కర్ణాటకలో ఓట్లు తక్కువ, సీట్లు ఎక్కువ.. బీజేపీకి ఎలా సాధ్యం? కాంగ్రెస్ ప్రశ్న

  • 17 మే 2018
అమిత్ షా Image copyright Getty Images

కర్ణాటక ఫలితాలు వచ్చేశాయి. బీజేపీకి కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఆ పార్టీ ఖాతాలో ఎక్కువ స్థానాలు చేరాయి. ఇదెలా సాధ్యం అని చాలా మంది గందరగోళంలో పడ్డారు. కానీ కర్ణాటకలోనే ఇలా జరగడం ఇది మొదటి సారి కాదు.

ఇదే కర్ణాటకలో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. ఆ సమయంలో దాదాపు ఈనాటి పరిస్థితే కనిపించింది.

బీజేపీకి కాంగ్రెస్‌ కంటే 2 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి. కానీ 30 స్థానాలు ఎక్కువ వచ్చాయి. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయగలిగింది.

1983లోనూ ఇలాగే జరిగింది. ఆ సమయంలో జనతా పార్టీకి కాంగ్రెస్ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు ఎక్కువ గెలుచుకోవడంతో అది అధికారం చేజిక్కించుకోగలిగింది.

Image copyright Getty Images

అలా ఎందుకు జరిగింది?

ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38 శాతం, బీజేపీకి 36.2 శాతం, జేడీఎస్‌కు 18.3 శాతం ఓట్లు లభించాయి. ఇవి రాష్ట్రంలోని మొత్తం ఓట్లు

ప్రాంతాలవారీగా చూస్తే, ఈ ఓట్లను ఆరు భాగాలుగా విభజించ వచ్చు. కాంగ్రెస్ ఓట్లు అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపించాయి.

బీజేపీకి ఓట్ల శాతం తక్కువగా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో మరింత తగ్గిపోయాయి. జేడీఎస్ బలంగా ఉన్న దక్షిణ కర్ణాటక లాంటి ప్రాంతంలో బీజేపీకి కేవలం 18 శాతం ఓట్లే వచ్చాయి.

బీజేపీకి కోస్టల్ కర్ణాటకలో చాలా ఎక్కువ మెజారిటీ లభించింది. ఈ ప్రాంతంలోని 21 స్థానాల్లో బీజేపీకి 51 శాతం ఓట్లు లభించాయి. 18 స్థానాల్లో విజయం కూడా సాధించింది.

ముంబై కర్ణాటకలో బీజేపీ మొదటి నుంచీ అంత బలంగా లేకపోయినా అక్కడ కూడా ఆ పార్టీ సుమారు 48 నుంచి 50 శాతం ఓట్లు సంపాదించింది.

సెంట్రల్ కర్ణాటక ప్రాంతంలో కూడా బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించగలిగింది. కానీ హైదరాబాద్ కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోగలిగింది. బీజేపీ కంటే ముందుండడంలో విజయవంతమైంది.

దక్షిణ కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ నువ్వానేనా స్థాయిలో పోటీపడ్డాయి. మొత్తంగా చూస్తే ఈ ప్రాంతాల్లో బీజేపీ ఓటింగ్ శాతం పరిమితమైపోయింది.

రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించడానికి కారణం ఇదే.

Image copyright Getty Images

మోదీ ర్యాలీ ప్రభావం ఏమైనా ఉందా?

గణాంకాలను బట్టి ఒకటి మాత్రం స్పష్టమైంది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన మోదీ ప్రభావం కర్ణాటకలో కనిపించలేదు.

కానీ ఒకటి మాత్రం జరిగింది. ఎన్నికలకు ఏడు రోజులు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ర్యాలీ ప్రభావం మాత్రం కచ్చితంగా ఉంది.

బీజేపీ వెంట మొదటి నుంచీ ఎప్పుడూ లేని కొన్ని వర్గాల ఓటర్లలో కొంత మంది ఆ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేశారంటే దానికి ప్రధాని ర్యాలీనే కారణం.

కానీ ప్రధానికి ఉన్న ప్రజాదరణపై ఇప్పటికీ ఎలాంటి ప్రశ్నా తలెత్తదు. సిద్ధరామయ్య కూడా ప్రజాదరణ ఉన్న నేతే. కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా పాపులారిటీ సంపాదించారు.

Image copyright Getty Images

లింగాయత్ కార్డుతో కాంగ్రెస్ ప్రయోజనం పొందిందా?

కాంగ్రెస్‌కు చాలా సాధారణ ప్రయోజనం లభించింది. లింగాయత్‌లు మొదట్నుంచీ బీజేపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. కానీ లింగాయత్‌లు రాష్ట్రం అంతా లేరు. వీరు ఉత్తర కర్ణాటకలో మాత్రమే స్థిరపడ్డారు.

సర్వేను బట్టి 62 శాతం లింగాయత్‌ ఓట్లు బీజేపీకి వచ్చినట్టు మనకు స్పష్టమైంది. ఇక్కడ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.

ఇక్కడ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంలో కాస్త తగ్గుదల కనిపించింది. అదే కాంగ్రెస్ మాత్రం తన ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో సఫలమైంది.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ సుమారు 36 శాతం ఓట్లు సాధించింది. ఈసారీ వారికి ఇక్కడ 38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్‌ వైపు ఉన్న ఓటర్లు ఆ పార్టీ వెంటే నిలిచారనేది స్పష్టమైంది.

ముస్లింల ఓట్లలో 65 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు లభించాయి. దళితులు, ఆదివాసీలు కూడా కాంగ్రెస్ వైపే నిలిచారు.

మిగతా వర్గాల ఓట్లను సంపాదించడంలో విఫలమవడం ఆ పార్టీ ఓటమికి కారణమైంది.

Image copyright Getty Images

కాంగ్రెస్-జేడీఎస్ మొదటే చేతులు కలిపి ఉంటే?

కాంగ్రెస్-జేడీఎస్ ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని ఉంటే ఈరోజు ఫలితాలు భిన్నంగా ఉండేవి.

గణాంకాలను బట్టి చూస్తే, రెండు పార్టీలకూ కలిపి 150 స్థానాలు వచ్చుండేవి. బీజేపీ 70 సీట్లకే పరిమితం అయ్యుండేది. రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితి పూర్తిగా మరోలా ఉండేది.

ఇక, 2019 ఎన్నికల విషయానికి వస్తే, బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యర్థి పార్టీలన్నీ ఒకటిగా కలవాల్సి ఉంటుంది. కేవలం కర్ణాటకలో మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలకు ఈ ఎన్నికలు ఎన్నో సంకేతాలను ఇచ్చాయి.

బీజేపీ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడవలసి ఉంటుంది.

Image copyright Getty Images

ఫలితాలు దేనికి సంకేతం?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అందిన మొదటి సంకేతం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బీజేపీకి పోటీ ఇవ్వడం అసాధ్యం. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఒప్పుకోవాల్సి ఉంటుంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక రెండో సందేశం, బీజేపీని ఎదుర్కోడానికి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపై రావాల్సి ఉంటుంది.

ఇక మూడో సందేశం, నాయకత్వం విషయంలో ఎక్కడో లోపం ఉంది. అంటే ఇద్దరు పెద్ద నేతలు పోటీపడినప్పుడు, మోదీ వాళ్ల కంటే ముందుకు వెళ్లిపోవడం జరుగుతోంది.

మోదీ వర్సెస్ రాహుల్ అనే ప్రచారం ఉన్నంత వరకూ ఎన్నికలు ఒకవైపే అవుతాయి. అలాంటప్పుడు బీజేపీ ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక నాయకుడిని తెరపైకి తీసుకురావాలి. కొన్ని విధానాలతో ఎన్నికల బరిలోకి దిగాలి.

Image copyright Getty Images

బీజేపీకి దక్కిన ప్రయోజనం?

బీజేపీకి ఇప్పుడు సంబరాలు చేసుకుంటోంది. వరసగా విజయాలు చేజిక్కించుకుంటోంది. దక్షిణాదిలో కూడా పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోంది.

భాష విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఇది పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇది బీజేపీకి కచ్చితంగా ఉత్సాహం కలిగించే విషయమే.

ఈ ఎన్నికల తర్వాత బీజేపీకి దక్షిణాది ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ ద్వారం నుంచి ఆ పార్టీ ఇంకా ఎంత ముందుకు వెళ్లగలదు అనేదే ఇప్పుడు చూడాలి

తమిళనాడు, తెలంగాణలో జెండా ఎగరేయడం అనేది బీజేపీకి ఇప్పటికీ సవాలే. ఇక ఆంధ్రప్రదేశ్, కేరళలో కాలు మోపడం కూడా బీజేపీకి అంత సులభమేమీ కాదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)