కర్ణాటక: ‘కింగ్‌మేకర్’ జేడీఎస్ మద్దతు ఎవరికి? బీజేపీకా, కాంగ్రెస్‌కా?

  • 15 మే 2018
కర్నాటక, మోదీ, సిద్ధరామయ్య, దేవెగౌడ, కుమారస్వామి Image copyright Getty Images

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఎంత సంక్లిష్టంగా ఉండబోతున్నాయో, ఎగ్జిట్ పోల్ ఫలితాలతో కొంత అంచనా వచ్చింది. కొన్ని 'ఎగ్జిట్' ఫలితాలు విజయం బీజేపీదే అంటే, మరికొన్ని కాంగ్రెస్‌ది అని తేల్చేశాయి.

శనివారం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడగానే, రెండు పార్టీలు కూడా విజయం తమదంటే తమదేనని పేర్కొన్నాయి.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విజయంపై ధీమా వ్యక్తం చేసి, తనను తాను ప్రస్తుత, భవిష్యత్ సీఎంగా చెప్పుకున్న కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. అవసరమైతే సీఎం పదవిని దళితులకు వదులుకుంటానని అన్నారు.

మరోవైపు, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప విజయం తమదే అని రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

రెండు పార్టీల నేతలు ఏం చెబుతున్నా, ఫలితాలు చేరువైన వేళ రెండు పార్టీల నేతల గుండె వేగం పెరిగేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Image copyright AFP

కింగ్‌మేకర్ ఎవరు?

కర్నాటకలో జనతాదళ్ సెక్యులర్‌(జేడీఎస్)ను ఇప్పుడు 'కింగ్‌మేకర్' అని పిలుస్తున్నారు.

ఎగ్జిట్ పోల్ ఫలితాలను విశ్వసించినట్లయితే, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామిలకు ప్రాధాన్యం హఠాత్తుగా పెరిగిపోయింది.

అదే సమయంలో ఈ 'కింగ్‌మేకర్లు' ఎవరిని కింగ్ చేస్తారు అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.

బీజేపీ ఎన్నికల ప్రచారానికి సారథ్యం వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రచారంలో దేవెగౌడకు దగ్గరయ్యే ప్రకటనలు చేశారు. దీనితో జేడీఎస్ అవసరమైతే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇంతకూ దేవెగౌడ ఎటు వెళతారు?

అటు కాంగ్రెస్ కూడా తమకు మెజారిటీ రాకుంటే ఇతర పార్టీల మద్దతు తీసుకునేందుకు సిద్ధమేనని ప్రకటించింది.

అయితే, జేడీఎస్ ఎవరి వైపు మొగ్గుతుంది అనేది పార్టీలో దేవెగౌడ, కుమారస్వామిలలో ఎవరి మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుంది అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.

ఒక ఇంటర్వ్యూలో దేవెగౌడ, ''మాకు 30-40 సీట్లు వస్తాయని భావిస్తున్న వాళ్లకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమీ తెలియవు. మోదీ సాబ్ మొదట నా గురించి తియ్యగా మాట్లాడారు. తర్వాత మాకు చెరుపు చేసే పనులు చేయడం ప్రారంభించారు. మేం వేగంగా దూసుకువెళుతున్నామని తెలుసుకుని యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ కూడా మేమంటే భయపడుతోంది. అందుకే మమ్మల్ని బీజేపీ బీ-టీమ్ అంటోంది'' అన్నారు.

ఈ మాటలను బట్టి చూస్తే, జేడీఎస్ ఎవరితోనూ చేతులు కలిపేట్లు కనిపించడం లేదు. కానీ రాజకీయాలు అలా నడవవు కదా?

Image copyright MANJUNATH KIRAN

బేరసారాల్లో ఎవరు ముందు, ఎవరు వెనుక?

హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించడంతో పరిస్థితులు, అవసరాలను బట్టి దేవెగౌడ-కుమారస్వామి ఎటు వైపు వెళతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

సీనియర్ జర్నలిస్ట్ ఊర్మిలేష్ బీబీసీతో మాట్లాడుతూ, ''కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ ఎక్కువ డీల్ ఆఫర్ చేస్తుంది అన్నదానిపైనే అది ఆధారపడి ఉంటుంది'' అన్నారు.

''డీల్‌పై కుమారస్వామి చాలా ఆసక్తితో ఉన్నారు. అందుకే రెండు పార్టీల ఆఫర్లపై ఓ కన్నేసి ఉంచారు. అవసరమైతే ఆయన తననే ముఖ్యమంత్రి చేయాలనే ప్రతిపాదన కూడా చేసే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ చంద్రశేఖర్‌ను ప్రధానిని చేసినట్లు, మీరు కూడా నన్ను సీఎంను చేయండి అని కోరవచ్చు.''

కానీ కుమారస్వామి కోరికను బీజేపీ, కాంగ్రెస్‌లు అంగీకరిస్తాయా?

''దానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు'' అన్నారు ఊర్మిలేష్.

ఇక నరేంద్ర మోదీ, దేవెగౌడల సంబంధాలపై, ''మొదట ఇద్దరి మధ్యా సంబంధాలు అంత బాగా లేవు. కానీ ఇప్పుడు మెరుగుపడిన సూచనలు కనిపిస్తున్నాయి. మోదీ ఇటీవలే ఆయనను చాలా పొగిడారు'' అన్నారు.

Image copyright Getty Images

తండ్రి కాంగ్రెస్ వైపు, కుమారుడు బీజేపీ వైపు..

బీజేపీ వైపు కాకుండా జేడీఎస్ కాంగ్రెస్ వైపు వెళ్లదా? రాజకీయాలలో ఏ ప్రశ్నకైనా కచ్చితమైన సమాధానం ఇవ్వడం కష్టం.

సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు భాస్కర్ హెగ్డే ఇలా అంటారు - ''ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకుంటే - రెండు, మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. కాంగ్రెస్ కనుక ఎక్కువ సీట్లు సంపాదించుకోగలిగితే, జేడీఎస్ బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో సీఎం చేయాలనే డిమాండ్ ఉండదు.''

''కానీ ప్రభుత్వంలో చేరితే మాత్రం, సీఎం పదవి ఎవరికి చెందాలన్న దాని గురించి చర్చ జరగొచ్చు. నిజానికి జేడీఎస్ ఆ డిమాండ్ చేసే అవకాశం ఉంది'' అన్నారు.

కుమారస్వామి బీజేపీ వైపు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచిస్తున్న దేవెగౌడ, కాంగ్రెస్ వైపే మొగ్గు చూపవచ్చు.

Image copyright Getty Images

తండ్రీకొడుకుల్లో ఎవరి మాట నెగ్గేను?

అసలు జేడీఎస్‌లో ఎవరి మాట ఎక్కువ చెల్లుబాటు అవుతోంది?

''ప్రస్తుతం అయితే కుమారస్వామిదే'' అంటారు హెగ్డే.

2008 నుంచి 2013 మధ్య కాలంలో మూడుసార్లు ముఖ్యమంత్రిని మార్చిన బీజేపీది అస్థిర పాలన అంటూ దేవెగౌడ విమర్శించారు. అదే సమయంలో అవినీతిని అరికట్టడంలో కాంగ్రెస్ కూడా విఫలమైందని ఆరోపించారు.

బీజేపీ, జేడీఎస్‌ల మధ్య అనేక విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నట్టుగానే, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య స్నేహంలో కూడా పొరపొచ్ఛాలున్నాయి.

2005లో సిద్ధరామయ్య జేడీఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. ఆ సమయంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి సీఎంగా ఉన్నారు. సిద్ధరామయ్య పార్టీని వీడడంపై నాడు కుమారస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇలా రెండు పార్టీల మధ్య స్నేహానికి అడ్డుగా నిలిచే అనేక సంఘటనలు గతంలో జరిగాయి. కానీ రాజకీయాల్లో నిన్నటికన్నా రేపటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సాంప్రదాయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)