అభిప్రాయం: ఆంధ్రా, తెలంగాణ, తృతీయ ఫ్రంట్‌లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంత?

  • 16 మే 2018
నరేంద్ర మోదీ Image copyright Getty Images

వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా సంవత్సరం ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రెండు ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ఇద్దరినీ ఒకేలా ఇరకాటంలోకి నెట్టాయి.

అత్యధిక స్థానాలతో బీజేపీ ముందంజలో నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సుస్పష్ట మెజార్టీ ఇవ్వకుండా కర్ణాటక ప్రజలు బీజేపీ దక్కన్ ప్రవేశాన్ని కొంత వరకు నిలువరించారు.

ఇప్పుడు ఇక్కడ ఎవరి లాభనష్టాల మాట ఎలా వున్నప్పటికీ, ఇదే ఏడాది వరసగా జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలు, మరి కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో 'కర్ణాటక ప్రకంపనలు' పునరావృతం కావడం మాత్రం తప్పకపోవచ్చు.

2014 తర్వాత కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోను అధికారానికి దూరమైన కాంగ్రెస్ కర్ణాటకలో ఓడినప్పటికీ, అది మోదీ-అమిత్ షా ద్వయం చాణుక్య రాజకీయ క్రీడకు దక్షణాదిలో పెట్టిన 'చెక్' మాత్రం కాంగ్రెస్ సాధించిన ప్రచ్చన్న విజయమే అవుతుంది.

కర్ణాటక ఫలితాలు వెలువడిన వెంటనే, పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ "అక్కడ కాంగ్రెస్-జే.డి.(ఎస్) కలిసి పోటీచేసి ఉండాల్సింది" అన్న వ్యాఖ్యకు ఇకముందు ముందు ఎంతైనా ప్రాధాన్యత వుంటుంది.

జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ ప్రభ తగ్గడం ఇప్పటికే మొదలయినప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న 'ఎలక్షన్ మేనేజ్‌మెంట్'ను ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలు కొంత కలవరపాటుకు గురవుతున్నది మాత్రం నిజమే.

ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య ఎన్నికలకు వెళ్లబోతున్న రాష్ట్రాల్లో జరగబోయే పార్టీల సర్దుబాటుకు ఇకముందు మార్గదర్శనం అవుతుంది. కాంగ్రెస్ పార్టీది ప్రాంతీయ పార్టీల మాదిరిగా రాష్ట్రాల్లో అధికార సాధన కాకుండా పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన లక్ష్యం కనుక, స్థానికంగా అది అటువంటి సర్దుబాటులకు కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఇక సిద్దం కావచ్చు.

Image copyright Getty Images

దక్షిణాదిలో పాగా వేయడానికి ప్రయత్నాలు

కేంద్రంలో ఎన్.డి.ఏ. అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్ల తర్వాత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలిత మరణంతో దక్షిణాదిలో బీజేపీ తన రాజకీయ క్రీడ వేగవంతం చేసింది.

దానికి సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత ఏ.పి.లో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడినప్పటికీ కూడా, కొత్తగా తన మీద పోటీకి వచ్చిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే 'రిస్క్' తీసుకోకుండా బీజేపీతో కలిశారు.

అలా బీజేపీ పొలిటికల్ రాడార్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి నాలుగేళ్ళు కనిపించకుండా తప్పించుకోగలిగింది!

ఇక తెలంగాణాలో అది చాలా కాలంగా ఉనికిలో ఉన్నప్పటికీ, దానికి అక్కడ ఉన్న పరిమితులు ఎక్కువ. కేరళలో గెలిచింది ఒక సీటే అయినా ఉనికి కోసం కమ్యునిస్టులతో అది కయ్యానికి కారణాలు వెతుకుతూనే వుంది.

ఇక దక్షణాది రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర, గోవాల్లో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాలు వున్న నేపథ్యంలో, మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతున్న తరుణంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ దక్షణాదిలోకి ఒక ప్రభంజనంలా ప్రవేశించేందుకు ఈ కర్ణాటక ఎన్నికలను ఎంచుకుంది.

అయితే నరేంద్ర మోదీ అశ్వమేధ యాగం ఉత్తర భారతాన, ఈశాన్య రాష్ట్రాల్లో అప్రతిహతంగా సాగినప్పటికీ దక్షణాది ప్రవేశానికి వచ్చేసరికి దానికి అడ్డుకట్ట పడింది. ఆ అశ్వానికి ఇక్కడ పడ్డ బంధనాలు, దాని తదుపరి కదలికలను ఇక ఇప్పడు ప్రశ్నార్థకం చేసింది.

అయితే ఇలా జరగడానికి కారణాల కోసం ఇప్పుడు అక్కడ వెతికితే పెద్దగా ప్రయోజనం వుండదు. 'పోయిన చోటే వెతకాలి' అనే సూత్రం ఇక్కడ వర్తించదు!

అందుకు - మనం మోదీ ప్రభుత్వ పాలన మొదలయిన నాలుగేళ్ల వెనక్కి వెళ్లాలి. ప్రత్యేకించి దాని పరిపాలన సాగుతున్న రాష్ట్రాల్లో అమలవుతున్న దేశీయ (హోం మంత్రిత్వ శాఖ) విధానాల్లో అందుకోసం కారణాలు మనం వెతకాలి. అక్కడ దళితులు, ముస్లింలు, ఎంతమేర జీవన భద్రతతో వున్నారో తెలుసుకోవాలి.

వింధ్య పర్వతాలకు ఇవతల దాని పరిపాలన లేని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల్లో చైనా వంటి పొరుగు దేశాల భారీ పెట్టుబడులతో మొదలయిన మౌలిక వసతుల ప్రాజెక్టులు దాని విదేశీ విధానం కారణంగా ఎలా నత్త నడక నడుస్తున్నాయో చూడాలి.

అలా చూసినప్పుడు - ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రాల ప్రజలు బీజేపీ ఓటమిని కోరుకున్నారు. మరి ఎవరు గెలవాలి అని ప్రశ్నిస్తే - వాళ్లు కాకుండా ఎవరైనా పర్వాలేదు, అనేది వారి జవాబుగా వుంది.

అందుకే, కర్ణాటకలోనే కాకుండా దానికి సరిహద్దున వున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కూడా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మొదటిసారి తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అన్నట్టుగా ఫీలయ్యారు.

కారణం - అక్కడి ఫలితాల ప్రభావం మున్ముందు తమ మీద నేరుగా ఉంటుందనే!

Image copyright Getty Images

మునుపటి ఎన్‌డీఏకు ఇప్పటి ఎన్‌డీఏకు తేడా

ఒక పక్క మునుపెన్నడూ మనం చూడని ప్రభావశీలమయిన ప్రధాని నరేంద్ర మోదీ అని ఎవరెవరో మన దేశానికి బయట ఆయనకు కితాబులు ఇస్తున్న తరుణంలో, దేశ ప్రజలు మోదీ నాయకత్వం అంటే బెంబేలెత్తడం ఆసక్తికరమైన వైరుధ్యం.

కాంగ్రెస్ అధికారంలో వున్న కర్ణాటకలో ఇప్పుడు బీజేపీ సాధించిన 104 స్థానాల కోసం ఇంత గొప్ప నాయకుడు ఎంతగా తన ప్రధాని హోదాను మరిచి మరీ పలచన అయ్యాడు అనేది ఇప్పుడు దక్కన్‌లో కూడా రికార్డ్ అయింది.

గడచిన నాలుగేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల ప్రచార సభల్లో అయన చేసిన ప్రసంగాల వల్ల వచ్చిన అంతిమ ఎన్నికల ఫలితాలు ఏమయినప్పటికీ, అంచెలు అంచెలుగా అవి నరేంద్ర మోదీ వ్యక్తిత్వాన్ని మాత్రం మసకబార్చాయి.

కర్ణాటకలో అదే దృశ్యం మరో సారి కళ్లకు కట్టింది. దేశ ప్రధాన మంత్రిగా ఆయన కొద్ది పాటి జాగ్రత్తలతో, నెహ్రూ కాలం నాటి ఇండో-పాక్ సంబంధాలు, నాటి రక్షణ శాఖ ప్రముఖుల ప్రస్తావన బహిరంగ సభల్లో చేయవచ్చు.

కానీ ఆధునిక భారత చారిత్రక వివరాలు (Historical facts) చెప్పడానికి కూడా మోదీ మరీ అంత స్వేచ్చ తీసుకోవడం దేశంలో విద్యాధికుల్ని విస్మయపరిచింది.

పైగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని, అయన తల్లి సోనియా గాంధీని ఎదురుగా నోట్సు లేకుండా ఒక పావుగంట సేపు మీరు బహిరంగ సభలో మాట్లాడండి అంటూ అయన సవాలు చేశారు!

వాజపేయి హయాంలోని ఎన్.డి.ఏ. తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఎన్.డి.ఏ. మునుపటికి భిన్నమైనదని ఆ పార్టీ వర్గాలకు తెలియకుండా వుండే అవకాశం లేదు.

కానీ కర్ణాటక ఎన్నికల్లో బళ్ళారి సరిహద్దు జిల్లాల బాధ్యతను పూర్తిగా గాలి జనార్ధనరెడ్డికి అప్పగించి ఎన్నికల్లో గెలవడానికి చేసిన ప్రయత్నాల ద్వారా మోదీ, బీజేపీలు తమ ప్రాధాన్యతలు ఎలావుంటాయో దేశానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఇప్పుడు కర్ణాటకలో ఏదో ఒక పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు వచ్చి, ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే - కొద్ది రోజులకు అంతా సద్దుమణిగి వుండేది.

కానీ కాంగ్రెస్-జే.డి.ఎస్. సంకీర్ణ ప్రభుత్వం కనుక ఏర్పడితే, అప్పుడు స్థానిక బీజేపీ నాయకత్వానికే కాకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల ముందు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి కూడా తలనొప్పులు మొదలవుతాయి.

Image copyright KalvakuntlaChandrashekarRao/facebook

తృతీయానికి ఎవరు ముందుంటారు?

ఇక ముందు బీజేపీ ప్రతి చర్య మీద అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా కూడా నిరంతర నిఘా ఉంచుతాయి. అది, దక్కన్‌లో బీజేపీ విస్తరణ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

అప్పుడు మరో ఏడాదిలో ఎన్నికలకు వెళ్లనున్న ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీతో జత కట్టడానికి అవకాశం వున్న ప్రాంతీయ పార్టీల డిమాండ్లు పెరుగుతాయి.

అంతిమంగా అవన్నీ బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఫలిస్తాయి. కాంగ్రెస్‌కు బీజేపీకి ప్రత్యామ్నాయంగా మూడవ ప్రంట్ కోసం అని చెబుతూ - తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు కూటమి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు.

కర్ణాటక ఎన్నికలకు ముందు, అయన జే.డి.ఎస్. నాయకుడు దేవగౌడను కూడా కలవడం ద్వారా ఆ పార్టీ తన కూటమిలో కాబోయే భాగస్వామి అనే సంకేతాలు ఇచ్చారు.

అయితే కర్ణాటక ఫలితాలు వెలువడ్డాక, ఇప్పుడు అది కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దపడడం, ఆ పరిణామాన్ని మమత బెనర్జీ 'ఈ పని ముందే చేయవలసింది' అనడంతో, చంద్రశేఖరరావు ఫ్రంట్ కోసం మమతను కలసిన వైనానికి ఇక ముందు ఎటువంటి ప్రాధాన్యత లేనట్టు అయ్యింది.

అదే సమయంలో బీజేపీ మీద పోరుకు ఆ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రయత్నాలు ఏవో మేమే చేస్తాము - అని కాంగ్రెస్ ముందుకు వచ్చినట్టు కూడా అయ్యింది.

చివరిగా - కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ తాను కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిని అని ప్రకటించి, రెండు యు.పి.ఏ. ప్రభుత్వాల్లో మంత్రి పదవిని సైతం తీసుకోవడానికి వైమనస్యం చూపిన గతానికి ఇక్కడ ఒక ముగింపు ఇచ్చారు.

Image copyright Getty Images

కర్ణాటక కాంగ్రెస్‌ను కష్టాల్లోంచి గట్టెక్కిస్తుందా?

ఇందిరా గాంధీ కాలం నుంచి ఆ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకునే ఆనవాయితీ కర్ణాటకకు వుంది. కనుక, అది ఇప్పుడు రాహుల్ మనో వాంఛను తీర్చినా తీర్చవచ్చు కూడా.

ఇక్కడ జే.డి.ఎస్.కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్టుగా, రేపు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలల్లో అక్కడి ప్రాంతీయ పార్టీలకు కూడా అది సహకరిస్తే, ఆ మేరకు అవి పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి దానికి సహకరించవచ్చు.

అయినా సంక్షేమ పథకాల అమలుకు మొదటి నుంచి మంచి పేరున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలనుంచి సానుకూల ప్రతిస్పందన ఓట్ల రూపంలో పెద్దగా రాలేదు అనేది ఒక విశ్లేషణ.

అది కనుక నిజమైతే, ఆర్థిక సంస్కరణల అమలు మొదలై పాతికేళ్ళు అయ్యాక కూడా ఇంకా సబ్సిడీ బియ్యం, ప్లేటు భోజనం వంటి చిన్న చిన్న ప్రయోజనాలతో ప్రజల సంతృప్త స్థాయిని పెంచగలమని నమ్మితే, ఫలితాలు కర్ణాటకలో మాదిరిగానే వుంటాయి.

సామాన్య ప్రజలు, వారికి ప్రభుత్వం ఇస్తున్న బియ్యం, భోజనం, పెన్షన్లు క్రమమంగా తీసుకుంటున్నప్పటికీ, వారు తమ సమీపంలో తమ కళ్ల ముందే కొత్తగా సంపన్నులు అవుతున్న వారిని మునుపటికంటే నిశితంగా గమనిస్తున్నారు.

అందులో భవిష్యత్తులో తమ వాటా మాట ఏమిటి అనేది ఇప్పుడిప్పుడే ఇంకా ఒక రూపం తీసుకుంటున్న డిమాండ్. కనుక కొత్త ఏరియాలను 'అడ్రస్' చేయాల్సిన అవసరాన్ని కన్నడ ఎన్నికలు ముందుకు తెచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)