ఔరంగాబాద్‌ ఘర్షణల్లో ఇద్దరు మృతి; 'నీటి కనెక్షన్ తొలగింపే హింసకు కారణం'

  • 12 మే 2018
దహనమైన వాహనాలు Image copyright Ameya Pathak

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘర్షణలు చెలరేగాయి. వీటిలో ఇద్దరు చనిపోయారు. కొందరు పోలీసులు సహా 30 మంది గాయపడ్డారు. మృతులను అబ్దుల్ హరూన్ ఖాద్రి, జగన్ లాల్ ఛగన్‌లాల్ బన్సిల్‌లుగా గుర్తించారు. 17 ఏళ్ల ఖాద్రి విద్యార్థి. 62 ఏళ్ల బన్సిల్ టీ కొట్టు నడుపుకొనేవారు.

అనుమతిలేని నీటి కనెక్షన్‌ను తొలగించడంపై శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారి ఘర్షణలకు దారితీసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. ఘర్షణల నేపథ్యంలో అధికారులు 144 సెక్షన్ విధించారు.

ఘర్షణలను నియంత్రించేందుకు లాఠీఛార్జి చేశామని, రబ్బరు తూటాలు, బాష్పవాయు గోళాలు ప్రయోగించామని ఔరంగాబాద్ పోలీసు కమిషనర్ మిలింద్ భారాంబే తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ఆయన శనివారం చెప్పారు.

Image copyright Ameya Pathak

ఔరంగాబాద్‌లోని గాంధీ నగర్, మోతీ కరంజా, షా గంజ్, రాజా బజార్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున 4.30 గంటలప్పుడు రెండు పక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయని కమిషనర్ తెలిపారు. ఘర్షణల్లో షా గంజ్‌లోని చమన్ క్యాంప్‌లో దుకాణాలు దగ్ధమయ్యాయన్నారు.

సోషల్ మీడియా ద్వారా వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు.

ఘర్షణలకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పుణెలో చెప్పారు.

ఘర్షణలకు బాధ్యత వహిస్తూ ఫడణవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు