భారత వాయుసేన వార్ గేమ్: ఏమిటీ ’గగన్‌శక్తి 2018‘?

  • 15 మే 2018
భారత వాయుసేన యుద్ధ విన్యాసాలు Image copyright Indian Air Force

పశ్చిమ బెంగాల్‌లోని కలైకుందా వైమానిక స్థావరం. ఏప్రిల్ 14వ తేదీ శనివారం. అప్పుడే తెల్లవారుతోంది. భారత వాయుసేన యుద్ధ విమానం సుఖోయ్-30 నింగిలోకి దూసుకుపోయింది. అది రష్యా తయారీ యుద్ధ విమానం. అస్త్రశస్త్రాలన్నిటినీ అమర్చుకుని ఉంది.

ఈ యుద్ధ విమానం గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కొద్ది సేపటికే అరేబియా సముద్రంలోని అది లక్షద్వీప్ మీదకు చేరింది. అక్కడి నుంచి వెనుదిరిగి తమిళనాడులోని తంజావూరు దగ్గర మళ్లీ నేల మీదకు వచ్చింది. ఈ ప్రయాణం మధ్యలో గాలిలోనే ఇంధనం నింపుకుంది.

అది గాలిలోకి లేచాక ఎక్కడా దిగకుండా 4,000 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలాంటి సామర్థ్యం సాధించటం కోసం ఏ వైమానిక దళమైనా ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధపడుతుంది.

మరయితే.. ఇలా ఆ ఒక్క విమానమే ఎగిరిందా?

Image copyright Indian Air Force
  • ఏప్రిల్ 8 నుంచి 22వ తేదీ మధ్య.. వాయుసేన తన శిక్షణ కార్యక్రమాలన్నిటినీ దాదాపు నిలిపివేసింది. దాదాపు 1,400 మంది ఆఫీసర్లు, 14,000 మంది సిబ్బందిని యుద్ధక్రీడ (వార్‌గేమ్)లో దించింది. విమానం నడపగల వారందిరనీ అందుబాటులో ఉండాలని నిర్దేశించింది.
  • ఆ రెండు వారాల్లో.. దేశం నలుచెరగులా దాదాపు 1,100 యుద్ధ విమానాలను ‘ఆపరేషనల్ డ్యూటీ’లో మోహరించింది.
  • యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు, గాలిలో ఇంధనం నింపే విమానాలు (ఫ్లైట్ రీఫ్యూయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్), మానవ రహిత విమానాలు (అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్స్) అన్నీ కలిపి 11,000 సార్లు నింగిలోకి ఎగిరివచ్చాయి.

భారత సైన్యం, నౌకాదళాలతో కలిసి వాయుసేన కూడా యుద్ధ విన్యాసాలు చేపట్టింది. భారత వాయుసేన చరిత్రలో ఇది అత్యంత భారీ విన్యాసమని చాలా మంది అభివర్ణిస్తున్నారు. దీనికి ‘గగన్‌శక్తి 2018’ అని పేరు పెట్టారు.

Image copyright Indian Air Force

‘‘రేపటికి రేపు యుద్ధం జరిగినా.. అత్యంత వేగంగా ఆపరేషన్లను కొనసాగించగల పరిస్థితి ఉండాలని మేం భావిస్తున్నాం. గగన్‌శక్తి 2018 ద్వారా మా శక్తిసామర్థ్యాలను విస్తృతంగా పరీక్షించాం. దీని ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి’’ అని ఈ విన్యాసాల గురించి క్షుణ్నంగా తెలిసన ఒక అధికారి చెప్పారు.

భారత పశ్చిమ సరిహద్దుల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్రారంభించిన ఈ విన్యాసాల మధ్యలో.. వాయుసేన తన బలగాలను తూర్పు సరిహద్దులకు కూడా మళ్లించింది.

దీని ఆంతర్యం సుస్పష్టమే.

భారత వాయుసేన ద్విముఖ యుద్ధానికి బాహాటంగానే తయారవుతోంది.

Image copyright Indian Air Force

కానీ.. ఇందులో ఇంకా లోతైన విషయాలున్నాయి.

ప్రపంచంలో నాలుగో అది పెద్ద వైమానిక దళమైన భారత వాయుసేన.. ప్రస్తుతం 31 స్క్వాడ్రన్ల (యుద్ధ విమాన దళాల)తో నడుస్తోంది. నిజానికి ఇప్పుడు వాయుసేనకి 45 స్క్వాడ్రన్లు అవసరం.

అలాగే.. భారత వాయుసేన తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కొత్త పరికరాల కొనుగోలు మొదలుకుని పాత వాటి నిర్వహణ వరకూ ఈ ప్రభావం విస్తృతంగా ఉంది.

సీనియర్ బీజేపీ నాయకుడు మేజర్ జనరల్ బి.సి.ఖండూరి (రిటైర్డ్) సారథ్యంలోని రక్షణ రంగం మీద పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 41వ నివేదికను 2018 మార్చి 13న లోక్‌సభకు సమర్పించింది.

Image copyright Indian Air Force
  • (2018-19 ఆర్థిక సంవత్సరానికి) రెవెన్యూ బడ్జెట్‌లో రూ. 6,440 కోట్లు తగ్గటం.. ఆపరేషనల్ సంసిద్ధత; విడిభాగాలు, ఇంధనాల కొనుగోలు మీద ప్రభావం చూపే అవకాశముంది. శిక్షణ కార్యక్రమాలు, పాత వ్యవస్థల నిర్వహణ, వాయుసేన సిబ్బందికి కనీస సదుపాయాల కల్పన కూడా కుంటుపడే అవకాశముంది.
  • వాయుసేన బడ్జెట్ వాటా శాతం గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది.
  • వాయుసేనకు పెట్టుబడి కింద చేసే కేటాయింపులే ఆ సేన ఆధునికీకరణకు ప్రధానం. ఈ కేటాయింపులు నిలకడగా తగ్గిపోయాయి. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రక్షణ బడ్జెట్‌లో ఇది 17.51 శాతంగా ఉంటే.. 2016-17 నాటికి అది 11.96 శాతానికి పడిపోయింది.
  • ...వాయసేన సామర్థ్యం పెంపు, ఆధునికీకరణల విషయంలో తగినంత నిజాయితీ లోపించినట్లు కనిపిస్తోంది.

వాయుసేన 2016 నుంచి కస్టమ్స్ సుంకం కింద రూ. 2,500 కోట్లు చెల్లించేలా చేయటం గురించి, తిరిగి చెల్లించాల్సిన ఆ నిధులను రీయింబర్స్ చేయకపోవటం గురించి కూడా ఈ నివేదిక వెల్లడిస్తోంది. నిజానికి, వాయుసేన తనకున్న స్వల్ప వనరుల నుంచి.. 2018-19లో కూడా రూ. 1,726.98 కోట్లు కస్టమ్స్ సుంకం కింద చెల్లించాల్సి వచ్చింది!

Image copyright Indian Air Force

ఇక ఫ్రెంచ్ యుద్ధ విమానం రఫేల్ కోసం, అమెరికన్ హెలికాప్టర్ చినూక్ కోసం గతంలో చేసుకున్న ఒప్పందాల్లో కొన్ని రాబోయే సంవత్సరాల్లో ఫలిస్తాయని భావిస్తుండటం వాస్తవమే.

అయినా.. వచ్చే దశాబ్దం చివరికల్లా భారత వాయుసేన వద్ద 19 స్క్వాడ్రన్లే మిగిలి ఉంటాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం చెప్తోంది.

భారత వాయుసేనను ఈ దశాబ్ద కాలం వేరు చేస్తుంది.

హిమాలయాల ఆవల కూడా ప్రస్తుతం పై చేయిలో ఉన్న భారత వాయుసేన పరిస్థితి ఈ దశాబ్ద కాలంలో.. వేగంగా ఆధునీకరణ అవుతున్న చైనా వైమానిక దళంతో పోలిస్తే మారిపోతుందని సీనియర్ హెలికాప్టర్ పైలట్ ఎయిర్ మార్షల్ మన్మోహన్ బహదూర్ (రిటైర్డ్) అభిప్రాయపడ్డారు.

‘‘ఈ రోజు మన దగ్గర మెరుగైన పరికరాలున్నాయి. మెరుగైన యుద్ధ విమానాల శ్రేణి ఉంది. ఇంకా మెరుగైన వాయుసేన సిబ్బంది శిక్షణ ఉంది. అయితే రాబోయే దశాబ్దంలో ఒక ఉన్నత శ్రేణికి చెందిన తర్వాతి తరం యుద్ధ విమానాన్ని తయారు చేయలేకపోతే.. భారత వాయుసేన బలం ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright Indian Air Force

గగన్‌శక్తి 2018 ప్రణాళికను రూపొందించి అమలు చేయటానికి భారత వాయుసేనకు దాదాపు తొమ్మిది నెలల సమయం పట్టింది. ఒకవేళ యుద్ధం వస్తే.. అది ఎంత పరిమితమైన యుద్ధమైనా.. ఇంత వెసులుబాటు ఉండకపోవచ్చు.

ఏ రోజైనా చైనాతో తలపడినప్పుడు పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగుతుందన్న ఆలోచనతో భారత వాయుసేన ఈ విన్యాసాలను రూపొందించింది.

‘‘మనం చేయాల్సిన పని ఉంది. కానీ దానికి అవసరమైన ఉత్తమ పనిముట్లే లేవు. అవి ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు’’ అని ఒక అధికారి వివరించారు.

‘‘గగన్‌శక్తి 2018 ద్వారా.. మేం ‘ప్లాన్ బి’ మీద కసరత్తు చేశాం’’ అని ఆయన చెప్పారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionమొదటి ప్రపంచయుద్ధం: భారతీయుల త్యాగాల ఫలితమే బ్రిటన్ విజయం

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)