'మదర్స్ డే' ప్రత్యేకం: ఈ 'అమ్మ'కు ఒక్క బ్రెస్ట్‌ఫీడింగ్ తప్ప అన్ని పనులూ వచ్చు!

  • 13 మే 2018
తల్లి తండ్రి Image copyright Bhaskar palit

"ఒక్క బ్రెస్ట్‌ఫీడింగ్ వదిలేస్తే... ఓ తల్లి తన బిడ్డ కోసం చేయగలిగే పనులన్నీ నేను చేయగలను."

అవును... తల్లులందరి లాగే ఈ 'తల్లి' కూడా తన బిడ్డకు అనురాగం, ఆప్యాయతల్లో ఏ లోటూ రానివ్వదు.

తన బాబు కోసం వంట చేస్తుంది. స్కూలుకు సిద్ధం చేస్తుంది. చదువు చెబుతుంది. కలిసి ఆడుకుంటుంది. రాత్రి నిద్రపోయే ముందు కథలు చెబుతుంది.

ఈ అమ్మ స్పర్శలో ప్రేమ కూడా మరే ఇతర తల్లి స్పర్శలో ఉండే ప్రేమకన్నా ఏ మాత్రం తక్కువ కాదు.

కాకపోతే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ 'అమ్మ' మహిళ కాదు.... పురుషుడు.

తల్లిగా, తండ్రిగా రెండు పాత్రల్నీ పోషిస్తున్న ఓ తండ్రి కథ... 'మదర్స్ డే' ప్రత్యేకం.

Image copyright Bhaskar palit

అమ్మంటే భావోద్వేగాల సాగరం...

దిల్లీకి చెందిన 39 ఏళ్ల భాస్కర్ పాలిత్ తన ఆరేళ్ల కుమారుడు ఈషాన్‌కు తండ్రిగానే కాదు, తల్లిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2014 ఫిబ్రవరి 15న భాస్కర్ తన భార్య నుంచి వేరయ్యారు.

అప్పటికి ఈషాన్‌ వయస్సు కేవలం రెండేళ్లే. అప్పటి నుంచీ అతడు భాస్కర్ చేతుల్లో పెరుగుతున్నాడు.

ఈషాన్‌కు తల్లి లేని లోటు రాకుండా భాస్కర్ అన్ని విధాలా ప్రయత్నించారు. మరోమాటలో, ఆ పిల్లాడికి ఆయన తల్లిగా మారారని చెప్పుకోవాలి.

ప్రస్తుతం ఈషాన్ ప్రపంచం అంతా తన బాబా (తండ్రి) చుట్టూతనే తిరుగుతుంది. ఎప్పుడైనా కిందపడినపుడు దెబ్బ తగిలితే అతడి నోటి నుంచి 'అమ్మా' అని కాకుండా 'బాబా' అనే మాటే వెలువడుతుంది.

అమ్మ అనేది భావోద్వేగాల మహాసముద్రానికి మారుపేరని భాస్కర్ అంటారు. ఆ సముద్రంలోకి బిడ్డను ఎవరు దించితే వారే వాడికి అమ్మ అవుతారు.

తల్లి మమకారాన్ని జెండర్ మూసలో బిగించి చూడటం సరైంది కాదని ఆయన అభిప్రాయం.

Image copyright Bhaskar palit

ఎంత కష్టం ఈ బాధ్యత?

భార్యతో విడిపోయాక భాస్కర్‌కు ఎదురైన మొదటి ప్రశ్న - రెండేళ్ల పిల్లాడిని ఒంటరిగా ఎలా పెంచాలి?

అయితే తన ఒళ్లో ఉన్న ఈషాన్ ముఖంలో చిరునవ్వును చూడగానే ఆయన భయాలన్నీ పటాపంచలయ్యాయి.

ఇక ఆ రోజు తర్వాత ఆయన మనసులో మళ్లీ ఇలాంటి ఆలోచన మరెన్నడూ రాలేదు.

మీరెప్పుడైనా భాస్కర్, ఈషాన్‌ల ఇంట్లోకి వెళ్తే అక్కడ మహిళ లేని లోటు అసలు కనిపించనే కనిపించదు.

పైగా ఆ ఇంట్లోని గోడలన్నీ ఆ తండ్రీకొడుకుల అందమైన బంధం గురించిన కథలే మీ చెవిలో వినిపిస్తాయి.

Image copyright Bhaskar palit

'సోషల్ లైఫ్‌కు ఢోకా ఏమీ లేదు'

సింగిల్ ఫాదర్ అయ్యాక తన జీవితంలో కొన్ని మార్పులు వచ్చిన మాట వాస్తవమే కానీ, దాంతో తన సోషల్ లైఫ్ ఏమీ దెబ్బతినలేదని భాస్కర్ అంటారు.

ఆయన ఇప్పుడు కూడా తన స్నేహితులతో సమయం గడుపుతారు. ఆయన బయటకు వెళ్లినపుడు ఈషాన్ మంచిచెడ్డలు రాజు చూసుకుంటారు. భాస్కర్ ఇంట్లో సహాయకుడిగా రాజు పని చేస్తున్నారు.

తాను ఈషాన్‌కు బాబా కావడంతో పాటు మంచి స్నేహితుడిని కూడానని భాస్కర్ అంటారు. ఇద్దరూ కలిసి బయట తిరుగుతారు. సినిమాలకు వెళ్తారు. షాపింగ్ చేస్తారు.

ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు. ఈషాన్ చెస్ ఆడుతుంటే భాస్కర్ అతడికి కంపెనీ ఇస్తారు.

భాస్కర్‌కు పదిహేనేళ్లుగా స్మోకింగ్ అలవాటు ఉండేది. కానీ ఈషాన్ అన్న ఒక్క మాటతో ఆయన సిగరెట్‌ను పూర్తిగా మానేశారు.

ఈషాన్‌ను భాస్కర్ తల్లిలాగా బాగా ముద్దు చేస్తుంటారు. అవసరమైనప్పుడు సుతిమెత్తగా మందలిస్తుంటారు.

Image copyright Bhaskar palit

'స్త్రీపురుషుల పాత్రల్ని మూసల్లో దించింది సమాజమే'

"మహిళల పనులు ఇవీ, పురుషుల పనులు ఇవీ అంటూ మన పాత్రల్ని స్టీరియోటైప్ చేసింది మన సమాజమే. మహిళలు కిచెన్‌లో ఉండాలని, పురుషులు బయట తిరగాలని నిర్దేశించింది సమాజమే" అని భాస్కర్ అంటారు.

"పిల్లలను మహిళలే సాకాలి అనేది కూడా అలాంటిదే. మనం ఈ మూసధోరణిని మార్చెయ్యాల్సిన అవసరం ఉంది."

తాను ఇంటిపనులు చేయడాన్ని, రోజూ ఏం వంట చేయాలో నిర్ణయించడాన్ని ఈషాన్ శ్రద్ధగా గమనిస్తుంటాడని భాస్కర్ చెబుతారు.

పెరిగి పెద్దయ్యాక దీని ప్రభావం అతడిపై తప్పక ఉంటుందని భాస్కర్ అభిప్రాయపడతారు. మనుషులు పోషించే పాత్రల్ని అతడు జెండర్ ఆధారంగా స్టీరియోటైప్ చేయడు.

Image copyright Bhaskar palit

బాబా చేతి వంట!

భాస్కర్‌కు వంటపనుల్లో ఆసక్తి ఎక్కువ. రకరకాల డిష్‌లు తయారు చేసి ఆయన ఈషాన్‌కు తినిపిస్తుంటారు.

తల్లి చేతి వంటను అందరూ తింటారు, కానీ తండ్రి చేతి వంట రుచి చూసే అవకాశం ఈషాన్‌కు దక్కిందని ఆయనంటారు.

ఓ తండ్రి తన బిడ్డను ఎదకు హత్తుకొని ముద్దు ముద్దు మాటలు మాట్లాడినపుడు అది మాతృత్వపు మమకారానికి ఏ మాత్రం తీసిపోదని భాస్కర్ అంటారు. కాకపోతే మనం దీనికి 'పితృత్వం' అనో లేదా మరొకటనో పేరేదీ పెట్టుకోలేదు.

"అసలు మదర్స్ డే, ఫాదర్స్ డే అనే భావనలే ఏదో ఒకరోజున అంతరించిపోవాలని నేను ఆశిస్తాను. జెండర్ ఆధారంగా స్త్రీపురుషుల పనులను మూస పోసే పద్ధతుల్ని మనం వదిలించుకోవాలి. ఏదైనా జరుపుకోవాలనే అనుకుంటే పేరెంట్స్ డే లేదా ఫ్రెండ్స్ డే జరుపుకోవడం ఉత్తమం" అంటారు భాస్కర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)