కీలక నియోజకవర్గాలు: సాయికుమార్ ఓటమి

  • 15 మే 2018
నటుడు సాయకుమార్ Image copyright facebook/saikumar
చిత్రం శీర్షిక నటుడు సాయికుమార్ కర్ణాటకలోని బాగేపల్లి నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీపడుతున్నారు

పొరుగు రాష్ట్రం కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తి చూపారు.

బీజేపీ, కాంగ్రెస్‌ల హోరాహోరీ పోరు అందుకు ఒక కారణం కాగా.. తెలుగువారు, ఇక్కడి రాజకీయాలతో అంతోఇంతో సంబంధం ఉన్నవారు పోటీలో ఉండడం మరో కారణం.

మరోవైపు కీలక నేతలు బరిలో దిగిన నియోజకవర్గాల ఫలితాలపైనా అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.

లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడ ఎవరు ఆధిక్యంలో ఉన్నారో, ఎవరు గెలిచారో తెలుసుకుంటూ ఫలితాల సరళిని పరిశీలించారు.

Image copyright Getty Images

ఎవరికి అనుకూలమో!

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లే ప్రధాన పార్టీలు కాగా జేడీ(యూ), బహుజన సమాజ్ పార్టీ, పలు ఇతర పార్టీలూ వివిధ స్థానాల్లో బరిలో నిలిచాయి.

ప్రధాన సామాజిక వర్గాలైన లింగాయత్, వక్కలిగలు చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు. 17 శాతం ఓట్లు లింగాయత్‌లకు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ వారి ఓట్లను కొల్లగొట్టింది.

ఈసారి కూడా సిద్ధరామయ్య వారిని ఆకర్షించేందుకు గాను లింగాయత్‌లకు రెలిజియస్ మైనార్టి హోదా కల్పించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు. అయితే, ఫలితాల సరళి చూస్తే కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి.

Image copyright Getty Images

కీలక నియోజకవర్గాలు

బాదామి: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడ నుంచి పోటీ చేయగా..బీజేపీ తరఫున మాజీ మంత్రి బి.శ్రీరాములు ఆయనతో తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో సిద్ధరామయ్య విజయం సాధించారు. 2013 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిమ్మనకల్తి భీమప్ప గెలిచారు.

షికారిపుర: బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ఇక్కడి నుంచి బరిలో దిగి విజయం అందుకున్నారు. 1983 నుంచి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తుండగా ఏడుసార్లు విజయం సాధించారు. ఒకసారి మాత్రం ఓటమి పాలయ్యారు. తాజా విజయం ఎనిమిదవది. జేడీఎస్ ఇక్కడ హొలెబసప్ప బాలెగర్‌ను, కాంగ్రెస్ పార్టీ జీబీ మాలతేశను బరిలో దించాయి.

రామనగర: మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఇక్కడి నుంచి బరిలో దిగి గెలుపు సాధించారు. ఆయన్ను ఇంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి పంపించిన నియోజకవర్గమిది. సహజంగానే జేడీఎస్‌కు మద్దతుగా ఉండే వక్కలిగ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఇక్కడ ముస్లిం ఓట్లూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి ఇక్బాల్ హుస్సేన్, బీజేపీ నుంచి లీలా పోటీపడ్డారు.

హుబ్బళ్లి ధార్వాడ సెంట్రల్: మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ ఇక్కడి నుంచి ఆరోసారి పోటీ చేసి విజయం అందుకున్నారు. లింగాయత్‌ల ప్రాబల్యమున్న ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట.

Image copyright facebook/GaliJanardhanareddy
చిత్రం శీర్షిక గాలి జనార్దనరెడ్డి

బళ్లారి సిటీ: గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి సోదరుడు సోమశేఖరరెడ్డి ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు.. కాంగ్రెస్ కూడా ఇక్కడ గనుల వ్యాపారి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన అనిల్ హెచ్ లాడ్‌ను బరిలో దించింది. ఇద్దరు అభ్యర్థులపై గనుల అక్రమాల కేసులున్నాయి. గాలి జనార్దనరెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు ఒక న్యాయమూర్తికి లంచం ఇచ్చారన్న ఆరోపణలు సోమశేఖరరెడ్డిపై ఉండగా ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో అనిల్ లాడ్‌ను 2015లో సీబీఐ అరెస్టు చేసింది. ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు ఖర్చయిన నియోజకవర్గాల్లో ఇదొకటి.

బాగేపల్లి: తెలుగు, కన్నడ భాషల్లో సుపరిచితుడైన నటుడు, డబ్బింగ్ కళాకారుడు సాయికుమార్ బీజేపీ టిక్కెట్‌పై ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఈయన విజయంపై తెలుగువారు ఆసక్తి చూపారు. కాంగ్రెస్ నుంచి ఎస్‌ఎన్ సుబ్బారెడ్డి, జేడీఎస్ నుంచి సీఆర్ మనోహర్ ఇక్కడ బరిలో దిగగా సుబ్బారెడ్డికి విజయం దక్కింది.

బీదర్: కాంగ్రెస్ నుంచి రహీం ఖాన్, బీజేపీ నుంచి సూర్యాకాంత్ నాగ్మరపల్లి తలపడ్డారు. 2013 ఎన్నికల్లో నాగ్మరపల్లి గురుపాదప్ప కర్ణాటక జనతా పార్టీ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గంలో తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. రహీంఖాన్‌ను విజయం వరించింది.

భత్కల్: ఉత్తర కన్నడ జిల్లాలోని ఈ నియోజకవర్గం ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన రియాజ్, యాసిన్ భత్కల్‌ల అరెస్టుతో అందరి దృష్టిలో పడింది. కాంగ్రెస్ నుంచి ఇక్కడ మంకాల్ వైద్య, బీజేపీ నుంచి సునీల్ నాయక్ పోటీపడగా సునీల్ నాయక్ గెలిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)