ప్రకాశం ఫ్లోరోసిస్: ‘బతుకు వికసించదు... చావు కరుణించదు’

  • 5 జూన్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: తరాలు మారినా తీరని వ్యథ - కెమెరా: వలబోజు శివ కుమార్

దేశంలో ఏ మూలకు వెళ్లినా కనిపించే కూలీల్లో తెలుగువారు తప్పక ఉంటారు. వారిలో ప్రకాశం జిల్లా స్వరం కూడా వినిపిస్తుంటుంది.

ఇదంతా కరవు కాటకాలు, వెనుకబాటుతనం పుణ్యమే.

పేరులోని ప్రకాశం ఆ జిల్లాలో మచ్చుకైనా కనిపించదు. అభివృద్ధి కానరాదు కానీ, చెప్పాలంటే మాత్రం సవాలక్ష సమస్యలున్నాయి. వర్షాలు పడవు, కరవు-కాటకాలు, వలసలు ఇలా ఎన్నెన్నో.

బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని మరో పెను సమస్యకు ఈ జిల్లానే పుట్టినిల్లు. అదే ఫ్లోరోసిస్. ఇది ఎముకలను గుల్ల చేస్తుంది. మనుషులను బతికున్న శవాలుగా మారుస్తుంది.

2018 జూన్ నాటికి ప్రతి ఒక్కరికీ సురక్షిత తాగు నీరు అందిస్తామని.. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని గతంలో అధికారులు చెప్పారు. ఇంతకు వాస్తవం ఎలా ఉంది?

చిత్రం శీర్షిక ఫ్లోరోసిస్ బాధితురాలు

తొలికేసు ఇక్కడే

దేహం సజావుగా నడవాలంటే కావాల్సినవన్నీ సమపాళ్లలో అందాలి. కొంచెం అటుఇటు అయినా సమస్యలు తప్పవు.

శరీరానికి అవసరమైన అనేక ఖనిజ లవణాల్లో ఫ్లోరైడ్ ఒకటి. అయితే ఇది ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే.

భూగర్భ జలాలు, భూపొరలు, కొన్ని రకాల రాళ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పరిమితికి మించి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ఒకటి.

భారతదేశంలో తొలి ఫ్లోరోసిస్ కేసు నమోదైంది ఈ ప్రాంతంలోనే.

బ్రిటిష్ పాలనలో నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన పొదిలి, దర్శి ప్రాంతాల్లో 1937లో తొలి కేసును గుర్తించినట్లు, ప్రకాశం జిల్లాలో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ (ఎన్‌పీపీసీఎఫ్) మెడికల్ ఆఫీసర్ సీహెచ్ సత్యనారాయణ తెలిపారు.

ఆ తరువాత 33 ఏళ్లకు ప్రకాశం జిల్లా ఏర్పడింది. ప్రస్తుతం పొదిలి, దర్శి ఈ జిల్లాలో ఉన్నాయి.

ప్రకాశం జిల్లా భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ పరిమాణం
ప్రాంతం మిల్లీ గ్రాములు/లీటరు
కనిగిరి 2.8 నుంచి 10.8
మర్రిపూడి 6.2
కొనకనమిట్ల 2.5-4.8
పామూరు 2.9-3.9
చీమకుర్తి 2.4-2.8

(ఆధారం:డీఎంహెచ్ఓ, ప్రకాశం జిల్లా)

ప్రాధాన్యం లభించిందా?

భారతదేశంలో ఫ్లోరోసిస్ పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది నల్లగొండ జిల్లా.

అయితే దానికి ఏ రకంగానూ తీసిపోని ప్రకాశం జిల్లాకు మాత్రం అంతగా ప్రాధాన్యం లభించలేదు.

ఇందుకు కారణాలు అనేకం. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కొంత. సంఘటితంగా పోరాడే ప్రజా సంఘాలు లేకపోవడం. స్వచ్ఛంద సంస్థలు పెద్దగా దృష్టి పెట్టకపోవడం.

82 శాతం మండలాల్లో ఫ్లోరైడ్

ప్రకాశం జిల్లా మండలాల సంఖ్య 56. వీటిలో 46 ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలే. అంటే దాదాపు 82 శాతం మండలాల్లో ఫ్లోరోసిస్ సమస్య ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. తాగే నీటిలో లీటరుకు 1.5 మిల్లీగ్రాముల వరకు ఫ్లోరైడ్ ఉండొచ్చు. అంతకు మించితే ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ 1.5 నుంచి 10 మిల్లీగ్రాముల మధ్య ఉంది.

కనిగిరి, కందుకూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, దర్శి, చీమకుర్తి, మార్కాపురం వంటి ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ ప్రభావం చాలా ఎక్కువ.

ప్రకాశం జిల్లాలో వానలు చాలా తక్కువ. చెప్పుకోదగ్గ నదులు కానీ, ప్రాజెక్టులుగానీ లేవు.

భూగర్భజలాలపై ఆధారపడటం తప్ప ప్రజలకు మరో మార్గం లేదు.

ఎక్కువ స్కెలటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదైన మండలాలు
మండలం కేసుల సంఖ్య
కనిగిరి 22
పీసీపల్లి 16
మర్రిపూడి 16
పొదిలి 14
సీఎస్ పురం 12
కొనకనమిట్ల 11

(కాలం:2012-2015, ఆధారం: డీఎంహెచ్‌ఓ, ప్రకాశం జిల్లా)

మూడు తరాల వ్యథ

కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది.

పీసీపల్లె మండలం బుడ్డారెడ్డి పల్లెలోని బొర్రా నర్సిరెడ్డి కుటుంబానిది మూడు తరాల వ్యథ.

85 ఏళ్ల నర్సిరెడ్డి ఫ్లోరోసిస్‌ బాధితుడు. ఆయన కుమారుడు, మనవడికి ఈ వ్యాధి వారసత్వంగా వచ్చింది.

ఆయన కుమారుడు మాలకొండయ్యకు 50 ఏళ్లు. నర్సిరెడ్డి మనవడు(కూతురి కుమారుడు) బ్రహ్మయ్యది కూడా అదే వ్యథ.

బ్రహ్మయ్యలో మానసిక ఎదుగుదల ఆగిపోయింది. 30 ఏళ్లు వచ్చినా ఆయన ఇంకా చిన్నపిల్లవాడే. ఆకలేస్తే అడగలేని దయనీయ స్థితి.

ప్రస్తుతం బ్రహ్మయ్య తాత వద్దే ఉంటున్నాడు.

బతుకు రోజూ నరకంగా ఉంటోందని, చావు కూడా మమ్మల్ని కరుణించడం లేదని నర్సిరెడ్డి కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఇలాంటి కన్నీటి కథలు ఇక్కడ ఎన్నో వినిపిస్తాయి.

చిత్రం శీర్షిక గత రెండేళ్లలో ఎటువంటి కేసులు నమోదు కాలేదని ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి చెబుతున్నారు

ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

భారతదేశంలో తొలి ఫ్లోరోసిస్ కేసును గుర్తించి ఎనిమిది దశాబ్దాలు గడిచాయి.

మరి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఫ్లోరోసిస్ నియంత్రణలో ప్రభుత్వం ఎంత వరకు సఫలీకృతం అయింది?

కేంద్రం 2008-09లోఎన్‌పీపీసీఎఫ్ కార్యక్రమాన్ని చేపట్టింది. 2010-11లో ప్రకాశం జిల్లా ఇందులో భాగమైంది.

ఎన్‌పీపీసీఎఫ్ కింద ఫ్లోరోసిస్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఫ్లోరోసిస్ నియంత్రణలో ఉన్నట్లు ప్రకాశం జిల్లా డీఎంహెచ్‌ఓ ఎస్.రాజ్యలక్ష్మి తెలిపారు.

చిత్రం శీర్షిక నర్సిరెడ్డి కుమారుడు మాలకొండయ్య

వేలల్లో ఫ్లోరోసిస్ కేసులు

2012-2015 మధ్య 132 స్కెలటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదయ్యాయని, 2016, 2017లో ఇటువంటి కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని ఆమె చెప్పారు.

స్కెలటల్ ఫ్లోరోసిస్ అంటే ఎముకలు వంకర్లు పోవడం, గుల్లబారడం, వెన్నెముక వంగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నాన్ స్కెలటల్ ఫ్లోరోసిస్ విభాగంలో 12,000 కేసులు నమోదయ్యయాని రాజ్యలక్ష్మి వెల్లడించారు. నరాల బలహీనత, కండరాల పటుత్వం తగ్గడం, కడపులో మంట వంటివి నాన్ స్కెలటల్ ఫ్లోరోసిస్ విభాగంలోకి వస్తాయి.

ఇక డెంటల్ ఫ్లోరోసిస్ విషయానికి వస్తే 2012 నుంచి ఇప్పటి వరకు 4,900 కేసులు నమోదైనట్లు రాజ్యలక్ష్మి వివరించారు.

పళ్లపై గారపట్టడం, గొగ్గిర్లు పోవడం వంటి లక్షణాలు డెంటల్ ఫ్లోరోసిస్‌లో కనిపిస్తాయి. దీనిని ప్రాథమిక స్థాయిలో గుర్తించడం ద్వారా స్కెలటల్ ఫ్లోరోసిస్ రాకుండా నివారించొచ్చు.

మరి 2012 నాటికి ముందు పరిస్థితి ఏమిటి అని అడిగితే తమ వద్ద అందుకు సంబంధించిన గణాంకాలు లేవని అధికారులు తెలిపారు.

ప్రకాశం జిల్లా: 2015, 2016లలో డయాలసిస్ కేసులు
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1740
ఇతర కారణాల వల్ల కిడ్నీలు పాడైన వారి సంఖ్య 279
మొత్తం 2019

(ఆధారం: డీఎంహెచ్‌ఓ, ప్రకాశం జిల్లా)

'ప్రాథమిక స్థాయిలోనే నివారణ'

ప్రాథమిక స్థాయిలోనే ఫ్లోరోసిస్‌ను గుర్తించి నివారించేందుకు ఇళ్లు, పాఠశాలల్లో సర్వేలు నిర్వహిస్తున్నట్లు రాజ్యలక్ష్మి వెల్లడించారు.

గత అయిదేళ్లలో 693 గ్రామాల పరిధిలో 17,981 గృహాలను సర్వే చేయగా, ఇందులో 72 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

పాఠశాలల్లో 32 వేల మంది విద్యార్థులను పరీక్షించినట్లు వివరించారు.

ప్రాథమిక స్థాయిలో ఫ్లోరోసిస్ నియంత్రణకు బాధితులకు పౌష్టిక ఆహారం, విటమిన్ ట్యాబ్లెట్లు వంటివి ఇస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎన్‌పీపీసీఎఫ్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్ సీహెచ్‌వీ సత్యనారాయణ చెబుతున్నారు.

‘వెంటనే అంచనా వేయలేం’

గత రెండేళ్లలో ప్రమాదకరమైన స్కెలటల్ ఫ్లోరోసిస్ కేసులు నమోదు కానంత మాత్రానా, సమస్య తగ్గినట్లు కాదని నిపుణులు అంటున్నారు. ఫ్లోరోసిస్ ప్రభావాన్ని వెంటనే అంచనా వేయలేమని చెబుతున్నారు.

‘ఫ్లోరోసిస్‌ను ఒక్క రోజులో గుర్తించలేం. దీని లక్షణాలు మెల్లమెల్లగా బయటపడతాయి. అందువల్ల కొత్త తరంపై దీని ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమ’ని డాక్టర్ శ్రీ భూషణ్ రాజు అన్నారు.

ప్రభావిత గ్రామాల్లో చాలా వరకు ప్రజలు ఆర్‌ఓ నీటినే తాగుతున్నారు.

కొత్త తరం విద్య, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు.

ఇటువంటి వారిలో ఫ్లోరోసిస్ కొంతమేరకు నియంత్రణలో ఉన్నట్లు కనిపిస్తుందని ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక డాక్టర్ సీహెచ్‌వీ సత్యనారాయణ

'కిడ్నీలతో సంబంధం లేదు'

ఫ్లోరోసిస్‌కు కిడ్నీల వ్యాధులకు సంబంధం లేదని రాజ్యలక్ష్మి చెబుతున్నారు. ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలు లేవని తెలిపారు.

ఫ్లోరోసిస్ వల్లే కిడ్నీల పనితీరు దెబ్బతిని మరణిస్తున్నారని చెప్పడంలో వాస్తవం లేదంటున్నారు. కిడ్నీల వైఫల్యంతో 2015లో 182 మంది మరణించగా, 2016లో ఆ సంఖ్య 241కి చేరింది.

అయితే కిడ్నీలపై ఫ్లోరోసిస్ ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం కష్టమని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (నిమ్స్) నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రీ భూషన్ రాజు అన్నారు.

‘ఫ్లోరోసిస్ బాధితులు నొప్పుల నుంచి ఉపశమన కోసం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. పెయిన్ కిల్లర్స్‌ను దీర్ఘకాలం వాడితే కిడ్నీల పని తీరు దెబ్బతింటుంది.

ఎక్కువ మోతాదుల్లో ఫ్లోరైడ్ శరీరంలోకి చేరినప్పుడు కిడ్నీలపై భారం పడుతుంది. అధికంగా ఉన్న ఫ్లోరైడ్‌ను బయటకు పంపేందుకు కిడ్నీలు మరింత శ్రమిస్తాయి.

అందువల్ల ఫ్లోరైడ్ వల్ల కిడ్నీలు చెడిపోతున్నాయా? లేక పెయిన్ కిల్లర్స్ వల్ల దెబ్బతింటున్నాయా? అనే విషయాన్ని స్పష్టంగా గుర్తించలేక పోతున్నామ’ని రాజు తెలిపారు.

ప్రకాశం జిల్లాలో రక్షిత నీటి సరఫరా
మొత్తం ఆవాసాలు 2333
పూర్తిస్థాయిలో రక్షిత నీరు అందుతున్న ఆవాసాలు 624
పాక్షికంగా రక్షిత నీరు అందుతున్న ఆవాసాలు 1,656
రక్షిత నీరు అందని ఆవాసాలు 53

ఆధారం: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ (గణాంకాలు 2017 ఏప్రిల్ నాటివి)

రక్షిత మంచి నీరు?

సురక్షిత మంచినీరు ప్రతి ప్రాంతానికి అందించడం ద్వారా ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్న అధికారుల మాటలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయి?

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. 2017 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలోని 48,364 ఆవాసాలకు గాను 23,495 ఆవాసాలకు పూర్తి స్థాయిలో సురక్షిత మంచినీరు అందుతోంది.

24,424 ఆవాసాలకు పాక్షికంగా రక్షిత తాగు నీరు లభిస్తోంది. 445 ఆవాసాలకు అసలు అందడం లేదు.

చిత్రం శీర్షిక గ్రామాల్లో ఎక్కువ మంది ఆర్వో నీళ్లు తాగుతున్నారు

'వెలిగొండ ప్రాజెక్టుతోనే..'

ఫ్లోరోసిస్‌కు సంబంధించి కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేదని కనిగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి అంటున్నారు.

కనిగిరి పరిధిలో మూడు మండలాలకు మాత్రమే రక్షిత తాగునీటిని ఇస్తున్నారని, ఇంకా 180 గ్రామాల వరకు నీటిని ఇవ్వాల్సి ఉందని చెబుతున్నారు. తగిన నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు.

'ఫ్లోరోసిస్ నివారణకు నదులు, చెరువులు వంటి వనరుల్లోని జలాలే ఏకైక పరిష్కారం. ఇక్కడ భూమిలో, నీటిలో ప్రమాదకర స్థాయిలో ఫ్లోరైడ్ ఉంది. వర్షాలు పుష్కలంగా కురిసే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలకు కృష్ణా జలాల ద్వారా తాగు, సాగు నీరు అందివ్వాలి. ఇందుకు వెలిగొండ ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి' అని ఆయన అన్నారు.

అయితే ఉగ్రనరసింహారెడ్డి వ్యాఖ్యలపై అభిప్రాయం కోరేందుకు ప్రయత్నించగా కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబురావు నుంచి స్పందన రాలేదు.

తాగునీరే పరిష్కారం

ప్రకాశం జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యకు రక్షిత నీరే పరిష్కారంగా కనిపిస్తోంది.

తాగునీరు అందించినంత మాత్రాన ఫ్లోరోసిస్‌ను నివారించలేరు. సాగుకు, పశువులకు సురక్షిత నీటిని అందించాలి.

భూమిలోని ఫ్లోరైడ్ పంటల ద్వారా ఆహారం రూపంలో శరీరంలోకి చేరుతోంది. కాబట్టి ఇక్కడి భూములు కొన్నేళ్లు ఫ్లోరైడ్ రహిత నీటితో తడిస్తే ఫలితం రావొచ్చు.

ఆ జలాలను తీసుకొచ్చే అపరభగీరథుల కోసం ప్రకాశం జిల్లా ఎన్నో తరాలుగా ఎదురు చూస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...

ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ