నాదిర్ షా: భారతదేశం నుంచి ఎన్ని లక్షల కోట్ల సంపదను దోచుకున్నారు? కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?

  • జఫర్ సయ్యద్,
  • బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
తలపాగాలు మార్చుకోవడం

ఫొటో సోర్స్, MUSEE_GUIMET_PARIS

ఫొటో క్యాప్షన్,

నాదిర్ షా, మహమ్మద్ షాలు తలపాగాలు మార్చుకోవడం

1739 మే 12న సాయంత్రం.. దిల్లీలో సంబరంగా ఉంది. షాజహాన్‌బాద్, ఎర్రకోట నలువైపులా వేడుకలు అంబరాన్నంటాయి.

పేదలకు షర్బత్, తినుబండారాలు, పండ్లు పంచుతున్నారు. ఫకీర్ల జోలె నిండా కాసులు నింపుతున్నారు.

ఈ రోజు మొఘల్ రాజసౌధం 13వ అంతస్తులో ఇరాన్ బాద్షా నాదిర్ షా ముందు మహమ్మద్ షా తల వంచుకుని కూర్చుని ఉన్నాడు. ఈ సారి ఆయన తలపై రాజ మకుటం లేదు.

దానికి ఒక కారణం ఉంది. అప్పటికి రెండున్నర నెలల కిందటే నాదిర్ షా ఆయన్నుంచి సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

56 రోజులు దిల్లీలో ఉన్న తర్వాత ఇక నాదిర్ షా తిరిగి ఇరాన్ వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు భారతదేశ పగ్గాలను ఆయన తిరిగి మహమ్మద్ షాకు అప్పగించాలనుకుంటున్నాడు.

శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను నాదిర్ షా ఊడ్చేశాడు. పట్టణంలో ఉన్న సంపన్నులు, ప్రముఖులందరి జేబులూ ఖాళీ చేశాడు.

ఈ నేపథ్యంలో.. దిల్లీలోని ఒక వేశ్య నూర్ భాయి, నాదిర్ షాకు ఒక సమాచారం అందించింది.

మీరు సేకరించిన ఈ మొత్తం సంపద కంటే విలువైనది ఒకటుందని చెప్పింది. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలో దాచాడని ఉప్పందించింది.

నాదిర్ షా అప్పటికే తన ఎత్తులతో ఎంతోమంది చక్రవర్తులకు చుక్కలు చూపించారు. ఎంతో సంపద దోచుకున్నారు. ఆ సమయంలో ఆయన వేసిన ఎత్తు తిరుగులేనిదిగా చెబుతారు.

ఆయన మహమ్మద్ షాతో ఇరాన్ లో ఒక సంప్రదాయం ఉందన్నారు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని చెప్పారు.

‘‘ఈ రోజు నుంచి మనం సోదరులం. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా?’’ అన్నారు.

మహమ్మద్ షా అప్పుడు తలవంచడం తప్ప వేరే ఏదీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు.

నాదిర్ షా తన తలపాగా ఆయన తలపై పెట్టాడు. మహమ్మద్ షా తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు.

అక్కడితో ఒక చరిత్రకు తెరపడింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారతదేశం హద్దులు దాటి ఇరాన్ చేరుకుంది.

ఫొటో క్యాప్షన్,

ఔరంగజేబు అలంగీర్ భారత్‌లో ప్రత్యేక ఇస్లాం విధానాన్నిఅమలు చేశారు

రంగీలా బాద్షా

కోహినూర్ వజ్రాన్ని తలపాగాలో దాచి ఉంచిన మహమ్మద్ షా తన ముత్తాత ఔరంగజేబు ఆలంగీర్ పాలన సమయంలో 1702లో జన్మించారు.

ఆయన మొదటి పేరు రోషన్ అక్తర్. కేవలం 17 ఏళ్ల వయసుకే సల్తనత్-ఈ-తైమూరియాగా సింహాసనంపై కూర్చున్నప్పుడు, రాజగురువు సయ్యిద్ బ్రద్రాన్ 1719 సెప్టంబర్ 29న ఆయనకు అబూ అల్ ఫతా నసీరుద్దీన్ రోషన్ అక్తర్ మహమ్మద్ షా అనే బిరుదు ఇచ్చారు.

ఆయన అప్పుడే రంగీలా అనిపించుకున్నారు. అయినా అంత పెద్ద పేరు ఎవరికి గుర్తుంటుంది, అందుకే ప్రజలు రెండింటినీ కలిపేసి మహమ్మద్ షా రంగీలాగా మార్చేశారు. అందుకే భారతదేశంలో ఆయన్ను ఇప్పటికీ ఇదే పేరుతో పిలుస్తారు.

మహమ్మద్ షా పుట్టినపుడు ఔరంగజేబు ఆలంగీర్ భారతదేశంలో ప్రత్యేకమైన ఇస్లాం విధానాలను అమలు చేశారు. కళాకారులు దీనికి మొదటి లక్ష్యంగా మారారు. కళాకారులు ఇస్లాం సూత్రాలను పాటించడంలేదని ఔరంగజేబు భావించేవారు.

ఇటలీ యాత్రికుడు నికోలో మనూచీ దీనికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను రాశారు.

ఔరంగజేబు పాలనలో సంగీతంపై నిషేధం విధించినపుడు, గాయకులకు, సంగీత విద్వాంసులకు పొట్టగడవమే కష్టమైపోయిందన్నారు.

దీంతో విసిగిపోయిన వేలాది మంది మంది కళాకారులు శుక్రవారం నమాజు సమయంలో దిల్లీలోని జమా మసీదు దగ్గర ఆందోళనలకు కూడా దిగారు. తమ సంగీత వాయిద్యాలన్నిటినీ శవాల్లా మోసుకెళ్తూ గట్టిగా ఏడుస్తూ నిరసన తెలిపారు.

ఔరంగజేబు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. "ఎవరు చనిపోయారు, మీరంతా ఎవరి కోసం ఇలా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు" అని అడిగాడు

దానికి కళాకారులు "మీరు సంగీతాన్ని హత్య చేశారు. దాన్ని పూడ్చి పెట్టడానికి వెళ్తున్నాం" అని చెప్పారు. దానికి ఔరంగజేబు "గుంత కాస్త లోతుగా తవ్వండి" అని చెప్పాడట.

భౌతికశాస్త్రం సూత్రం ప్రకారం ప్రతి చర్యకూ ప్రతిచర్య కూడా ఉంటుంది

ఇదే సూత్రం చరిత్రలో మానవ సమాజానికి కూడా వర్తిస్తుంది. మనం దేన్నైనా కఠినంగా అణచివేయాలని చూస్తే అది అంతే బలంగా మరింత ఎత్తుకు లేస్తుంది.

అందుకే ఔరంగజేబు తర్వాత కూడా అలాంటిదే జరిగింది. మహమ్మద్ షా పాలనలో అంతకు ముందు అణచివేసిన ఆ కళలన్నీ మరింత అభివృద్ధి చెందాయి.

ఫొటో సోర్స్, SAN_DIEGO_MUSEUM_OF_ART

ఫొటో క్యాప్షన్,

మహమ్మద్ షా రంగీలా

రెండు వ్యతిరేక ధ్రువాలు

దీనికి అత్యంత ఆసక్తికరమైన సాక్ష్యం 'మెర్క్‌-ఎ దిల్లీ'లో ఉంది. ఇది ఒక పుస్తకం, దీన్ని మహమ్మద్ షా దర్బారులోని కలీ ఖాన్ రాశారు. అందులో ఆయన రాసిన అక్షరాలు మనకు ఒక దృశ్యం గురించి వివరిస్తాయి. ఆ సమయంలో స్వేచ్ఛా వాయువులు పీల్చిన దిల్లీ రూపం మన కళ్ల ముందు నిలుపుతాయి.

ఈ పుస్తకం ఒక వింత విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. బాద్షా మాత్రమే కాదు, దిల్లీ ప్రజల జీవితం కూడా రెండు చివరల మధ్య ఊగే పెండులంలా ఉండేదని చెప్పింది.

ఒక వైపు ఆయన అన్ని సౌకర్యాలూ ఉండే విలాసవంతమైన జీవితం గడిపారు. అలా అలసిపోయినప్పుడు ఆయన దాన్ని భక్తి మార్గం వైపు మళ్లించేవారు. అక్కడ సంతృప్తి చెందినపుడు తిరిగి ఉన్న చోటుకే తిరిగొచ్చేవారు.

మెర్క్‌-ఎ దిల్లీ చెబుతున్న దాని ప్రకారం ఆయన్ను నమ్మిన వారు హజరత్ అలీ, నిజాముద్దీన్.. కుతుబ్ సాహిబ్ దర్గా, ఇంకా చాలా చోట్ల గుమిగూడేవారని అంటోంది. ఒక వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరోవైపు సంగీత ప్రదర్శనలు కొనసాగేవని చెబుతారు. ఆ సమయంలో ఆలపించిన "మహమ్మద్ షా రంగీలా సజ్నా బిన్ కారీ బదరాయా, తన్ నా సుహాయే" అనే గీతాన్ని ఇప్పుడు కూడా పాడుతారు.

ఫొటో సోర్స్, metmuseum

ఫొటో క్యాప్షన్,

పల్లకీలో మహమ్మద్ షా

ఏనుగుల ట్రాఫిక్ జామ్

ఆ సమయంలో నృత్యం కూడా ఎందుకు వెనకబడింది. దానికి మనం మొదట చెప్పుకున్న నూర్ భాయ్ లాంటి వాళ్లే కారణం.

ఆ సమయంలో సంపన్నులు, ప్రముఖుల దగ్గర ఏనుగులు ఉండేవి, అవి బయటకు వస్తే ట్రాఫిక్ జామ్ అయ్యేది.

''ఎవరైతే ఇంటిని పట్టించుకోరో వారు నాశనమయ్యారు. స్నేహం మత్తులో పడిన వారు అన్నీ పోగొట్టుకునేవారు. ఒకప్పుడు ఘనంగా బతికిన వారు సర్వం పోగొట్టుకుని బికారులయ్యేవారు అని మెర్క్‌-ఎ దిల్లీలో రాశారు.

నూర్ బాయికి నాదిర్ షాతో సంబంధం ఉండేది. ఎప్పుడో ఏకాంత సమయంలో ఆమె కోహినూర్ గుట్టును నాదిర్ షా దగ్గర విప్పేసి ఉండచ్చు.

కోహినూర్ గురించి తన పుస్తకంలో రాసిన ఈస్టిండియా కంపెనీ చరిత్రకారుడు థియో మాక్‌ట్రూఫ్ దీని గురించి చెప్పాడు. కొంతమంది చరిత్రకారులు మాత్రం దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు బేగంల గురించి దర్గా కులీ ఖాన్ మరో ఆసక్తికరమైన విషయం రాశారు.

దిల్లీలోని ప్రముఖ బేగంలు పైజామా వేసుకునేవారు కాదు. బదులుగా తమ శరీరంలో కింది భాగాన్ని వాళ్లు పైజామాల్లా పూలు, ఆకులతో కప్పుకునేవారు. రోమన్లలా కింది భాగాన్ని అలంకరించుకునేవారు. ఇలా వాళ్లు సంపన్నుల ఇళ్లకు వెళ్లేవారు. ఆశ్చర్యం ఏటంటే పైజామాకు, ఆ అలంకరణకు ఉన్న తేడా ఎవరికీ తెలిసేదే కాదు. ఆ రహస్యాన్ని వారే స్వయంగా చెప్పేవరకూ ఆ నైపుణ్యం గురించి ఎవరూ తెలుసుకోలేకపోయేవారు

ఈ సమయంలో మహమ్మద్ షాకు రాత్రీపగలూ తేడా ఉండేది కాదు. ప్రతిరోజూ ఉదయం ఆయన ఝరోఖా నుంచి ఏనుగులు పోరాటాన్ని చూసేవారు. అప్పుడు ఎవరైనా ఏవైనా ఫిర్యాదులు చేస్తే వాటిని వినేవారు. మధ్యాహ్నం గారడీ, నటుల ప్రదర్శనలు చూసి ఆనందించేవారు. సాయంత్రం నృత్య, సంగీతాల్లో మునిగితేలేవారు. రాత్రి ....

ముత్యాలు పొదిగిన చెప్పులు..

బాద్షాకు మరో ఆసక్తి కూడా ఉండేది. ఆయన తరచూ గౌను లాంటి దుస్తులు వేసుకునేవారు. దర్బారుకు వచ్చేటపుడు సిల్కు దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారు.

ఆ సమయంలో ఆయన ముత్యాలు పొదిగిన పాదరక్షలు వేసుకునేవారని చెబుతారు. నాదిర్ షా దాడుల తర్వాత ఆయన తెల్లటి దుస్తుల్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడేవారని పుస్తకాల్లో రాశారు.

ఔరంగజేబు కాలంలో మరుగునపడ్డ మొఘల్ చిత్రలేఖనం కూడా మహమ్మద్ షా కాలంలో బాగా వృద్ధిలోకి వచ్చింది.

ఆ సమయంలో ప్రముఖ చిత్రకారులైన నిధా మల్, చిత్రమన్ వేసిన చిత్రాలు మొఘల్ చిత్రకారుల స్వర్ణ యుగాన్ని తర్వాతి తరాల కళ్ల ముందు నిలిపాయి.

బాద్షా ‘మగతనం’పై వదంతులు

షాజహాన్ తర్వాత మొదటి సారి దిల్లీలో మొఘల్ చిత్రకారుల వైభవం మళ్లీ కొనసాగింది. ఆ శైలిలో తేలికపాటి రంగులు ఎక్కువగా ఉపయోగించేవారు. అంతే కాదు, మొఘల్ వర్ణచిత్రాలలో కళాకారులు ఫ్రేమ్ నింపేసేవారు.

మహమ్మద్ షా సమయంలో వర్ణచిత్రాలను సాదాసీదాగా చిత్రించడం జరిగింది. దీనికోసం చూపులు అంతా వెళ్లేలా ఖాళీలు ఉంచేవారు. ఆ కాలానికే చెందిన ఒక ప్రముఖ చిత్రంలో మహమ్మద్ షా రంగీలా ఒక యువతితో శృంగారంలో పాల్గొన్నట్లు కూడా చూపించారు.

ఈ చిత్రంతో దిల్లీలో వదంతులు మొదలయ్యాయి. బాద్షాలో మగతనం లేదని, అది నిజం కాదని చెప్పుకునేందుకు ఆయన ఈ చిత్రాన్ని వేయించాడని చెప్పుకున్నారు.

దీన్నే ఇప్పుడు 'పోర్న్ ఆర్ట్ కేటగిరీ'లో పెడుతున్నారు.

ఫొటో క్యాప్షన్,

ఖైబర్ పాస్ వద్ద నాదిర్ షా

కొంప ముంచిన విలాసాలు

మహమ్మద్ షా విలాసాలలో మునిగి తేలుతున్నప్పుడు, నాదిర్ షా సైన్యం 1739లో ఖైబర్ పాస్ దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నాదిర్ షా సైన్యం ముందుకు వస్తోందని మహమ్మద్ షాకు ఎప్పుడు సమాచారం ఇచ్చినా, ఢిల్లీ చాలా దూరం ఉంది, ఇప్పటి నుంచే కంగారెందుకు అనేవారని చెబుతారు.

నాదిర్ షా దిల్లీకి వంద మైళ్ల దూరంలోకి చేరినపుడు, మొఘల్ చక్రవర్తి తన జీవితంలో మొదటిసారి తన సైన్యాన్ని ముందుకు నడిపించాల్సి వచ్చింది. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఆయన సైన్యం లక్షల్లో ఉన్నా అందులో ఎక్కువ భాగం వంటవాళ్లు, సంగీత కళాకారులు, కూలీలు, సేవకులు, మిగతా ఉద్యోగులే ఉన్నారు. ఇక సైన్యంలో యుద్ధం చేసేవారి సంఖ్యకొస్తే లక్ష కంటే కాస్త ఎక్కువ మాత్రమే ఉండేవారు.

ఇటు ఇరాన్ సైన్యంలో కేవలం 55 వేల మందే ఉన్నారు. కానీ నాదిర్ షా పోరాట దళం మొఘల్ సేనలతో ఆడుకున్నాయి. కేవలం మూడు గంటల్లో కర్నాల్ మైదానంలో యుద్ధం ముగిసింది. మహమ్మద్ షాను బంధించిన నాదిర్ షా దిల్లీ విజేతగా నగరంలోకి ప్రవేశించాడు.

ఫొటో క్యాప్షన్,

నాదిర్ షా

మారణహోమం

తర్వాత రోజు ఈద్-ఉల్-జుహా. దిల్లీ మసీదుల్లో జరిగిన నమాజుల్లో నాదిర్ షా పేరు చదివారు. ముద్రణాలయాల్లో ఆయన పేరున నాణేలను ముద్రించారు.

తర్వాత కొన్ని రోజులకే ఒక జ్యోతిష్కుడు నాదిర్ షాను హత్య చేశాడని వదంతులు వ్యాపించాయి. దిల్లీలో ఉన్న వారు ఇరాన్ సైనికులపై దాడులు ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందనేది చరిత్రలో కొన్ని పేజీలు వర్ణించాయి.

సూర్యుడి కిరణాలు ఇప్పుడిప్పుడే నేలను తాకాయి. నాదిర్ షా దురానీ తన గుర్రంపై స్వారీ చేస్తూ ఎర్ర కోట నుంచి బయటకు వచ్చారు. ఆన శరీరం అంతా దుస్తులతో కప్పి ఉంది. తలపై లోహంతో చేసిన కవచం, నడుముకు ఖడ్గం ఉంది. ఆయనతోపాటు కమాండర్, జనరల్ ఉన్నారు. వారు అర మైలు దూరంలో ఉన్న చాందినీ చౌక్ రోషనుద్దౌలా మసీదుకు వెళ్తున్నారు.

ఇది ఆయన సైనికుల గురించి ఒక సంకేతం. ఉదయం 9 గంటలకే నరమేధం మొదలైంది. క్రూరులైన సైనికులు ఇంటింటికీ వెళ్లి దొరికిన వారిని దొరికినట్టు చంపడం ప్రారంభించారు. అప్పుడు పారిన రక్తం కాలువల్లో ప్రవహించింది. లాహౌరీ దర్వాజా, ఫైజ్ బజార్, కాబూలీ దర్వాజా, అజ్మీరీ దర్వాజా, హౌజ్ ఖాజ్, జౌహరీ బజార్ లాంటి ప్రాంతాలు శవాలతో నిండిపోయాయి.

వేలాది మహిళలపై అత్యాచారం చేశారు. వందలమంది బావుల్లో దూకి ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ఇరాన్ సైనికుల చేతికి చిక్కకుండా తమ భార్యలను, కూతుళ్లను హత్య చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోహినూర్ వజ్రం

బంగారు, వెండి ఇటుకల తయారీ

చరిత్ర చెబుతున్న దాని ప్రకారం ఆ రోజు 30 వేల మందికి దిల్లీ ప్రజలు సైనికుల కత్తులకు బలయ్యారు. చివరకు మహమ్మద్ షా తన ప్రధాన మంత్రిని నాదిర్ షా దగ్గరకు పంపారు. ప్రధాన మంత్రి ఆయన దగ్గరకు వట్టి కాళ్లతో, తలకు ఏదీ లేకుండా వెళ్లాడని, ఇలా కవిత చదివాడని చెబుతారు.

"చచ్చిన వారిని బతికించి వారిని మళ్లీ నరికి చంపండి. మీ కత్తికి బలి చేయడానికి ఇక ఎవరూ మిగల్లేదు"

ఇది జరిగిన తర్వాత ఎప్పుడో నాదిర్ షా తన కరవాలాన్ని ఒరలో పెట్టాడని, తన సైనికులతో మారణహోమం ఆపించాడని చెబుతారు.

నరమేధం ఆగగానే దోపిడీలు మొదలయ్యాయి. నగరాన్ని భాగాలుగా పంచేశారు. సైనికులకు అక్కడకు వెళ్లి వీలైనన్ని వస్తువులు, సంపదను దోచుకువచ్చే పని అప్పగించారు. సంపదను దాచిన వారిని చిత్రహింసలు పెట్టేవాళ్లు.

నగరం మొత్తం ఖాళీ కాగానే, నాదిర్ షా తిరిగి తన మహలుకు చేరుకునేవారు. ఆ కాలంలో నాదిర్ షా దర్బారులో ఉన్న చరిత్రకారుడు మీర్జా మహ్దీ అస్త్రాబాదీ కొన్ని ఉదాహరణలు చెప్పారు.

కేవలం కొన్ని రోజుల్లోనే పనివాళ్లను రాజ ఖజానాను వదిలి వెళ్లమని ఆదేశించారు. అక్కడ వాళ్లు కలలో కూడా చూడని ముత్యాలు, పగడాలు, వజ్రాలు, బంగారం, వెండి భారీగా ఉండేవి. దిల్లీ పాలనలో కోట్ల రూపాయలను రాజ ఖజానా నుంచి నాదిర్ షా ఖజానాకు పంపారు. దర్బారులోని ఉమ్రా, నవాబులు, రాజులు బంగారం, రత్నాల ద్వారా భరణం చెల్లించేవారు.

సులభంగా ఇరాన్ తీసుకెళ్లడానికి వీలుగా ఒక నెల వరకూ వందల మంది పనివాళ్లు బంగారు, వెండి ఆభరణాలు, పాత్రలను కరిగించి వాటిని ఇటుకల్లా తయారు చేశారు.

షఫీకుర్ రహమాన్ తుజక్ ఈ నద్రిలీ దీన్ని వివరించారు. ‘‘మేం క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న మహమ్మద్ షాకు దాన్ని ప్రసాదించాం. ఆయన కళ్లకు ఏదైనా విలువైనదని అనిపిస్తే, మేం పొరపాటున మర్చిపోయినది ఏదైనా ఉంటే, దాన్ని బహుమతిగా తీసుకెళ్లాలని అనుకున్నాం. ప్రజలు ఏడుస్తూ, అరుస్తున్నారు. మేం లేని ఎర్రకోట ఖాళీగా ఉంటుందని పదే పదే చెబుతున్నారు. ఎర్ర కోట ఖాళీగా కనిపిస్తోందన్నది ముమ్మాటికీ నిజం.’’

నాదిర్ షా మొత్తం ఎంత సంపద దోచుకున్నాడు? చరిత్రకారుల అంచనా ప్రకారం. ఆ సమయంలోనే ఆయన దోచిన సంపద విలువ 70 కోట్లు. ఇప్పుడు దాని విలువ 156 బిలియన్లు ఉంటుంది. అంటే సుమారు 10 లక్షల 50 వేల కోట్ల రూపాయలు. మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద సైనిక దోపిడీ. దీనితోపాటు మహమ్మద్ షా నుంచి నాదిర్ షా తెలివిగా సొంతం చేసుకున్న కోహినూర్ వజ్రం. దీని విలువ అమూల్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)