్రువీకరించే ఫాం-2 సర్టిఫికెట్ అవసరం. దాని కోసం వీర లంకయ్యను సంప్రదిస్తే చాలా అసభ్యంగా మాట్లాడటంతో కంగుతిన్నాం. మీకు సర్టిఫికెట్ ఇస్తే నాకేంటి ఉపయోగం. నా దగ్గరికి ఎప్పుడొస్తారు అంటూ మాట్లాడారు' అని ఆమె ఆరోపించారు.

ఆయనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, క్రీడల మంత్రి, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని, అయితే, ఇప్పటి వరకు ఆయనపై చర్యలు తీసుకోలేదని రమణ చెప్పారు.

వీర లంకయ్యను పదవిలోంచి దించే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

Image copyright SRIKANTH

'ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనుకుంటే పరువు తీశారు'

వైజాగ్‌కు చెందిన సునీత 10 ఏళ్లుగా కబడ్డీ ఆడుతున్నారు. 15సార్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తాను కూడా ఇదే విధమైన పరిస్థితి ఎదుర్కొన్నానని ఆమె బీబీసీకి చెప్పారు.

'టీ కొట్టు నడుపుకుంటూ మావాళ్లు నన్ను పోషించారు. కబడ్డీలో జాతీయ స్థాయిలో ఆడితే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనే ఆశ ఉండేది. కానీ, వీర లంకయ్య మాకు సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో రైల్వే ఉద్యోగం చేజారింది. చాలాసార్లు ఆయన మాతో అసభ్యంగా మాట్లాడేవారు. ఆయనపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి' అని సునీత డిమాండ్ చేశారు.

తాను జోనల్ క్యాంప్‌కు ఎంపికైనా ఆ విషయం వీర లంకయ్య తనకు చెప్పలేదని, దీంతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కోల్పోయానని వైజాగ్‌కు చెందిన మరో క్రీడాకారిణి గౌతమి బీబీసీకి తెలిపారు.

Image copyright SRIKANTH

'క్రీడాకారుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు'

వీర లంకయ్య.. కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలను శాప్ ఎండీకి కూడా అందజేశామని కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచలి శ్రీకాంత్ బీబీసీకి తెలిపారు.

'క్రీడాకారుల ఎంపికలోనూ వీర లంకయ్య అవినీతికి పాల్పడుతున్నారు. అర్హులైన క్రీడాకారులకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. అనర్హులకు జాతీయ స్థాయిలో ఆడినట్లు క్రీడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు' అని శ్రీకాంత్ ఆరోపించారు.

గత 20 ఏళ్లుగా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు. లోథా కమిటీ సిఫారసుల మేరకు ఇన్నేళ్లు ఎవరూ ఒక పదవిలో ఉండరాదు. కానీ, ఈ నిబంధనలేవీ పాటించడం లేదని శ్రీకాంత్ అన్నారు.

నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరగరాదనే ఉద్దేశంతోనే తాను క్రీడాకారులకు మద్దతిస్తున్నాని, ఇప్పటికే సీఎంతో సహా చాలామందిని కలిసి వారి సమస్యను విన్నవించానని ఆయన చెప్పారు.

క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలపై వీర లంకయ్య వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)