ప్రెస్‌రివ్యూ: బీజేపీలో 'కన్నా' ముసలం

  • 14 మే 2018
కన్నా లక్ష్మీనారాయణ Image copyright kanna laxminarayana/facebook

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం పుట్టింది. కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కడంతో సోము వీర్రాజు కినుక వహించారు. ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అని ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించింది.

సాయంకాలం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది.

తమ నేత సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, ఈ రెండు కమిటీలలోని కొందరు సభ్యులు ప్రకటించారు.

తమ రాజీనామాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపినట్టు తెలిపారు.

మొదటి నుంచి పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని పోషించుకుంటూ వస్తున్న సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తూ వచ్చారు. తనకే ఆ పదవి వస్తుందని చాలా రోజుల నుంచీ ప్రచారం చేసుకుంటున్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

Image copyright AP Govt

అమరావతిలో ప్రజలకు వెయ్యి ఫ్లాట్లు

'ప్రజలకు విక్రయించేందుకు రాజధాని అమరావతిలో 1000 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సన్నాహాలు చేస్తోంద'ని ఈనాడు పేర్కొంది.

రాజధాని అమరావతి నిర్మాణంలో ఉత్ప్రేరక పాత్ర పోషించడం, తనకంటూ ఒక 'బ్రాండ్‌ఇమేజ్‌' ఏర్పాటు చేసుకోవడం, లాభాపేక్ష లేకుండా ప్రజలకు నాణ్యమైన ఫ్లాట్ల నిర్మాణం లక్ష్యంగా సీఆర్‌డీఏ సొంతంగా అపార్ట్‌మెంట్లు నిర్మించనుంది.

మరో ఒకటి రెండు నెలల్లో ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది. అపార్ట్‌మెంట్ల ఆకృతుల రూపకల్పన ప్రక్రియ జరుగుతోంది. సీఆర్‌డీఏ ఫ్లాట్లు నిర్మిస్తే కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎంతవరకు ఆసక్తి చూపుతారన్న అంశంపై 'నైట్‌ ఫ్రాంక్‌' అన్న సంస్థతో డిమాండ్‌ సర్వే చేయించింది. మంచి స్పందనే ఉంటుందని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

ఆర్‌డీఏ అపార్ట్‌మెంట్లను 14-15 ఎకరాల్లో అన్ని వసతులతో నిర్మించనున్నారు. ప్రాథమికంగా శాఖమూరు సమీపంలో దీనికి స్థలం గుర్తించినట్టు తెలిసింది.

సీఆర్‌డీఏ జీ+11 విధానంలో అపార్ట్‌మెంట్లు నిర్మించనుంది. ప్రైవేటు నిర్మాణ సంస్థలు విక్రయిస్తున్న ధర కంటే 10-15 శాతం తక్కువ ధరకే ఈ ఫ్లాట్లు విక్రయించాలన్నది సీఆర్‌డీఏ ఆలోచన అని ఈనాడు వెల్లడించింది.

పూత పూస్తే వాతే!

దురదగా ఉందని నేరుగా ఔషధ దుకాణాలకెళ్లి పూతమందును కొనుగోలు చేయడం ఇకనుంచి చెల్లుబాటు కాదు. వచ్చే నవంబరు 1వతేదీ నుంచి వైద్యుల చీటీరాత లేకుండా వీటిని అమ్మడానికి వీల్లేద కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసిందని ఈనాడు పేర్కొంది.

ఫంగస్‌, బ్యాక్టీరియాలకు వినియోగించే పూత మందుల్లో హానికారక 'స్టెరాయిడ్‌' ఉంటుందనీ, విచ్చలవిడి వాడకం వల్ల దీర్ఘకాలంలో అనర్థాలు జరిగే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనిపై దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం తాజాగా 'గెజిట్‌ ప్రకటన' వెలువరించింది.

కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా వినియోగించాల్సిన సాధారణ ఔషధాల జాబితాను ప్రకటించి, వాటి ధరలను 2013లో నిర్ణయించింది.

దేశం మొత్తమ్మీద ఏటా రూ.500-600 కోట్ల మేర పూతమందుల వ్యాపారం జరుగుతుందని అంచనా అని ఈనాడు వెల్లడించింది.

నగరం తూర్పుకు నగిషీలు

నగరంలోని తూర్పు భాగానికి నగిషీలు దిద్దే పనికి హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నడుం బిగించిందని సాక్షి తెలిపింది.

'లుక్‌ ఈస్ట్‌' పేరిట రాజధాని శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది.

ఇప్పటికే మాదాపూర్‌లో శిల్పారామం తరహాలో ఉప్పల్‌లో మినీ శిల్పారామం నిర్మించే పనులు జరుగుతున్నాయి. ఉప్పల్‌ భగాయత్‌ లేఅవుట్‌ పక్కనే ఐదెకరాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ మినీ శిల్పారామం కోసం కేటాయించింది.

ల్యాండ్‌ పూలింగ్‌ పథకంలో భాగంగా మేడిపల్లిలోని 360 ఎకరాల అసైన్డ్‌ భూముల్లో, ప్రతాపసింగారంలో 200 ఎకరాలను లే-అవుట్‌ చేయాలని భావించింది. మేడిపల్లి సర్వే నంబర్‌ 63లోని 360 ఎకరాల అసైన్డ్‌ భూములను తమకు అప్పగించాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని సాక్షి పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)