గోదావరిలో లాంచీ బోల్తా: బోటులో ఉన్న లైఫ్ జాకెట్లు వేసుకుని ఉంటే..!

  • 16 మే 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గోదావరి పడవ ప్రమాదం: సహాయక చర్యలు

గోదావరి నదిలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 30 మందికిపైగా ఆచూకీ ఇంకా లభించలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరారు. అయితే.. అసలు బోటులో ఎంత మంది ఉన్నారు? ఎంత మంది చనిపోయారు? అన్న వాటిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలో బీబీసీ ప్రతినిధులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి.. అక్కడి అధికారులు, పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన 5 కీలక అంశాలు.

Image copyright Enc
చిత్రం శీర్షిక సహాయక చర్యలు

1. బోటులో 60 మంది ఉంటారు

  • ‘‘నేను రాత్రి తొమ్మది గంటల నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ బోటు మునిగి పోతుండగా చూసిన వారు.. స్థానికులు ఇందులో 60 మంది దాకా ఉంటారని చెప్పారు. ఈ బోటులో 80 మంది వెళ్ల వచ్చు. 10 సిమెంటు బస్తాలు కూడా ఎక్కించారు.’’ అని స్థానిక విలేకరి శాంతిబాబు వెల్లడించారు.
  • ఇప్పటి వరకూ 16 మందిని బయటకు తీశారు. శాంతి బాబు చెబుతున్న వివరాల ప్రకారం మరో 40 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.
Image copyright Enc
చిత్రం శీర్షిక సహాయక చర్యల కోసం వచ్చిన హెలికాప్టర్

2. గాలికొడుతోందని తలుపులు మూశారు

  • గాలి తీవ్రత ఎక్కువైనపుడు దాని నుంచి ప్రయాణికులను.. బోటును రక్షించేందుకు తలుపులు వేశారని.. అందువల్ల ప్రయాణికులు బోటు మునిగిపోయినపుడు వెంటనే బయటకు రాలేకపోయారన్న వాదనను కూడా స్థానికులు వినిపించారు.
  • ఈ అంశంపై పోలీసులతో మాట్లాడగా వారు కూడా దీన్ని ధృవీకరించారు.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionగోదావరిలో పడవ ప్రమాదం: బీబీసీతో మాట్లాడిన తూ.గో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా

3. లైఫ్ జాకెట్లున్నా వేసుకోలేదు

  • ‘ఈ బోటు లైసెన్స్డ్ బోటు. అందువల్ల ఇందులో లైఫ్ జాకెట్లు ఉన్నాయి. కానీ వాటిని ప్రయాణికులు ధరించలేదు. అని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న పోలీసులు, స్థానికులు చెప్పారు.
  • ‘ విజయవాడలో ఇటీవల బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రతి లైసెన్స్డ్ బోటులోనూ తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు పెడుతున్నారు. గత రెండు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడి బోటులో కూడా లైఫ్ జాకెట్లను ఉంచారు.’ అని ఆ పోలీసు వివరించారు.

4. వారానికి రెండు సార్లు

  • ఈ బోటులో చుట్టు పక్కన ఉన్న గ్రామాల ప్రజలు వెళ్తారని.. ఈ బోటు వారానికి రెండు సార్లు మాత్రమే నడుస్తుందని స్థానిక మహిళ తెలిపారు.
  • ఎక్కువ మంది సరకులు తెచ్చుకునేందుకు సమీపంలోని సంతకు వెళ్లేందుకు ఈ బోటును వినియోగిస్తారని వివరించారు.
Image copyright Sangeetham prabhakar/Bbc
చిత్రం శీర్షిక హెలికాప్టర్లో సహాయక చర్యలు

5. హెలికాప్టర్లో సహాయక చర్యలు

  • రాత్రి నుంచి ప్రయత్నిస్తున్నా బోటును ఇప్పటి వరకూ బయటకు తీయలేకపోయారు. ప్రమాదానికి గురైన బోటు ఇంకా నీటిలోనే మునిగి ఉంది.
  • దీంతో వైజాగ్ నుంచి హెలికాప్టర్‌ను తీసుకొచ్చి దాని సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
Image copyright Sangeetham prabhakar/bbc

అసలేం జరిగింది?

తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం.. దేవిపట్నం నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో లక్ష్మీ వెంకటేశ్వర బోట్ సర్వీస్‌కు చెందిన లాంచీ 25 మంది ప్రయాణికులతో కొండమొదలు ప్రాంతానికి బయలుదేరింది.

దారిలో మంటూరు, వాడపల్లి మీదుగా ప్రయాణించింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో వాడపల్లిలో ఇద్దరు ప్రయాణికుల్ని దింపడం కోసం వెళుతుండగా.. వాడపల్లి రేవుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో గాలి, వర్షం వల్ల లాంచీ తిరగబడింది.

లాంచీ డ్రైవర్‌తో పాటు మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. మరో 15 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Image copyright Sangeetham prabhakar/bbc
చిత్రం శీర్షిక బాధితులను తీసుకెళ్లేందుకు వస్తున్న అంబులెన్స్‌లు

ఒడ్డుకు చేరిన వారిలో ఆరుగురిని రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. మరో పది మందిని పోలవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ప్రమాదానికి గురైన బోటు డ్రైవరు కాజాను పోలీసులకు అప్పగించారు.

సహాయక సిబ్బంది ఏడు బోట్లలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

‘ప్రయాణీకుల్ని కాపాడిన గిరిజనులు!’

Image copyright Sangeetham prabhakar/bbc
చిత్రం శీర్షిక ప్రాథమిక చికిత్స కోసం ఏర్పాట్లు

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ లాంచీ ప్రమాదం జరగ్గానే తొలుత స్థానిక గిరిజనులు స్పందించారు. నాటు పడవల సహాయంతో కొందరిని ఒడ్డుకు చేర్చారు. తదనంతరం పోలీసులు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించారు.

గోదావరి నదిలో లాంచీ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందటే ఒక లాంచీ నదిలో ప్రయాణిస్తూ మంటల్లో చిక్కుకుంది. ఆ సంఘటనలో దాదాపు 80 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.

Image copyright Sangeetham prabhakar/bbc

రోడ్డు లేదు.. 50 ఏళ్ల నుంచీ లాంచీ ప్రయాణమే!!

దేవీపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొండమొదలు అనే ప్రాంతం ఉంది. వారికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో దాదాపు 50 ఏళ్ల నుంచి వారికి రవాణా సదుపాయం బోటేనని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవి ప్రకాశ్ చెప్పారు. మంగళవారం కూడా రోజువారీ కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు, బ్యాంకు పనుల నిమిత్తం ప్రయాణికులంతా దేవీపట్నం వచ్చి సాయంత్రం 4.30 గంటల సమయంలో వెనుదిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. అతివేగంగా పెనుగాలులు రావటం వల్లనే బోటు తిరగబడిందని, ఇది ప్రకృతి వైపరీత్యమే అనుకుంటున్నామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)