ఇప్పటికీ నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓట్లు వేస్తున్నారు.. ఎందుకు?

  • 18 మే 2018
మోదీ Image copyright PUNIT PARANJPE

కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఒంటరిగా 104 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దక్షిణాదిలో పాగా వేయాలనే తన ప్రయత్నాలకు కర్ణాటకలో పునాది వేసింది.

మెజారిటీకి 8 సీట్లు తక్కువపడినా ఈ ఫలితాలతో మోదీ చాలా సంతోషంగా ఉన్నారనే అనుకోవచ్చు. గతంలో తన ప్రాబల్యం లేని రాష్ట్రాల్లోకి సైతం ఇటీవలి కాలంలో భాజపా చొచ్చుకెళ్లింది. ఈశాన్య భారతంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఆ పైన కర్ణాటకలోనూ పాగా వేసే దిశగా అడుగేసింది. ఈ విజయానికి ఘనత మోదీకే దక్కుతుంది. ఎందుకంటే ఆయన శ్రమకోర్చి కర్ణాటకలో 20కి పైగా ప్రచార సభలను నిర్వహించారు. స్థానికంగా పేరున్న కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్యను ఆయన తన వాగ్ధాటితో ఇరుకున పడేశారు.

ఇతర నేతలు ముస్లింలపై హిందూ ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కువగా చేయగా, అవినీతి రహిత దేశం, ఆర్థికాభివృద్ధి లాంటి అంశాలను మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.

భాజపాకు మోదీ అవసరం ఎంతుందో ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. కార్యకర్తల్లో ఉత్తేజం నింపడంలో, ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీ వైపు ఆకర్షించడంలో మోదీ ఎప్పుడూ ముందే ఉంటారు.

ఆయనకు తోడు, ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడని బీజేపీ ప్రచార యంత్రాంగాన్ని ముందుండి నడిపించే వ్యూహకర్త అమిత్ షా కూడా పార్టీని బలమైన ప్రత్యర్థిగా నిలపడంలో కీలకపాత్ర పోషించారు.

కాంగ్రెస్‌లోని లోటుపాట్లు కూడా మోదీకి సానుకూలంగా మారాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఎదురుదెబ్బగానే భావించొచ్చు. గతంతో పోలిస్తే ఈసారి రాహుల్ ప్రచారం చేసిన తీరు, ఆయనలో కనిపించిన కొత్త ఉత్సాహం వల్ల కాంగ్రెస్ శిబిరాల్లో విజయంపై ఆశలు చిగురించాయనడంలో సందేహం లేదు.

అయితే ఎన్ని సానుకూలతలున్నా కర్ణాటకలో గత ఫలితాలు మాత్రం కాంగ్రెస్‌ను కలవరపెడుతూనే ఉన్నాయి. గత 33ఏళ్లలో ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ వరుసగా రెండోసారి ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టలేదు. దీనికి తోడు అక్కడ నాయకత్వ లోపం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగా మారింది.

చాలావేగంగా కాంగ్రెస్ తన ఓటర్లను కోల్పోయింది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న యువ ఓటర్ల మనసు గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది.

‘ఈ ఫలితాల వల్ల కాంగ్రెస్‌లో నిరుత్సాహంతో పాటు బలహీనత కూడా ఆవరిస్తుంది. దేశంలో తన అధీనంలో ఉన్న ఆఖరి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. కాంగ్రెస్ ఆర్థిక వనరులు కూడా క్రమంగా కరిగిపోతున్నాయి. కార్యకర్తలను ఈ ఫలితాలు మరింత నిరుత్సాహపరుస్తున్నాయి’ అంటారు మిలన్ వైష్ణవ్. 'కార్నెగీ ఎండోమెంట్ ఫర్ పీస్' అనే సంస్థ దక్షిణాసియా విభాగానికి వైష్ణవ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Image copyright Getty Images

కర్ణాటక ఫలితాల్ని బట్టి 2019 సాధారణ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేయొచ్చా?

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, సాధారణ ఎన్నికలకు రెండేళ్లు లేదా అంతకంటే తక్కువ రోజుల ముందు జరిగే రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీలకే జాతీయ స్థాయిలోనూ విజయం దక్కే అవకాశాలు ఎక్కువని వైష్ణవ్ చెప్పారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని అన్నారు.

2014 ఎన్నికల్లో బీజేపీకి 80శాతం లోక్‌సభ సీట్లను కట్టబెట్టిన మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత నెలకొందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.

మరోపక్క ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన వాళ్ల ఆత్మస్థైర్యాన్ని పెంచేదిగా ఉంది. దాంతో పాటు కర్ణాటక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకుంటే మోదీని అడ్డుకునే శక్తి కూటములుగా ఏర్పడే ప్రత్యర్థులకే ఉందని కూడా అర్థమవుతుంది.

మోదీలాంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ చాలా శ్రమించాల్సిన అవసరం ఉంది. సరైన నాయకుడు లేకుండా ఎంత బలమైన కూటమి ఉన్నా ఆ శక్తి బీజేపీని ఎదుర్కోవడానికి సరిపోకపోవచ్చు.

Image copyright Getty Images

మోదీ పాపులారిటీ అలానే ఉన్నా, ఆర్థికాభివృద్ధి పరంగా ఆయన ప్రభుత్వం చూపిన ప్రదర్శనను గమనిస్తే 2014 విజయాన్ని ఆయన సద్వినియోగం చేసుకోనట్లే కనిపిస్తోంది.

మితవాద గుంపులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నా, వాళ్లకు కళ్లెం వేయడానికి మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలు సరైన చర్యలు తీసుకోవట్లేదనే భావనా నెలకొంది.

ఆయన మంత్రులు, ముఖ్యమంత్రులు చాలా మంది తమ చేతలతో, తప్పుడు వ్యాఖ్యలతో అనేక సార్లు ఆయనను ఇబ్బందిలో పడేస్తుంటారు.

భాజపాకున్న రెండు ప్రధాన మిత్ర పక్షాలు కూడా ఆ పార్టీ నాయకత్వ శైలిపై అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో గత ఎన్నికల్లో భాజపాకు కొద్దిపాటి ఆధిక్యమే దక్కింది. దాంతో అందరి దృష్టీ వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలపైనే ఉంది. మోదీ పాపులారిటీకీ, ప్రత్యర్థుల శక్తియుక్తులకు అది పెద్ద పరీక్షే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: భారీ ఆధిక్యం దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... జగన్ 150 సీట్లు సాధిస్తారా?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 292 స్థానాల్లో బీజేపీ.. 50 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: ఏపీలో 24 చోట్ల వైసీపీ ఆధిక్యం... నిజామాబాద్‌లో కవిత వెనుకంజ: ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్‌ల ‘వ్యక్తి పూజ రాజకీయాలు’

చంద్రబాబు, జగన్, పవన్‌.. విజేత ఎవరో ఎన్నింటికి తెలుస్తుంది

సోషల్ మీడియాలో బీబీసీ పేరుతో ప్రచారమవుతున్న ఎన్నికల సర్వే అవాస్తవం