గోదావరిలో పడవ ప్రమాదం: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’

  • సంగీతం ప్రభాకర్, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధులు
  • దేవీపట్నం నుంచి
మృతుల కుటుంబికులు రోదిస్తున్న దృశ్యం

ఫొటో సోర్స్, sangeetham prabhakar/BBC

గోదావ‌రి లాంచీ ప్ర‌మాదంలో 22 మంది మ‌ర‌ణించారు. 14 మృత దేహాలు మాత్ర‌మే దొరికాయి. వారిలో ముగ్గురు పిల్ల‌లున్నారు. మ‌రిణించిన వారిలో ఇంకా ఇద్ద‌రిని గుర్తించాల్సి ఉంది. ప్ర‌మాదం జ‌రిగే స‌మ‌యానికి మొత్తం 44 మంది బోటులో ఉండ‌గా, 22 మంది క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

తూర్పు - ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల మ‌ధ్య‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. తూ.గో జిల్లా దేవీప‌ట్నం మండలం మంటూరు గ్రామం, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వాడ‌ప‌ల్లి - టేకూరు గ్రామాల మ‌ధ్య‌లో గోదావ‌రి న‌దిలో బోటు మునిగిపోయింది. 15వ తేదీ సాయంత్రం కొండ మొద‌లు అనే గ్రామం వెళుతున్న స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది.

వీడియో క్యాప్షన్,

ప్రమాద స్థలంలో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, హోం మంత్రి చిన రాజ‌ప్ప స‌హాయ‌క చ‌ర్య‌లు ప‌రిశీలించారు. చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు 10 ల‌క్ష‌ల రూపాయ‌ల సాయం, త‌క్ష‌ణ ఖ‌ర్చుల‌కు ల‌క్ష రూపాయ‌లు ప్ర‌క‌టించారు.

ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో గోదావ‌రి న‌ది లోతు 40 నుంచి 45 మ‌ధ్య‌లో ఉంది. మంగ‌ళ‌వారం సాయంత్ర‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభం అయ్యాయి. రాత్రి చీక‌ట్లో కూడా ప్ర‌య‌త్నాలు సాగినా ఫ‌లించ‌లేదు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం స్థానిక మ‌త్స్య‌కారులు, స‌హాయ‌క బృందాలు, పోల‌వ‌రం ప‌నులకు సంబంధించిన క్రేన్, ఇంజినీర్ల బృందం క‌లిసి శ్ర‌మించి బోటును ఒడ్డుకు తెచ్చారు.

ఆ త‌రువాత బోటులో చిక్కుకున్న దేహాల‌ను బ‌య‌టకు తీశారు. బోటును ఒడ్డుకు తేక ముందే ఇద్ద‌రు చిన్నారుల మృత దేహాలు న‌దిలో తేలాయి. మృత దేహాల‌కు ఘ‌ట‌నా స్థ‌లంలోనే పోస్టు మార్టం నిర్వ‌హించి వారి బంధువుల‌కు అప్ప‌గించారు.

ఫొటో సోర్స్, sangeetham prabhakar/BBC

ఫొటో క్యాప్షన్,

ప్రమాదానికి గురైన బోటు

ప్ర‌మాదం ఎలా జ‌రిగింది

ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న బోటు గోదావ‌రి మ‌ధ్య‌లో ఉండ‌గా బ‌ల‌మైన గాలులు, న‌దిలో సుడిగుండాలు ఏర్ప‌డ్డాయి. గాలులు పెర‌గ‌డంతో బోటును కాస్సేపు ప‌క్క‌న ఆపారు. మ‌ళ్ళీ ముందుకు వెళ్లారు. త‌రువాత గాలులు పెరిగినా, బోటు ఆప‌లేదు. తాము అడిగినా బోటు ఆప‌లేద‌ని ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ ల‌క్ష్మ‌ణ‌రావు అనే యువ‌కుడు బీబీసీతో చెప్పారు. ప్రమాదం జ‌రిగే స‌మ‌యానికి బోటులో కొన్ని సిమెంట్ బ‌స్తాలు కూడా ఉన్నాయి. ఈ బోటులో పైన (టాప్ మీద‌) కొంద‌రు, కింద కొంద‌రు కూర్చుంటారు. కింద కూర్చునే ప్రాంతం చాంబ‌ర్ల‌లా ఉంటుంది. టాప్ మీద కూర్చున్న వారు బ‌తికారు. అయితే గాలి, నీరు వ‌స్తుంద‌న్న కార‌ణంతో బోటు కింద చెక్క త‌లుపులు మూసేశారు. దీంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అందులోని వారు త‌ప్పించుకునే అవ‌కాశం లేక‌పోయింది.

చ‌నిపోయిన వారిలో కూడా చాలా మందికి ఈత వ‌చ్చ‌నీ, కానీ త‌లుపులు మూసేసి ఉండ‌డమే మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌ని ల‌క్ష్మ‌ణ‌రావు బీబీసీకి వివ‌రించారు. ప్ర‌మాదాన్ని ఒడ్డునుంచి చూసిన కొంద‌రు స్థానికులు, కొంద‌రు ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు.

ఫొటో సోర్స్, sangeetham prabhakar/BBC

ఫొటో క్యాప్షన్,

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

ప్ర‌మాణాలు-నిబంధ‌న‌లు

ప్ర‌మాదం జ‌రిగిన బోటుకు లైసెన్సు ఉంది. అంతేకాదు, అందులో లైఫ్ జాకెట్లు కూడా ఉన్నాయి.

కానీ ఎవ‌రూ వాటిని వేసుకోలేదు. ప్ర‌మాదం జ‌రిగిన రోజు ఉద‌య‌మే అధికారులు ఆ బోటును త‌నిఖీ చేసి అన్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ట్టు నిర్ధారించారని ముఖ్య‌మంత్రి స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఫొటో సోర్స్, sangeetham prabhakar/BBC

బోటు ఎక్క‌డం త‌ప్ప‌దా?

ఈ ప్రాంతంలో రోజూవారీ ప‌నుల కోసం బోటు వాడ‌డం సాధార‌ణం. రోడ్డు క‌నెక్టివిటీ త‌క్కువ‌. రోడ్డున్నా బ‌స్సులుండ‌వు. అంద‌రికీ సొంత బండ్లు కొనుక్కునే అవ‌కాశం, సామ‌ర్థ్యం లేవు. దీంతో అందుబాటులో ఉన్న జ‌ల ర‌వాణాపైనే గోదావ‌రి ప్రాంత గిరిజ‌న గ్రామాలు ఎక్కువ ఆధార‌ప‌డ‌తాయి.

ఈ బోటులో ఎక్కువ మంది వైద్యం కోసం వేరే గ్రామాల‌కు వెళ్లే వాళ్లే ఉన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నుంచి కొండ మొద‌లు గ్రామం వ‌ర‌కూ దాదాపు 20 గ్రామాల‌ను ఈ బోటు క‌లుపుతుంది. ఈ బోటు వారానికి రెండుసార్లు న‌డుస్తుంద‌ని స్థానికులు చెప్పారు. సుమారు ప‌దేళ్ల క్రితం ఇదే బోటుకు ప్ర‌మాదం జ‌రిగి కొంద‌రు చనిపోయిన‌ట్టు స్థానికుల్లో కొంద‌రు చెబుతున్నారు. కానీ దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం లేదు.

"ఒకే ఇంట్లో న‌లుగురు చ‌నిపోయారు. చాలా బాధ వేసింది. పిల్ల‌లు త‌ల్లి కోసం ఏడుస్తున్నారు. మ‌నుషుల‌ను తీసుకువెళ్లే బోటు నిర్వ‌హించే ప‌ద్ధ‌తి ఇది కాదు. మాన‌వ త‌ప్పిదం వ‌ల్ల ఇలా జ‌రిగింది. అదే స‌మ‌యంలో గాలులు వ‌చ్చాయి. ప్ర‌మాదం విష‌యంలో వాస్త‌వాల‌ను విచారించి నిందితుల‌ను

క‌ఠినంగా శిక్షిస్తాం" అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. బాధితుల పిల్ల‌లకు చ‌దువు, ఉద్యోగాల్లో స‌హ‌క‌రిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మొత్తం 114 మంది ఎన్డీఆర్ ఎఫ్, 65 మంది ఎస్ డీ ఆర్ ఎఫ్ బృందాలు, న‌లుగురు నేవీ అధికారులు, 44 మంది ఎస్పీఎఫ్ బృందం, 8 మంది నేవీ స్కూబా డైవ‌ర్లు, 2 నేవీ హెలికాప్ట‌ర్లు, 20 మందికి పైగా డాక్ట‌ర్ల బృందం పాల్గొన్నాయి. స్థానిక పోలీసులు, ఇతర రాష్ట్ర ప్ర‌భుత్వ శాఖ‌లూ వీరికి స‌హ‌క‌రించాయి. తూ.గో, ప‌.గో జిల్లాల ఉన్న‌తాధికారులు ప‌నుల‌ను ప‌రిశీలించారు. తూ.గో జిల్లా క‌లెక్ట‌ర్ కార్తికేయ‌, ఎస్పీ విశాల్ గున్నీలు ఉద‌యం నుంచీ ప‌నులు ప‌ర్య‌వేక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)