భారత్‌ను వణికించిన పిడుగుపాట్లు

  • 14 మే 2018
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం Image copyright Getty Images

ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, పిడుగుపాట్ల కారణంగా ఆదివారం భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రాణ నష్టం సంభవించింది.

దుమ్ము తుఫాను కారణంగా దిల్లీ అతలాకుతలమైంది. పశ్చమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈదురు గాలులు, పిడుగు పాట్లకు భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించింది.

తెలుగు రాష్ట్రాలపై పిడుగుపాటు

ఆంధ్రప్రదేశ్‌లో 12 జిల్లాల్లో ఆదివారం పిడుగుపాట్లు బీభత్సం సృష్టించాయి.

పిడుగుపాట్ల వల్ల ఏపీలో 12 మంది చనిపోయినట్లు రాష్ట విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉదయం 10.23 గంటల నుంచి రాత్రి 7.38 గంటల వరకు ఉరుములు, మెరుపులుతో ఈదురు గాలులు వీచినట్లు వెల్లడించింది.

తెలంగాణలో అకాలవర్షం, పిడుగుపాట్ల కారణంగా ఐదుగురు చనిపోయారు. మంచిర్యాల జిల్లా బీమారం మండల పరిధిలో ముగ్గురు రైతులు, వికారాబాద్ జిల్లాలో ఇద్దరు పిడుగుపాటుకు బలయ్యారు.

Image copyright Getty Images

మరో 24 గంటలు ఇదే పరిస్థితి..

పశ్చిమతీరంలో వాతావరణ మార్పుల కారణంగా వచ్చే వారం కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

హిమాలయాల పరిధిలోని జమ్ము-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షంతో పాటు పిడుగులు, దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

తెలుగు రాష్ర్టాల్లో మరో 24 గంటల పాటు వాతావరణ పరిస్థితి ప్రతికూలంగానే ఉండొచ్చని తెలిపింది.

Image copyright Getty Images

దిల్లీలో విమానాల రాకపోకలకు అంతరాయం

ఇసుక తుఫాను ఆదివారం దిల్లీని అతలాకుతలం చేసింది. బలమైన గాలులు, దుమ్ము తుఫాను కారణంగా దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు విమానాలను రద్దు చేశారు.

ఆదివారం రాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)