గోదావరిలో లాంచీ బోల్తా: 16 మంది ఒడ్డుకు.. 30 మంది గల్లంతు

  • 16 మే 2018
కొండ మొదలు Image copyright Sangeetham prabhakar/bbc

గోదావరి నదిలో ప్రయాణిస్తున్న ఒక లాంచీ ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 30 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం.. దేవిపట్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో లక్ష్మీ వెంకటేశ్వర బోట్ సర్వీస్‌కు చెందిన లాంచీ 25 మంది ప్రయాణికులతో కొండమొదలు ప్రాంతానికి బయలుదేరింది.

దారిలో మంటూరు, వాడపల్లి మీదుగా ప్రయాణించింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో వాడపల్లిలో ఇద్దరు ప్రయాణికుల్ని దింపడం కోసం వెళుతుండగా.. వాడపల్లి రేవుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గాలి, వర్షం వల్ల లాంచీ తిరగబడింది.

లాంచీ డ్రైవర్‌తో పాటు మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Image copyright Sangeetham prabhakar/bbc
చిత్రం శీర్షిక బాధితులను తీసుకెళ్లేందుకు వస్తున్న అంబులెన్స్‌లు

ఒడ్డుకు చేరిన వారిలో ఆరుగురిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. మరో పది మందిని పోలవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ప్రమాదానికి గురైన బోటు డ్రైవరు కాజాను పోలీసులకు అప్పగించారు.

సహాయక సిబ్బంది ఏడు బోట్లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

‘ప్రయాణీకుల్ని కాపాడిన గిరిజనులు!’

Image copyright Sangeetham prabhakar/bbc
చిత్రం శీర్షిక ప్రాథమిక చికిత్స కోసం ఏర్పాట్లు

లాంచీ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులతో మాట్లాడారు. సహాయ బృందాలను పంపించి, బాధితులను కాపాడాలని ఆదేశించారు.

విజయవాడ, విశాఖపట్నం నగరాల నుంచి రెండు జాతీయ విపత్తు స్పందన (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు సంఘటనా స్థలానికి బయలుదేరాయి. ఒక్కో బృందంలో 35 మంది సభ్యులు ఉన్నారు.

సంఘటన జరిగింది ఏజెన్సీ ప్రాంతంలో కావటంతో స్పష్టమైన వివరాలు లభించటం లేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ లాంచీ ప్రమాదం జరగ్గానే తొలుత స్థానిక గిరిజనులు స్పందించారు. నాటు పడవల సహాయంతో కొందరిని ఒడ్డుకు చేర్చారు. తదనంతరం పోలీసులు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు.

గోదావరి నదిలో లాంచీ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందటే ఒక లాంచీ నదిలో ప్రయాణిస్తూ మంటల్లో చిక్కుకుంది. ఆ సంఘటనలో దాదాపు 80 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

Image copyright Sangeetham prabhakar/bbc

రోడ్డు లేదు.. 50 ఏళ్ల నుంచీ లాంచీ ప్రయాణమే!!

దేవీపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొండమొదలు అనే ప్రాంతం ఉంది. వారికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో దాదాపు 50 ఏళ్ల నుంచి వారికి రవాణా సదుపాయం బోటేనని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవి ప్రకాశ్ చెప్పారు. మంగళవారం కూడా రోజువారీ కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు, బ్యాంకు పనుల నిమిత్తం ప్రయాణికులంతా దేవీపట్నం వచ్చి సాయంత్రం 4.30 గంటల సమయంలో వెనుదిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. అతివేగంగా పెనుగాలులు రావటం వల్లనే బోటు తిరగబడిందని, ఇది ప్రకృతి వైపరీత్యమే అనుకుంటున్నామని ఆయన తెలిపారు.

Image copyright UGC
చిత్రం శీర్షిక మే 11వ తేదీన గోదావరి నదిలో ప్రయాణిస్తూ మంటల్లో చిక్కుకున్న లాంచీ

'30 మంది ఆచూకీ గల్లంతు..

ఈ దుర్ఘటనపై పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవి ప్రకాశ్ ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘వాడపల్లి ఒడ్డుకు చేరుకున్న పుల్లయ్య అనే ప్రయాణికుడు అందించిన వివరాల ప్రకారం.. బోటులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది ఒడ్డుకు వచ్చారు. గల్లంతైన వారిని వెదికేందుకు రెండు పడవలను పంపించాం. నదిలో లంగరు వేసి వెతగ్గా వాడపల్లి నుంచి దాదాపు 150 మీటర్ల దూరంలో బోటు ఆచూకీ దొరికింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 మంది మునిగిపోయి ఉంటారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దురదృష్టవశాత్తూ ఆచూకీ గల్లంతైనవారిలో ఎవరూ బతికే అవకాశాల్లేవు. ప్రమాదం జరిగిన చోట గోదావరి నది వెడల్పు 400 మీటర్లు. ఒడ్డున వీఆర్ఓలను పెట్టి ఎవరైనా ఈదుకుంటూ వచ్చారా? అన్నది పరిశీలిస్తున్నాం. ఒకరిద్దరు వచ్చి ఉండొచ్చేమో. మిగతా వారు మాత్రం వచ్చే అవకాశం లేదు’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)