గవర్నర్‌ గిరీ: ఆంధ్రా నుంచి కర్ణాటక వరకు

  • 16 మే 2018
గవర్నర్లు

కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్-జేడీఎస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరుతున్నాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం ఇస్తారు అన్న విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.

భారతదేశ చరిత్రను పరిశీలిస్తే, రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు నిర్వహించిన పాత్రతో చాలా పేజీలు నిండిపోయాయి. చాలా కాలంగా ప్రభుత్వాల ఏర్పాటులో రాజ్‌భవన్ కీలకపాత్ర పోషిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో రామ్‌లాల్, ఉత్తరప్రదేశ్‌లో రొమేష్ భండారీ, జార్ఖండ్‌లో సిబ్తే రజీ, బీహార్‌లో బూటాసింగ్, కర్ణాటకలో హంసరాజ్ భరద్వాజ్.. ఇంకా అనేక మంది గవర్నర్‌ల నిర్ణయాలు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి.

గవర్నర్ల ఎంపిక విషయంలో మూడు విషయాలు పని చేస్తున్నాయి.

మొదటిది అది కేవలం అలంకారప్రాయమైన పదవి. రెండోది ఈ పదవికి అభ్యర్థిని రాజకీయాల ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు. మూడోది సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాళ్లను తప్పించగలదు, కొత్తవారిని నియమించగలదు. అయితే గవర్నర్ కేవలం అలంకారప్రాయమైన పదవి మాత్రమే కాదు. అలాగైతే గవర్నర్ల నియామకానికి, వాళ్లను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేయడానికి అంత ప్రాధాన్యం ఉండకపోయేది.

గత కొన్ని దశాబ్దాలుగా, గవర్నర్ పదవిని రాష్ట్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి, పడగొట్టడానికి ఉపయోగించుకోవడం జరుగుతోంది.

గవర్నర్‌లు ఎప్పుడెప్పుడు ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు?

Image copyright Govt of TSAP
చిత్రం శీర్షిక రామ్‌లాల్

ఠాకూర్ రామ్‌లాల్

రామ్‌లాల్ 1983-84 మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరించారు. మెజారిటీ ఉన్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.

ఎన్టీ రామారావు గుండె సర్జరీ కోసం అమెరికాకు వెళ్లినపుడు రామ్‌లాల్ ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును సీఎంగా నియమించారు.

దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం రామ్‌లాల్‌ను తొలగించి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించింది. దీంతో ఎన్టీ రామారావు తన బలాన్ని నిరూపించుకుని, మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

పి. వెంకటసుబ్బయ్య

1983లో కర్ణాటకలో మొదటిసారి జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఐదేళ్ల తర్వాత మళ్లీ జనతా పార్టీనే అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈసారి ఎస్ ఆర్ బొమ్మయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

అయితే ఆ సమయంలో గవర్నర్‌గా ఉన్న పి.వెంకటసుబ్బయ్య ప్రభుత్వానికి మెజారిటీ లేదంటూ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుని బొమ్మయ్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

ఈ నిర్ణయాన్ని బొమ్మయ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి బొమ్మయ్ ప్రభుత్వం ఏర్పాటైంది.

Image copyright upgovernor.gov.in
చిత్రం శీర్షిక జీడీ తాప్సే

గణపత్‌రావ్ దేవ్‌జీ తాప్సే

80వ దశకంలో జీడీ తాప్సే హర్యానా గవర్నర్‌గా ఉండేవారు. ఆ సమయంలో రాష్ట్రంలో దేవీలాల్ ప్రభుత్వం ఉంది. 1982లో భజన్ లాల్ పలువురు ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు.

తాప్సే ప్రభుత్వ ఏర్పాటుకు భజన్ లాల్‌ను ఆహ్వానించగా, దీనిపై దేవీలాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేవీలాల్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి దిల్లీలోని ఒక హోటల్‌లో బస చేశారు. కానీ ఎమ్మెల్యేలు అక్కడి నుంచి బయటపడగలిగారు. ఎట్టకేలకు భజన్ లాల్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకొని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Image copyright upgovernor.gov.in
చిత్రం శీర్షిక రొమేష్ భండారీ

రొమేష్ భండారీ

1998లో యూపీలో కల్యాణ్ సింగ్ ప్రభుత్వం ఉండేది. ఆ ఏడాది ఫిబ్రవరి 21న గవర్నర్ రొమేష్ భండారీ తన వివాదాస్పద నిర్ణయంతో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు.

ఈ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య జగదాంబికా పాల్ సీఎంగా ప్రమమాణస్వీకారం చేశారు. కల్యాణ్ సింగ్ దీనిని అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు.

కోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. దీంతో రెండు రోజులు ముఖ్యమంత్రిగా ఉన్న అనంతరం జగదాంబికా పాల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో మళ్లీ కల్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు.

Image copyright STR
చిత్రం శీర్షిక అర్జున్ ముండా, సిబ్తె రజీ

సయ్యద్ సిబ్తే రజీ

2005లో జార్ఖండ్ గవర్నర్ సిబ్తే రజీ, అసెంబ్లీలో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ లేనపుడు శిబు సోరెన్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

కానీ శిబు సోరెన్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో తొమ్మిది రోజుల అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 2005, మార్చి 13న అర్జున్ ముండా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై, ముండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక బూటా సింగ్

బూటాసింగ్

2005లో బూటాసింగ్ బిహార్ గవర్నర్‌గా ఉండేవారు.

2005, మే 22న ఆయన బీహార్ అసెంబ్లీని రద్దుచేశారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.

ఆ సమయంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఎమ్మెల్యేల బేరసారాలను అడ్డుకునేందుకు అంటూ బూటా సింగ్ అసెంబ్లీని రద్దుచేశారు.

గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయగా, గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అంటూ కోర్టు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టింది.

హన్స్‌రాజ్ భరద్వాజ్

2009లో యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ భరద్వాజ్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించింది.

గవర్నర్‌గా ఉన్నపుడు ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ సమయంలో బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ప్రభుత్వం తప్పుడు విధానాల ద్వారా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుందంటూ ఆయన మరోసారి బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)