‘ఫస్ట్‌నైట్‌’ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు కనిపించాలన్నారు.. మేం ఎదిరించాం’’

  • 17 మే 2018
వివేక్, ఐశ్వర్య పెళ్లి ఫొటో Image copyright BBC / VIVEK TAMAICHIKAR
చిత్రం శీర్షిక వివేక్, ఐశ్వర్యల పెళ్లి చాలా నాటకీయంగా సాగింది

బ్యాండ్, బాజా, బారాత్.. పవిత్ర ప్రమాణాలు.. నోరూరించే భోజనాలు... భారీ పెళ్లిళ్లకు భారతదేశం పెట్టింది పేరు. కానీ మహారాష్ట్రలోని పుణెలో ఈ పెళ్లి కథ వేరే. అపవిత్రమైన ‘కన్యత్వ పరీక్ష’, దానికి వ్యతిరేకంగా ఓ కుటుంబం తిరుగుబాటు, అలా ధిక్కరించినందుకు వెలివేస్తారన్న భయాలు.. ఈ వివాహ ఉదంతంలో కీలకం.

వివేక్ తమైచికార్.. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అతడు మహారాష్ట్రలోని సంచార జాతి కంజర్‌భట్ సమాజానికి చెందిన యువకుడు. అదే సమాజానికి చెందిన ఐశ్వర్యాభట్‌ను అతడి జీవిత భాగస్వామిగా అతడి కుటుంబం 2015లో ఎంపిక చేసుకుంది. ఆమె న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్.

వారిద్దరూ ఇష్టపడ్డారు. వారి కుటుంబాలు భారీ పెళ్లికి అంగీకరించాయి. కానీ పెళ్లి మాటల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. కారణం.. కాబోయే జంట ఒక షరతు పెట్టింది. అదేమిటంటే.. ‘‘మేం కన్యత్వ పరీక్షకు ఒప్పుకోం.’’

కన్యత్వ పరీక్ష సంప్రదాయం..

సంచార కంజర్‌భట్ తెగలో కన్యత్వ పరీక్ష ఒక సంప్రదాయం. దానిప్రకారం.. కొత్తగా పెళ్లైన జంట తలుపులు మూసేసిన గదిలో, రెండు కుటుంబాలు, సమాజం పెద్దల పర్యవేక్షణలో శారీరకంగా కలవాలి. ఆ కలయిక తర్వాత తెల్లటి దుప్పటి మీద రక్తపు మరకలు పెళ్లికూతురు ‘స్వచ్ఛత’కు నిదర్శనంగా పరిగణిస్తారు. ఒకవేళ ఆ దుప్పటి శుభ్రంగా ఉన్నట్లయితే ఆమె కలుషితమైనట్లు నిందిస్తారు.

శతాబ్దాల కిందటి ఈ సంప్రదాయానికి చాలా మంది కొత్త జంటలు తలొగ్గారు. కుల పెద్దల ఆగ్రహానికి గురవుతామన్న భయం దానికి కారణం. కానీ వివేక్, ఐశ్వర్యలు దాని మీద పోరాడాలని నిర్ణయించుకున్నారు.

‘‘ఈ పరీక్ష మహిళలకు ఎంత దుర్భరమైనదో వారిని ఎంత వేదనకు గురిచేస్తుందో నేను తెలుసుకున్నాను. ఐశ్వర్య మద్దతుతో దానిపై పోరాడాలని నిర్ణయించుకున్నాను’’ అని వివేక్ బీబీసీతో చెప్పారు.

‘‘ఆ సంప్రదాయాన్ని భూస్థాపితం చేయాలన్నది లక్ష్యం’’ అంటారాయన. కన్యత్వ పరీక్షకు గురవ్వాలని ఐశ్వర్య కూడా ఎప్పుడూ ఇష్టపడలేదు.

‘‘నేను రజస్వల అయినపుడు ఈ కన్యత్వ పరీక్ష గురించి మా అమ్మ నాకు చెప్పింది. నిజానికి ఆ సంప్రదాయం ఉందని ఆమె చాలా గర్వంగా భావించింది’’ అని ఐశ్వర్య తెలిపారు.

‘‘కానీ దీని గురించి నా ఫ్రెండ్స్‌తో మాట్లాడటం మొదలుపెట్టాక.. అది ఎంత భయానకమో అర్థమైంది. ఆ పరీక్ష ఎన్నడూ ఎదుర్కోరాదని నిర్ణయించుకున్నాను. అది చాలా కష్టమనీ తెలుసుకున్నాను. కానీ వివేక్‌ని కలిసిన తర్వాత.. అతడిచ్చిన మద్దతు నాకు విశ్వాసాన్నిచ్చింది’’ అని ఆమె వివరించారు.

Image copyright BBC / VIVEK TAMAICHIKAR
చిత్రం శీర్షిక వివేక్, ఐశ్వర్యలు తమ పెళ్లికి భద్రత కోసం బౌన్సర్లను నియమించుకున్నారు

భయం గుప్పిట్లో కుటుంబం

కానీ ఏ తిరుగుబాటైనా ఈజీ కాదు. సంప్రదాయాన్ని పాటించటానికి తిరస్కరించే కుటుంబాలను ఆ సమాజం నుంచి వెలివేస్తారు. వారితో సంబంధాలు నడిపే, సాయం చేసే వారికి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది.

‘‘జాత్ పంచాయత్’’ అంటే కుల పంచాయతీ పెద్దలను ఎదిరించాలని తమ పిల్లలు నిర్ణయించుకోవటంతో తమ భౌతిక, సామాజిక భద్రత గురించి వివేక్, ఐశ్వర్య కుటుంబాలు రెండూ భయపడ్డాయి. అయితే.. పెళ్లి ప్రమాణాలు చేస్తాం కానీ కన్యత్వ పరీక్షకు ఒప్పుకోబోమని పట్టుబట్టిన తమ పిల్లలకు మద్దతివ్వటానికి వారు అంగీకరించారు.

2017 సెప్టెంబర్‌లో పెళ్లి తేదీ నిర్ణయించాక.. వారి తిరుగుబాటు నిర్ణయం గురించి ‘పెద్దల’కు తెలిసింది. ఆ సమాజం పెద్దలు వధువు, వరుడు, వారి కుటుంబాలను హెచ్చరించటం, బెదిరించటం మొదలైంది.

‘‘మొదట మాకు మద్దతు ఇచ్చిన మా బంధువులు చాలా మంది సమాజం పెద్దల ఒత్తిడికి లొంగిపోయారు. కానీ మేం ఒంటరిగా మిగిలిపోలేదు. సమాజంలోని యువతలో చాలా మంది మా ఉద్యమానికి స్పందించారు. మా లక్ష్యాన్ని విశ్వసించారు. ఈ యువతీయువకుల సాయంతో పోరాడాలని మేం నిర్ణయించుకున్నాం’’ అని వివేక్ వివరించారు.

ఐశ్వర్య, వివేక్‌లు అటువంటి యువతను సమీకరించి ‘కన్యత్వ పరీక్ష సంప్రదాయాన్ని రద్దు చేయాలి’ (స్టాప్ ది వర్జినిటీ టెస్ట్ రిచ్యువల్) అంటూ 2017 నవంబర్‌లో ఉద్యమం ప్రారంభించారు. ఊహించిన విధంగానే వారి ఫోన్లకు వరుసగా బెదిరింపు కాల్స్ రావటం మొదలైంది.

2018 ఫిబ్రవరిలో కంజర్‌భట్ సమాజానికి చెందిన మరొక జంట పెళ్లికి సాయం చేసిన ఈ బృందంలోని సభ్యులు కొందరిపై దాడి చేసి కొట్టారు. జాత్ పంచాయతీ వాళ్లే ఆ దాడికి సూత్రధారులని యువత ఆరోపించింది.

అయితే.. పెళ్లి బృందం మీద జరిగిన ఆ దాడితో విషయం మీడియాకు చేరింది. ‘‘వివిధ మీడియా వర్గాల్లో ఈ అంశం మీద వార్తా కథనాలు రావటంతో.. నా మీద మహారాష్ట్రలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుచేశారు. మా ఉద్యమానికి వ్యతిరేకంగా సమాజంలోని మహిళలు మార్చిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు’’ అని వివేక్ తెలిపారు.

‘‘మా పెళ్లి తేదీ - మే 12 - దగ్గరకు వచ్చే కొద్దీ దాడులు పెరిగాయి’’ అని అతడు బీబీసీకి చెప్పారు.

‘‘వాళ్లు మా కుటుంబాలను, స్నేహితులను బెదిరిస్తున్నారు. నా బంధువులు కొందరు వివేక్ గురించి చెడు మాటలు చెప్తూ నన్ను తప్పుదోవ పట్టించటానికి కూడా ప్రయత్నం చేశారు. అతడితో తెగతెంపులు చేసుకోవాలన్నారు. విపరీతమైన ఒత్తిడి పెరిగింది’’ అని ఐశ్వర్య వివరించారు.

కానీ వివేక్, ఐశ్వర్యలు అన్ని అవరోధాలకూ ఎదురొడ్డి నిలిచారు. ‘‘కన్యత్వ పరీక్షకు వ్యతిరేకంగా మాకు మద్దతు ఇవ్వండి’’ అంటూ తమ వివాహ ఆహ్వానంతో విజ్ఞప్తి చేశారు.

వారి కుటుంబాలు ఇంకా తమ భద్రత విషయంలో భయపడుతూనే ఉన్నాయి. సమాజం నుంచి వెలివేస్తారన్న ఆందోళన పెరిగింది. వారికి బెదిరింపు ఫోన్ కాల్సూ పెరిగాయి.

‘‘అయితే మా కజిన్స్, అంకుల్స్ మాకు మద్దతుగా ఉన్నారు. ఐశ్వర్య తాతా వాళ్లూ కూడా ఈ సంప్రదాయం మారాలన్న దానికి అంగీకరించారు’’ అని వివేక్ చెప్పారు.

Image copyright VIVEK TAMAICHIKAR
చిత్రం శీర్షిక వివేక్, ఐశ్వర్య ఉద్యమానికి 'అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి' మద్దతుగా నిలిచింది

పెళ్లి రోజు వచ్చింది...

ఒక శనివారం రోజు.. పుణెలోని పింప్రి ప్రాంతంలో పెళ్లి. ఫిబ్రవరిలో మరొక పెళ్లి సందర్భంగా ‘స్టాప్ ద వి-రిచ్యువల్’ ఉద్యమ యువతపై దాడి జరిగిన ప్రాంతంలోనే వివేక్, ఐశ్వర్య పెళ్లి కూడా జరగనుంది.

‘‘నాటి ఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పెళ్లి వేదిక వద్ద కూడా బౌన్సర్లను ఏర్పాటు చేశాం. మా ఊరేగింపు దారిలో అనుమానాస్పదంగా తచ్చాడుతున్న చిన్నచిన్న బృందాలు కనిపించాయి. అందుకే అందరికీ భద్రత కల్పించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం’’ అని వివేక్ తెలిపారు.

కానీ వాళ్లు ఫోన్ కాల్స్‌ని అడ్డుకోలేకపోయారు. ‘‘మా ఫోన్లు రోజంతా మోగుతూనే ఉన్నాయి. అన్నీ బెదిరింపు కాల్సే. కానీ దేనికీ బెదిరిపోకూడదని, ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని మేం ధీమాగా ఉన్నాం. మేం కన్యత్వ పరీక్షకు ఒప్పుకోవటం లేదు. లేదంటే లేదు’’ అని ఐశ్వర్య ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటూ చెప్తారు.

పోరాటం ఇప్పుడే మొదలైంది...

సమాజంలో మూఢ విశ్వాసాలు, దుష్ట సంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేసే ‘అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి’ అనే ప్రముఖ సంస్థ వీరి ఉద్యమానికి మద్దతుగా నిలిచింది.

డాక్టర్ నరేంద్ర ధబోల్కర్ స్థాపించిన సంస్థ అది. హేతువాది, సామాజిక ఉద్యమకారుడు అయిన ఆయనను 2013లో పుణెలో కాల్చి చంపారు. ముంబైకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మెట్రో నగరం.. ఆధునిక ఐటీ పరిశ్రమకు, ఉత్తేజవంతమైన యువతకు, అత్యాధునిక విద్యా సంస్థలకు పేరు గాంచింది.

కానీ.. వారి పెళ్లికి అంతటి మద్దతు, గుర్తింపు లభించినా కూడా.. జాత్ పంచాయత్ తమ పంతం నెగ్గించుకోవటం కోసం నిరీక్షిస్తోంది. వారిద్దరి కుటుంబాల మీద సామాజిక బహిష్కరణ కత్తి వేలాడుతూనే ఉంది.

‘‘మా పెళ్లికి హాజరైన వాళ్లు ఇప్పుడు.. ఎప్పుడెప్పుడు వెలి వేస్తారా అని భయంతో గడుపుతున్నారు. జాత్ పంచాయత్ ఈ వెలి మీద ఒక ప్రకటన జారీచేసేది. కానీ ఇప్పుడు కేవలం మౌఖికంగా ప్రకటిస్తే చాలు. మా బంధువులు కొందరికి ఇప్పటికే ఎవరి నుంచీ పిలుపులు రావటం లేదు’’ అని వివేక్ చెప్పారు.

కానీ.. వీరి ఉద్యమం ఫలితంగా మార్పు వస్తోంది. ‘‘ఇంతకుముందు పెద్ద వేడుకగా జరిగే వ్యవహారం.. ఇప్పుడు సన్నిహితుల మధ్య రహస్య సంబంధంగా మారింది’’ అని వివేక్ బీబీసీకి తెలిపారు.

వివేక్, ఐశ్వర్యలు తమ జీవితంలో ప్రత్యేక రోజైన తమ పెళ్లి వేడుకను భారీ హంగు ఆర్భాటాలతో జరుపుకోలేకపోయారు. కానీ.. వారి పెళ్లి.. వారి సమాజపు నిర్మాణం మీద, ఆ సమాజంలోని ప్రజల మీద నిస్సందేహంగా చాలా పెద్ద ప్రభావం చూపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)