ప్రెస్‌రివ్యూ: 'కర్ణాటక ముగిసింది.. ఇక తెలంగాణపైనే అమిత్‌షా గురి'

  • 13 మే 2018
Image copyright Getty Images

కర్ణాటక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం ఇక తెలంగాణపైనే దృష్టి సారిస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారని ఆంగ్ల దినపత్రిక 'ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పేర్కొంది.

కార్యకర్తలను 2019 ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చే నెలలో తెలంగాణలో పర్యటిస్తారని ఆయన చెప్పారు.

"తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక్కడ మేం బలం పుంజుకోడానికి చాలా అవకాశాలున్నాయి. అమిత్ షా పర్యటన కార్యకర్తల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే" అని లక్ష్మణ్ అన్నారు.

"బీజేపీ ఎదుగుదలను చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారు. అందుకే ఆయన ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు సాయపడేందుకే ఆయన ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తున్నారు" అని లక్ష్మణ్ ఆరోపించారు.

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పేరుతో నగదు సాయం చేస్తానంటోందనీ, ఇది ఉపయోగకరం కాదని లక్ష్మణ్ అన్నారు.

"టీఆర్ఎస్ ఈ పథకం తెచ్చింది రైతులకు సాయం చేసేందుకు కాదు, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే" అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారని ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

Image copyright PA

'ఇక బీరుపై బాదుడే'

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి నిధుల కొరత రాకుండా మద్యం విక్రయాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25వేల కోట్ల రాబట్టుకోవాలన్న ఆలోచనలో ఉందని 'నవతెలంగాణ' ఒక కథనం ప్రచురించింది.

ఇటీవలే లిక్కర్‌ ధరలను పెంచిన సర్కార్‌.. తాజాగా బీర్ల ధరను పెంచేందుకు సన్నద్దమవుతున్నది. ప్రస్తుతం ఉన్న ధరపై 18 శాతం పెంచాలని ఆబ్కారీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆ ఫైలు సీఎం పరిశీలనలో ఉంది.

దీనికి ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే పెరిగిన రేట్లు వెంటనే అమల్లోకి రానున్నాయి.

బీర్ల ధరను పెంచాలంటూ బ్రీవరీ కంపెనీలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రస్తుతం మద్యం షాపుల్లో బీర్ల రేట్లు రూ.90 నుంచి రూ.130 వరకు ఉన్నాయి.

మద్యం ధరలను సమీక్షించేందుకు గతంలో ప్రభుత్వం రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ బీర్ల ధరలను 13 శాతానికి పెంచాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కానీ సర్కారు 18 శాతానికి పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసిందని నవతెలంగాణ పేర్కొంది.

Image copyright Facebook/Telangana State police

కానిస్టేబుళ్లకు వీక్లీ ఆఫ్ ఏదీ?

తెలంగాణలో కానిస్టేబుళ్లు వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతున్నారని 'సాక్షి' ఒక కథనాన్ని ప్రచురించింది.

మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్‌ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు.

వీక్లీ ఆఫ్‌ హామీ పదేళ్లుగా ఏ మాత్రం ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతి భద్రతల విధుల కారణంగా వీక్లీ ఆఫ్‌ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది.

పోలీసుశాఖలో దాదాపు 46 వేల మందికిపైగా కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు.

వీరికి వీక్లీ ఆఫ్‌ ఇస్తామని పదేళ్లుగా ఉన్నతాధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. సివిల్‌ విభాగం శాంతి భద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారని సాక్షి తెలిపింది.

చిరంజీవి Image copyright Mahanati/facebook

'మహానటి' దర్శకుడితో చిరంజీవి సినిమా!

'మహానటి' దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.. చిరంజీవి కోసం కథ సిద్ధం చేస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని 'ఈనాడు' తెలిపింది.

టైమ్‌ మిషన్‌ నేపథ్యంలో జరిగే కథ ఇది. స్క్రిప్టు పనులు పూర్తవ్వడానికి యేడాది సమయం పడుతుంది.

''వైజయంతీ మూవీస్‌లో సినిమా చేసి చాలా కాలం అయ్యింది. మీరు మా సంస్థలో మరో సినిమా ఎప్పుడు చేస్తారు అని స్వప్నదత్‌ అడిగినప్పుడు.. నాకు 'పాతాళభైరవి'లాంటి సినిమా చేయాలని ఉంది. మాయలూ మంత్రాలతో సరదాగా నడిచే కథ ఉంటే బాగుంటుంది' అన్నాను.

నాగ్‌ అశ్విన్‌ కూడా అలాంటి కథే తయారు చేస్తున్నాడట. తనతో సినిమా చేయడానికి నేను సిద్ధమే'' అని చిరంజీవి అన్నట్లు ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు