కర్ణాటక ఫలితాలపై మోదీ, రాహుల్ ఇద్దరూ పరేషాన్.. ఎందుకు?

  • 14 మే 2018
మోదీ, రాహుల్ Image copyright Getty Images

'కర్ణాటకం' ఎంత రసవత్తరంగా సాగాలో అంత రసవత్తరంగా సాగింది. రాహుల్ గాంధీ 'టెంపుల్ రన్' పూర్తయింది. మరోవైపు మోదీ ఒక్క కర్ణాటకలోనే కాకుండా, నేపాల్‌లో కూడా గుడిగంటలు మోగించి వచ్చారు.

అయితే సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఫలితాల్లో ఏదో ఓ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చేంత వరకూ అది కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

అందుకే, ఫలితాలపై ఊహాగానాలు చెయ్యడం కన్నా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? భవిష్యత్ రాజకీయాలను అవి ఎలా ప్రభావితం చేయొచ్చు వంటి విషయాల్ని చర్చించుకోవడం మంచిది.

మొట్టమొదటగా - కర్ణాటక ప్రజలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ ఏ ఒక్క పార్టీనీ వరుసగా రెండుసార్లు గెలిపించలేదు. 1983, 1988 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన వ్యక్తి రామకృష్ణ హెగ్డే ఒక్కరే.

Image copyright Getty Images

కన్నడ ఓటర్ల నిర్దాక్షిణ్యం

కర్ణాటక ఓటర్లు నేతల పట్ల ఏ మాత్రం కనికరం చూపించరు. మరో ముఖ్య విషయం ఏంటంటే, 2014 తర్వాత దేశంలో జరిగిన అన్ని శాసనసభ ఎన్నికలల్లోనూ ప్రజలు మార్పుకే ఓటు వేశారు.

ఈ దృష్టితో చూసినపుడు ఈ ట్రెండ్‌ను ఎలా దెబ్బకొట్టాలన్నది సిద్ధరామయ్య ముందున్న అతి పెద్ద సవాలు. ఒకవేళ ఆయన దీన్ని మార్చగలిగితే జనం ఆయనను ఒక పెద్ద నేతగా గుర్తించడం ఖాయం.

కర్ణాటకను కాంగ్రెస్ పట్టు నుంచి తప్పించడం కోసం అన్ని విధాలా ప్రయత్నించిన మోదీ త్వరలోనే కాంగ్రెస్ 'పీ పీ పీ' కానున్నదని జోస్యం పలికారు. అంటే కాంగ్రెస్ పుదుచ్చేరి, పంజాబ్ పరివారంగా మిగిలిపోతుందని ఆయన ఉద్దేశం. అదే కాంగ్రెస్‌ను ఓడించడంలో మోదీ-షా ద్వయం విఫలమైతే రాహుల్ గాంధీ ప్రభావం పెరిగిపోతుంది.

మరో అంశం ఏంటంటే - వనరుల లోటు సమస్య కాంగ్రెస్‌ను బాగా ఇబ్బంది పెడుతోంది. పార్టీ ఓవర్‌ డ్రాఫ్ట్‌పై నడుస్తోందని పార్టీ కోషాధికారి మోతిలాల్ వోరా అన్నారు. మణిపూర్, గోవాలలో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడానికి డబ్బు లోటు ఒక ప్రధాన కారణం.

ఆదాయం రీత్యా ముందంజలో ఉండే పంజాబ్, కర్ణాటక వంటి రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో ఉంటే 2019 ఎన్నికల్లో అది బీజేపీ ధనబలంతో పోటీ పడగలుగుతుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత ధనిక పార్టీ బీజేపీనే అన్నది నిస్సందేహం.

Image copyright Getty Images

ఈ దక్షిణాది రాష్ట్రంలో వెలువడే ఎన్నికల ఫలితాలు 2019లో జరగపోయే మహాసంగ్రామంపై ప్రభావం చూపుతాయన్న విషయాన్ని అందరూ చెబుతున్నారు. కానీ అంతకన్నా ముందుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏ మేరకు లబ్ధి పొందగలుగుతుందన్న విషయం కూడా కర్ణాటక ఫలితాలతో చాలా వరకు తేలిపోతుంది.

ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనైతే సుదీర్ఘకాలంగా అధికారం బీజేపీ చేతిలోనే ఉంది.

ఒకవేళ ఈ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ విజయవంతమైతే విపక్ష నేతగా ఆయనకు గుర్తింపు పెరుగుతుంది. లేదంటే శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి వారు ఆయన నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అంత సులువుగా సిద్ధపడరు.

Image copyright Getty Images

మోదీ-షాలకూ పరీక్షే

కర్ణాటకలో నరేంద్ర మోదీ ఇరవైకన్నా ఎక్కువ ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అమిత్‌ షా కూడా అక్కడ చాలా సమయమే గడిపారు. దీనికి కారణం కర్ణాటక ఎన్నికలు బీజేపీకి కీలకం కావడం వల్లనే కాదు, మోదీ-షాల ఎన్నికల వ్యూహమే అలాంటిది.

కర్ణాటకలో త్రిముఖ పోటీ ఉంది. ఇలాంటి పోటీ ఉన్నప్పుడు ఎక్కువగా బీజేపీనే లాభపడుతూ వస్తోంది. ఈసారి కూడా అదే జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

కింగ్‌మేకర్‌ అని పిలుస్తున్న హెచ్‌డీ దేవెగౌడ 25 స్థానాలకన్నా ఎక్కువ గెల్చుకోగల్గితే జాతీయ రాజకీయాల్లో ఆయన స్థానం పెరుగుతుంది. అలా కాని పక్షంలో తండ్రీకొడుకులు తమ రాజకీయ భవిష్యత్తు గురించి మళ్లీ ఆలోచించుకోవాల్సిందే.

Image copyright Getty Images

జాతీయవాదం వర్సెస్ ప్రాంతీయవాదం

బీజేపీ హిందూ జాతీయవాదాన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధరామయ్య 'కన్నడ గౌరవం' కార్డును బాగా ఉపయోగించుకున్నారు. అయితే ఈ తరహా వ్యూహం కొత్తదేమీ కాదు.

గుజరాత్ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ గుజరాతీలను అవమానిస్తుందనీ, ద్వేషిస్తుందని నిరూపించడం కోసం బీజేపీ ప్రయత్నించినట్టుగానే, కర్ణాటకలో సిద్ధరామయ్య కూడా 'కన్నడ గౌరవాని'కి తానే సిసలైన ప్రతినిధిననీ, బీజేపీ తన సంస్కృతిని రుద్దాలని చూస్తోందనీ నిరూపించే ప్రయత్నం చేశారు.

జెండా విషయంలో కావొచ్చు లేదా కన్నడ భాషకు ప్రాముఖ్యత విషయంలో కావొచ్చు - సిద్ధరామయ్య దూకుడుగా ప్రచారం చేశారు. అందువల్ల బీజేపీ హిందూ జాతీయవాదాన్ని ప్రాంతీయ ఆత్మగౌరవ రాజకీయాలు ఏ మేరకు ఎదుర్కోగలుగుతాయన్నది కూడా ఈ ఫలితాల ద్వారానే తేలిపోతుంది.

కులాలవారీ సమీకరణాల్లో పొత్తులు, వేర్పాటుల విషయంలో బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటుంది. దళితులలో జాటవ్‌లను మినహాయించి మిగతా వారినీ చీల్చడం, ఓబీసీల్లో యాదవులను విడదీయడం వంటివి దీనికి ఉదాహరణలు.

ఈసారి సిద్ధరామయ్య కూడా లింగాయత్‌లకు హిందూ మతానికి వేరుగా మత గుర్తింపునిచ్చి, మైనారిటీ హోదాను కల్పిస్తానంటూ చేపట్టిన వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందన్నది కూడా ఈ ఫలితాల ద్వారానే తేలిపోతుంది.

మొత్తానికి, కర్ణాటక ఎన్నికల్లో మోదీ-షా ద్వయం ఓడిపోయినా లేదా రాహుల్ గాంధీ ఓడిపోయినా, వారు దీన్ని తమ ఓటమిగా అంగీకరించబోరన్నది మాత్రం స్పష్టం. అయితే గెలిస్తే ఖ్యాతి దక్కేది మాత్రం కేంద్ర నాయకత్వానికే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)