కశ్మీర్ యువత మిలిటెన్సీ బాట ఎందుకు పడుతోంది?

  • 14 మే 2018
కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజిస్టు మిలిటెంట్లలో చేరిన 40 గంటల్లోనే మరణించాడు. Image copyright Samir Yasir
చిత్రం శీర్షిక కశ్మీర్‌లో మిలిటెంట్లుగా మారుతున్న యువత

కశ్మీర్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు 50 మందికి పైగా మిలిటెంట్లను అంతమొందించాయి. భారత పాలనకు వ్యతిరేకంగా 1989 నుంచి జరుగుతున్న సాయుధ తిరుగుబాట్లలో మరణిస్తున్న మిలిటెంట్ల అంత్యక్రియలు, యువతను ఎలా మిలిటెన్సీ వైపు నెడుతున్నాయో సమీర్ యాసిర్ వివరిస్తున్నారు.

ఆకుపచ్చని వస్త్రంలో చుట్టిన మిలిటెంట్ మృతదేహాన్ని సమాధిలో దించాక.. కొంత మంది మహిళలు అతని సాహసాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు.

ప్రజలు ముందుకు వచ్చి అతని శరీరాన్ని గౌరవసూచకంగా తాకుతున్నారు. అతని నుదుటిని ముద్దాడడానికి యువకులు తోసుకుంటున్నారు. కొందరు అతని కాళ్లను తాకారు. నిమిషనిమిషానికి అక్కడ జనం పెరుగుతున్నారు. చెవులు చిల్లులు పడేలా నినాదాలు చేస్తున్నారు. కొంత మంది టీనేజర్లు మైక్రోఫోన్ తీసుకుని, తిరుగుబాటును ప్రేరేపించే పాటలు పాడడం ప్రారంభించారు.


కశ్మీర్ గురించి ఐదు విషయాలు

  1. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి దాదాపు 70 ఏళ్లుగా భారత, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ వివాదం నడుస్తోంది.
  2. రెండు దేశాలు మొత్తం కశ్మీర్ భూభాగం తమదే అంటున్నాయి. కానీ కేవలం కొద్ది భూభాగం మాత్రమే రెండు దేశాల ఆధీనంలో ఉంది.
  3. భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన మూడు యుద్ధాల్లో రెండు కశ్మీర్ కారణంగానే జరిగాయి.
  4. 1989 నుంచి ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతంలో భారత పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాట్లు పెరిగాయి.
  5. పెరిగిన నిరుద్యోగం, నిరసనకారుల విషయంలో భద్రతా బలగాలు అనుసరిస్తున్న విధానాలు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి.

ఏప్రిల్ నెలలో ఓ మధ్యాహ్నం - బక్కగా ఉండి, జుట్టు తెల్లబడి, లోతుకుపోయిన కళ్లతో ఓ వృద్ధురాలు భద్రతా బలగాలతో జరిగిన పోరాటంలో మరణించిన మిలిటెంట్ అంత్యక్రియలకు హాజరయ్యారు.

19 ఏళ్ల ఉబైద్ షఫీ అంత్యక్రియలకు వచ్చిన జూనా బేగం, ''నేను నా కుమారుడికి తుది వీడ్కోలు పలకడానికి వచ్చాను'' అన్నారు.

ఉబైద్ కాలేజీ వదిలేసి, 2017 ఫిబ్రవరిలో హిజ్బుల్ ముజాహిదీన్ అనే వేర్పాటువాద బృందంలో చేరాడు.

తను ఉబైద్ కన్నతల్లి కాకపోయినా, అతనికి బాల్యంలో తాను పాలిచ్చినట్లు వృద్ధురాలు వెల్లడించారు అతణ్ని చూసేందుకు ఆమె ఏడు కిలోమీటర్ల దూరం నుంచి అరిగిపోయిన ప్లాస్టిక్ చెప్పులు వేసుకుని వచ్చారు.

మిలిటెంట్ అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న భద్రతాబలగాలను తప్పించుకోవడానికి రహస్యంగా తరలి వచ్చారు ఆమె. అంత దూరం నుంచి వచ్చిన ఆ వృద్ధురాలిని కొందరు యువకులు తమ భుజం మీదకు ఎక్కించుకొని, ఉబైద్ మృతదేహం వద్దకు తీసుకెళ్లారు.

ఆమె బుల్లెట్లతో రూపు మారిన ఉబైద్ ముఖాన్ని ముద్దాడారు.

ఆ తర్వాత గుంపును ఉద్దేశించి, ''మీలో ఎవరికైనా పోలీస్ అధికారి కావాలని ఉందా?'' అని ప్రశ్నించారు.

''లేదు, మాకెవ్వరికీ లేదు'' అనే సమాధానం వచ్చింది.

''మీరు మిలిటెంట్ కావాలనుకుంటున్నారా?''

''అవును.''

ఆ తర్వాత వాళ్లు ''ఆజాదీ (స్వాతంత్ర్యం)'' అని నినాదాలు చేశారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక అంత్యక్రియల్లో మిలిటెంట్లను కీర్తిస్తూ మహిళల పాటలు

దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల కశ్మీర్ యువత తుపాకులు చేత పడుతున్నారు. భారత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లే వీరికి ఆదర్శం.

వీళ్లు భారత సైనికుల వాహనాలకు ఎదురుగా నిలబడి రాళ్లు విసురుతారు. రహదారులను దిగ్బంధిస్తారు.

ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో ఇలా 30 మందికి పైగా మరణించారు.

ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న కశ్మీర్ లోయలో 2016 జులైలో మిలిటెంట్ లీడర్ బుర్హాన్ వనీ భద్రతా బలగాల చేతిలో మరణించడంతో అక్కడ హింసాత్మక ఘటనలు పెరిగాయి.

ఇటీవల వనీ స్నేహితుడు సద్దాం పద్దర్ మరణించినప్పుడు అతని అంత్యక్రియలకు వేల మంది హాజరయ్యారు.

ఈ ఘర్షణల్లో మరణించిన వారిలో కశ్మీర్ యూనివర్సిటీకి చెందిన ఒక సోషియాలజిస్టు కూడా ఉన్నాడు. మిలిటెంట్లలో చేరిన 40 గంటలలో అతను భద్రతా బలగాల కాల్పుల్లో మరణించాడు.

Image copyright EPA
చిత్రం శీర్షిక కశ్మీర్ వీధుల్లో రాళ్లు విసురుతున్న యువత

'తుపాకులతో గౌరవ వందనం'

క్రమం తప్పకుండా జరుగుతున్న ఈ అంత్యక్రియలే అనేక మంది యువకులు మిలిటెన్సీలో చేరడానికి కారణమవుతున్నాయి. వీరిలో చాలా మంది 1989 తిరుగుబాటు ప్రారంభమైన తర్వాతే పుట్టిన వారు ఉన్నారు.

17 ఏళ్ల జుబైర్ అహ్మద్, పద్దార్ అంత్యక్రియలు హాజరు కావడానికి ఆరు చెక్ పాయింట్లను దాటుకుని వచ్చాడు. గత రెండేళ్లలో అతను ఇప్పటివరకు 16 అంత్యక్రియలకు హాజరయ్యాడు.

ఆనాడు అతని ఎదురుగా కొంతమంది ఏకే-47లు చేత పట్టుకుని ఉన్నారు.

అవే ఏకే-47లతో వారు మరణించిన తమ సహచరునికి నివాళులు అర్పించారు.

పద్దార్ తల్లి వాళ్లను చూపుతూ, ''ఏదో ఒక రోజు వీళ్లంతా భారతదేశాన్ని కశ్మీర్ నుంచి బయటకు గెంటేస్తారు'' అని గర్జించారు. ఆమె కేకకు ప్రతిస్పందనగా అక్కడ మూగి ఉన్న వారంతా నినాదాలు చేశారు.

Image copyright Hilal Shah
చిత్రం శీర్షిక మిలిటెంట్ల అంత్యక్రియల్లో యువత వేలాదిగా పాల్గొంటారు

జుబైర్ అహ్మద్ గత ఏడాది ఇలాంటి అంత్యక్రియలకు హాజరైనపుడు తీసిన చిత్రాలు ఫేస్ బుక్‌లో కనిపించడంతో అతణ్ని అరెస్ట్ చేశారు.

తన పేరు ఇప్పుడు అనేక కేసులలో ఉండడంతో తన కెరీర్ ముగిసిందని, తానిక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని ఆ టీనేజ్ కుర్రాడు తెలిపాడు.

''ఒక రోజు నేను కూడా ఇలాగే ఏకే-47 పట్టుకుని గాలిలోకి కాలుస్తాను'' అని జుబైర్ అహ్మద్ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)