అభిప్రాయం: నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?

  • 16 మే 2018
నరేంద్ర మోదీ, కర్ణాటక, రాహుల్ గాంధీ Image copyright Getty Images

కర్ణాటకలో ‘హిందుత్వ’ పురోగమించింది. ఎన్నికలలో విజయం సాధించడానికి నరేంద్ర మోడీ 'మేజిక్' ఒక్కటే చాలని రుజువైంది. తమ సొంత పార్టీ నేతలు కూడా అవినీతిలో కూరుకుపోయి, చెప్పుకోదగిన ప్రభుత్వ వ్యతిరేకత కూడా లేని సందర్భంలో.. క్రమంగా ‘కాంగ్రెస్-ముక్త భారత్’ జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

చెవులు చిల్లులు పడే ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను తాను 7వ శతాబ్దంలో ఉత్తర భారతదేశపు చక్రవర్తి హర్షవర్ధనుణ్ని ఓడించిన చాళుక్య పాలకుడు రెండో పులకేశిగా అభివర్ణించుకున్నారు.

దురదృశ్టవశాత్తూ 21వ శతాబ్దపు హర్షవర్ధనుడు పులకేశిని ఓడించారు. దిల్లీ అధికార పార్టీ కర్ణాటకలో సిద్ధరామయ్య కోటను కూల్చేసింది.

Image copyright MANJUNATH KIRAN

కాంగ్రెస్ కష్టపడింది.. బీజేపీ ఇంకా ఎక్కువ కష్టపడింది

మోదీ సారథ్యంలోని బీజేపీ కర్ణాటకలో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయినా ముఖ్యమైన 100 మార్కును దాటింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్ల శాతం (బీజేపీ 37 శాతం, కాంగ్రెస్ 38 శాతం) చాలా తక్కువగా ఉండడం చూస్తే, బీజేపీ తన ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్‌ కన్నా సమర్థంగా పని చేసిందని తెలుస్తోంది.

మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) వొక్కలిగ కులం ఓటు బ్యాంకు భద్రంగా ఉందని, కాంగ్రెస్ సవాలును సమర్థంగా ఎదుర్కొనడమే కాకుండా, కర్ణాటక ప్రాంతీయ గుర్తింపుకు తామే అసలైన వారసులమని నిరూపించుకుంది.

ఈ ఎన్నికలతో కాంగ్రెస్ - ముఖాముఖి పోరులో తాము బీజేపీని ఓడించలేమని, ఇతర ప్రాంతీయ పార్టీలతో జత కట్టాల్సిందే అన్న పాఠం నేర్చుకోవాలి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కష్టపడింది. అయితే బీజేపీ అంతకన్నా ఎక్కువ కష్టపడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బీసీ కులాల కూటమిని నిర్మించారు. కర్ణాటక రాష్ట్ర జెండాను ఆవిష్కరించారు, మెట్రో సంకేతాలను హిందీ నుంచి కన్నడకు మార్చారు. భాగ్య పథకాల పేరుతో ఉచిత బియ్యం పంపిణీ నుంచి ఉచిత పాల పంపిణీ పథకం వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారు.

దీనికి భిన్నంగా బీజేపీ హిందుత్వ కార్డును ఉపయోగించుకుంది, మరీ ప్రత్యేకించి కోస్తా కర్ణాటకలో. అలాగే కాంగ్రెస్ తమను నిర్లక్ష్యం చేసిందని భావించే కొన్ని కులాలను చేరదీసింది.

దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ 21 ర్యాలీలతో రాష్ట్రంలో సుడిగాలిలా పర్యటించారు.

Image copyright Getty Images

రియాలిటీ టీవీ రాజకీయాలు

మోదీ ర్యాలీలు రాక్ సంగీత కచేరీలాంటివి. పెద్ద గొంతుకతో జనాలను కూడా తన ప్రసంగంలో భాగంగా చేస్తూ, వారి అరచేతులను పిడికిళ్లుగా మారుస్తూ, వారు జై శ్రీరాం అంటూ ఎలుగెత్తి నినదించేలా చేస్తాయవి. మోదీ వేదికపైకి రాగానే తమకంతా మంచే జరుగుతుందనిపించేలా, ఒక మతగురువును చూసిన భావన కలుగుతుంది ప్రజలకు. జనాలు ఆయనను చూడగానే ఉత్సాహంగా కేరింతలు కొడతారు.

ఇవి రియాలిటీ టీవీలాంటి రాజకీయాలు, ఆరాధనాభావంతో నిండిన రాజకీయాలు. 1970లలో ఇందిరాగాంధీకి ఎలా ఆరాధకులు ఉండేవారో.. ఇప్పుడు మోదీకి అంతకన్నా శక్తివంతమైన, తీవ్రమైన ఆరాధకులున్నారు.

మోదీ 20కి పైగా ర్యాలీలలో పాల్గొనగా, బీజేపీ అధ్యక్షుడు గత 3 నెలల నుంచి వారానికి మూడు రోజుల పాటు మొత్తం 62 ర్యాలీలలో పాల్గొన్నారు.

సంఘ్ పాద బృందం (ఆర్‌ఎస్‌ఎస్ స్వచ్ఛంద దళం) ఉదయం పూట నగరాల్లోని వీధుల్లో, గ్రామాల్లోని సందుగొందుల్లో ఇంటింటికీ ప్రచారం చేయడం నేను చూశాను. ప్రచారం సందర్భంగా వాళ్లు ఒక్కో ఇంటికి నాలుగుసార్లు వెళ్లడం కూడా జరిగింది.

అంత సులువేం కాదు..

కర్ణాటకలో జరిగినవి కేవలం అసెంబ్లీ ఎన్నికలే కానీ 2019లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో చూసినపుడు వాటి ప్రభావం చాలానే ఉంటుంది.

అయితే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సీట్లలో స్వల్పమైన తేడాను గమనించినపుడు, ఉత్తరాదిలో ఆ పార్టీకి జరగబోయే నష్టాలతో పోలిస్తే, దక్షిణాదిని ఊడ్చేసి ఆ నష్టాన్ని పూడ్చుకోవడం బీజేపీకి ఇప్పుడే సాధ్యం కాదని అర్థమవుతోంది. అందువల్ల 2019 సాధారణ ఎన్నికల్లో మోదీకి విజయం నల్లేరు మీద నడకే అని స్పష్టంగా చెప్పలేం.

కేవలం పంజాబ్, మిజోరం రాష్ట్రాలలో, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ఓటమి చాలా పెద్ద ఎదురుదెబ్బ. సాధారణ ఎన్నికల దృష్టి నుంచి మాత్రమే కాదు, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో ఈ శీతాకాలంలో జరగబోయే ఎన్నికల దృష్టి నుంచి చూసినపుడు కూడా.

Image copyright Getty Images

గెలిచిందనుకున్న ఎన్నికల్లో ఓటమి

బీజేపీ అధికార పార్టీగా (గుజరాత్‌లో మాదిరి) కంటే ప్రతిపక్ష పార్టీగానే బాగా పోరాడుతోంది. బలమైన నాయకులు, విశ్వసనీయత కలిగిన ముఖ్యమంత్రి, అనుకూలమైన కుల సమీకరణలతో కాంగ్రెస్ విజయం సాధించి ఉంటే, భవిష్యత్తుపై కాంగ్రెస్‌కు భరోసా పెరిగి ఉండేది.

కానీ దురదృష్టకరం ఏమిటంటే, దాదాపు గెలిచిందనుకున్న ఎన్నికలను కాంగ్రెస్ పోగొట్టుకుంది.

గుజరాత్‌లో నైతిక విజయాన్ని సాధించిన అనంతరం, రాహుల్ గాంధీకి ఒక నిజమైన విజయం అవసరం ఉండింది. కానీ ఆయన ప్రయత్నమంతా నిష్ఫలమైపోయింది. మరిప్పుడు కాంగ్రెస్‌లో ఆయన సామర్థ్యాలను ఎవరైనా ప్రశ్నిస్తారా?

Image copyright Getty Images

మోదీ - ది గ్లాడియేటర్

ప్రస్తుతం మోదీ జగన్నాథ రథచక్రాలకు ఎదురే లేదు. 2019 సాధారణ ఎన్నికల వైపు చూస్తే, మోదీ ఆ ఎన్నికల్లో కేవలం తన సొంత వ్యక్తిత్వం, మాటకారితనంతో 1971లో ఇందిరా గాంధీ ఇచ్చిన 'నేను గరీబీ హఠావో అంటుంటే, వాళ్లు ఇందిరా హఠావో అంటున్నారు' తరహా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉంది.

‘మోదీ వర్సెస్ ఇతరుల’ ఎన్నికల్లో అనేక మంది శత్రువుల మధ్య గ్లాడియేటర్‌లా సహజంగానే మోదీ వ్యక్తిపూజ పెరుగుతుంది.

అయినా కర్ణాటకలో బీజేపీ తన 'మిషన్ 150'లో విఫలమైందనే చెప్పాలి.

దిల్లీలో వ్యక్తిపూజ ఎంత ఉచ్ఛదశలో ఉన్నా.. వేలాది వర్గాలు, సంస్కృతులు కలిగిన భారతదేశంలో స్థానిక రాజకీయ శక్తులకు ఎప్పుడూ స్థానం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)