దేవీపట్నం ప్రమాదం: ఆధార్‌ జిరాక్స్ కోసం వెళ్లిన వారు ఒకరైతే... వైద్యం కోసం వెళ్లిన వారు మరికొందరు!

  • 18 మే 2018
ప్రమాదానికి గురైన లాంచీ ఇదే Image copyright SangeetamPrabhakar/BBC
చిత్రం శీర్షిక ప్రమాదానికి గురైన లాంచీ ఇదే

దేవీప‌ట్నం బోటు ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారిలో చాలామంది సొంతూళ్లు త్వ‌ర‌లో పోల‌వ‌రం ప్రాజెక్టులో మునిగిపోనున్నాయి.

త‌మ‌కు పున‌రావాస ప‌థ‌కం కింద లభించే ప్రయోజనాల్ని పొంద‌డానికి కావ‌ల్సిన జిరాక్సులు తెచ్చుకోవడానికి వెళ్ళినవారు కూడా మృతుల్లో ఉన్నారు.

నిజానికి ప్రభుత్వాలు తలచుకుంటే ఇక్కడి ప్రజలకు బోటు ప్రయాణం అనివార్యతేమీ కాదు. బోటుపై ఆధార‌ప‌డే అవ‌స‌రాన్ని త‌గ్గించ‌గ‌లిగిన మార్గాలు ప్ర‌భుత్వం ముందు ఉన్నాయి.

పాపికొండ‌ల‌ను చీల్చుకుని గోదావ‌రి స‌ముద్రం వైపు వెళ్లే దారి అది. న‌దికి రెండు వైపులా కొండ‌ల‌పై ప‌చ్చ‌టి ప‌ల్లెలు. పాత ఖ‌మ్మం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో విస్త‌రించిన అట‌వీ ప్రాంత జీవ‌నం గోదావ‌రి న‌దితో విడదీయరానంతగా ముడిప‌డి ఉంటుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదేవీపట్నం బోటు ప్రమాదం: లాంచీలే కాదు, ఊళ్లు కూడా మునిగిపోతాయ్..

నది నిండా పడవలే!

ఈ ప్రాంతంలో నిత్యం ఎన్నో ప‌డ‌వ‌లు, బోట్లు, లాంచీలు న‌దిలో కనిపిస్తాయి. స‌రదాగా విహారయాత్రకు వెళ్లే వాళ్లు, రోజువారీ ప‌నుల‌కోసం తిరిగే వాళ్లు చాలామంది ఆ నదిగుండా ప్రయాణిస్తారు. బోటు ప్ర‌యాణం అక్కడివారి జీవితంలో భాగం. ఆడ‌-మ‌గ‌, చిన్నా-పెద్దా తేడాలేకుండా దాదాపు అక్కడందరికీ ఈత వస్తుంది.

ఒకప్పుడు వాళ్లు ప్ర‌తి అవ‌స‌రానికీ బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. రెండు - మూడు ద‌శాబ్దాల నుంచి ప‌రిస్థితి కాస్త మారింది. దాదాపు అన్ని గ్రామాల్లో చిన్న చిన్న షాపులు వెలిశాయి.

కానీ ఎక్కువ‌ స‌రకులు కొనాల‌న్నా, ప్ర‌భుత్వ సేవ‌లు, రెవెన్యూ, వైద్యం, బ్యాంకింగ్ సేవ‌లు పొందాల‌న్నా ఊరు దాటాల్సిందే.

ఇప్పుడు ప్ర‌మాదంలో చిక్కుకున్నవారు ఎక్కువ మంది కుల ధ్రువీకరణ పత్రం కోసం, వైద్యం కోసం, బ్యాంకు కోసం, ఆధార్ కార్డుల జిరాక్సు కోసం వెళ్ళిన వాళ్లే.

Image copyright SangeetamPrabhakar/BBC

వైద్యం చేయించుకుందామని వెళ్లి...

"పిల్లలకు బాలేదంటే ఆస్పత్రిలో చూపిద్దామని మా త‌మ్ముడు, మ‌ర‌దలు, ముగ్గురు పిల్ల‌లు బోటులో వెళ్లారు. ఇప్పుడు ఒక్క పిల్లాడు మాత్రమే బ‌తికాడు. మిగిలిన న‌లుగురూ చ‌నిపోయారు" అని తాళ్లూరు గ్రామానికి చెందిన రాజ్య‌ల‌క్ష్మి బీబీసీతో చెప్పారు.

ఆమె మేన‌ల్లుడు రామ్ చ‌ర‌ణ్ తన తల్లిదండ్రుల‌నూ, త‌న క‌వ‌ల సోదరుల్ని పోగొట్టుకుని షాక్‌లో ఉన్నాడు.

"మా ఆయ‌న‌కి బాలేక‌పోతే చూపించుకుందాం అని పోల‌వ‌రం ఆసుప‌త్రికి వెళ్లాడు. ఆయనతో పాటు మా అమ్మాయి ఉంది. ఇద్ద‌రూ ఇక తిరిగిరాలేదు" అని చెప్పారు పండ‌మ్మ అనే మ‌హిళ‌.

"మా ఊరికి బ‌స్సులు ఎక్కువ‌గా ఉండ‌వు. దొరికితే దొరుకుత‌య్ లేక‌పోతే లేదు. అందుకే లాంచీ ఎక్కుతాం" అన్నారామె.

సంత నిర్వహించడం ద‌గ్గ‌ర నుంచి చుట్టాల‌ను కలవడం వ‌ర‌కూ చాలా పనులకు వాళ్లకు పడవే ఆధారం.

గోదావ‌రి న‌దిపై ప‌శ్చిమ గోదావ‌రిజిల్లా పోల‌వ‌రం నుంచి తూర్పు గోదావ‌రిజిల్లా కొండ మొద‌లు పంచాయితీ మ‌ధ్య దాదాపు 32 ఊళ్ళకు లాంచీ సేవ‌లు త‌ప్ప‌నిస‌రి.

అయితే, రోడ్డు సౌక‌ర్యం వ‌చ్చాక‌ కొన్ని ఊర్ల ప‌రిస్థితి కాస్త మెరుగైంది.

అయినా రోడ్డుపై పూర్తిగా ఆధార‌ప‌డే ప‌రిస్థితి ఇంకా లేదు. ఆటోలు, బైక్‌లు కూడా స‌రిగా వెళ్ల‌లేని రోడ్ల‌వి. దీంతో లాంచీ సేవ‌లు కూడా కొన‌సాగుతున్నాయి.

కొండ‌మొద‌లు ప‌రిధిలోని ఊళ్ల‌కు లాంచీ త‌ప్ప‌నిస‌రి కూడా.

2006 త‌రువాత రోడ్ నెట్ వ‌ర్క్ పెరిగాక చాలామంది ప్యాసింజ‌ర్ లాంచీ స‌ర్వీసుల‌ను నిలిపివేశారు.

కొంద‌రు వాటిని టూరిస్టు లాంచీలుగా మార్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో ఒక‌ లాంచీ స‌ర్వీసు మాత్ర‌మే తిరుగుతోంది. అది కూడా వారానికి రెండు రోజులు మాత్ర‌మే న‌డుస్తుంది.

Image copyright SangeetamPrabhakar/BBC

ప్రభుత్వ పనుల కోసం నది దాటాల్సిందే..

దేవీప‌ట్నంలో సోమ‌వారం, పోల‌వ‌రంలో మంగ‌ళ‌వారం సంత జ‌రుగుతుంది. కాబ‌ట్టి ఆ రెండు రోజులే ప్యాసింజ‌ర్ లాంచీలు తిరుగుతాయి.

దీంతో సోమ, మంగ‌ళ వారాల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, బ్యాంకింగ్ ప‌నులు పెట్టుకుంటారు గిరిజ‌నులు.

కొండ మొద‌లు పంచాయితీ ప‌రిధిలో 11 గ్రామాల వ‌ర‌కూ ఉన్నాయి. వారు కొంత దూరం రోడ్డు ప్ర‌యాణం చేసి తిరిగి లాంచీ ప్ర‌యాణం చేస్తే త‌ప్ప వారి మండ‌ల కేంద్రానికి చేరుకోలేరు.

కొండ‌మొద‌లు గ్రామ‌స్తులు ప‌డ‌వ‌లో వాడ‌ప‌ల్లి గ్రామం వ‌చ్చి అక్క‌డి నుంచి రోడు మార్గంలో సింగ‌న‌ప‌ల్లి కంపెనీ అనే ఊరు వెళ్లి అక్క‌డి నుంచి మ‌ళ్ళీ ప‌డ‌వ‌లో దేవీప‌ట్నం రావాలి.

ఇక్క‌డి నుంచి మ‌ళ్లీ ఇందుకూరు పేట వెళ్తే అప్పుడు త‌హ‌శీల్దార్ ఆఫీసు క‌నిపిస్తుంది.

పోల‌వరం ప్రాజెక్టు వ‌చ్చాక దేవీప‌ట్నం నుంచి త‌హ‌శీల్దార్ కార్యాల‌యాన్ని ఇందుకూరుపేట త‌ర‌లించారు.

ఈ ప్ర‌మాదంలో బోటు వెనుక చాంబ‌ర్ త‌లుపులు తెరిచి ఉండ‌డం వ‌ల్ల ఈదుకుంటూ బ‌య‌ట‌ప‌డ్డ ల‌క్ష్మ‌ణ‌రావు అనే వ్య‌క్తి కూడా కుల ధృవీకరణ పత్రం కోసం త‌హ‌శీల్దార్ ఆఫీసుకు వెళ్లిన‌వాడే.

Image copyright SangeetamPrabhakar/BBC

బ్రిటిష్ కాలం నుంచే..

ఈ గ్రామాల క‌నీస అవ‌స‌రాలు తీర్చ‌డానికి ప్ర‌భుత్వాలు లేవా అంటే... ఈ గ్రామాలు ప్ర‌భుత్వాల‌ను, అధికారుల‌ను చూడ‌డం కొత్తేమీ కాదు.

బ్రిటిష్ కాలం నుంచే ఇక్క‌డ ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ ఉంది. పోలీస్ స్టేష‌న్లు, త‌హ‌శీల్దారు కార్యాల‌యాలు ఉన్నాయి. దేవీప‌ట్నంలో కొత్త‌గా క‌ట్టిన పోలీస్ స్టేష‌న్ ప‌క్క‌నే అప్ప‌ట్లో బ్రిటిష్ వాళ్లు క‌ట్టిన పోలీస్ స్టేష‌న్ ఇంకా చెక్కు చెద‌ర‌కుండా ఉంది.

ప్ర‌స్తుతం ఉన్న బోట్ల కంటే బ‌ల‌మైన‌, ఎక్కువ సామ‌ర్థ్యం ఉన్న బోట్ల‌ను చూసిన త‌రం ఇక్క‌డ ఉంది. ఆ కాలంలో న‌డిచిన బోట్లు, నిర్వ‌హించిన వ్య‌వ‌స్థ గురించి స్థానికులు చాలా విష‌యాలు చెబుతారు.

ప్ర‌స్తుతం ఈ గ్రామాల‌కు ఇరుకైన మ‌ట్టి దారులున్నాయి. ఎక్క‌డా స‌రైన రోడ్డు లేదు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే కేవ‌లం రోడ్డుంటే స‌రిపోదు... దానిపై న‌డిచే బ‌స్సు ఉండాలి.

వారానికి రెండుసార్లు వ‌చ్చే లాంచీ కోసం ఎదురుచూసేవారు, రోజూ బస్సు వ‌స్తే ఎంతో సంతోషిస్తారు.

"మీరు రోడ్డు ఎందుకు వాడ‌లేదు? బోటు ఎందుకు ఎక్కుతారు'' అన్న బీబీసీ ప్ర‌శ్న‌కు దూదుల‌మ్మ అనే మ‌హిళ ఇచ్చిన స‌మాధానం - "రోడ్డుంటే స‌రిపోతుందా?" బ‌స్సు వంటి ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ లేద‌న్న ఆక్రోశం ఆమె స‌మాధానంలో ఉంది.

కాస్త ఆదాయం ఉన్న వారు సొంత బండ్లు (టూవీల‌ర్స్) కొనుక్కుంటున్నారు. త‌క్కువ ఆదాయం ఉన్న‌వారు, బండి న‌డ‌పడం రాని వారు, న‌డ‌పలేని వారు, ఆరోగ్యం సరిగా లేనివారు ఆటోలు, బోట్లపై ఆధార‌ప‌డాల్సిందే.

Image copyright SangeetamPrabhakar/BBC
చిత్రం శీర్షిక రోడ్లున్నా.. బస్సులు రావు

రోడ్లు లేవు.. ఉన్నా బస్సులు నడవలేవు..

మొత్తం మ‌న్యం ప్రాంతాన్ని అద్భుత‌మైన రోడ్ నెట్ వ‌ర్క్‌తో నింప‌డం కొంచెం క‌ష్టం కావ‌చ్చు. క‌నీసం కీల‌క‌మైన ప్రాంతాల్లో క‌నెక్టివిటీ పెంచితే రోజూ లాంచీ ఎక్కాల్సిన భారం త‌ప్పుతుంది.

కొండ మొద‌లు - మంటూరు, శివ‌గిరి - సింగ‌న‌ప‌ల్లి కంపెనీ రోడ్లు బాగున్నా ప‌రిస్థితి మ‌రోలా ఉండేది.

రోడ్ నెట్ వ‌ర్క్ బాగుంటే ప్ర‌మాదం జ‌రిగేది కాద‌న్న వాద‌న‌తో విభదించారు తూర్పుగోదావ‌రి క‌లెక్ట‌ర్ కార్తికేయ మిశ్రా.

ప్ర‌మాదం మాన‌వ త‌ప్పిదం వ‌ల్ల జ‌రిగింద‌ని చెప్పిన ఆయ‌న‌, దాన్ని నివారించ‌డానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.

ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారిలో, అస‌లు ఏమాత్రం రోడ్డు లేని కొండమొద‌లు గ్రామం నుంచి ఒక్క‌రేన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

త్వ‌ర‌లోనే కొండ‌మొద‌లు నుంచి మంటూరు వ‌ర‌కూ రోడ్డు వేయ‌డానికి అట‌వీ శాఖ ఒప్పుకుంద‌నీ, ఆ శాఖే స్వ‌యంగా రోడ్డు వేయ‌బోతుంద‌నీ ఆయ‌న చెప్పారు.

త‌హ‌శీల్దార్ కార్యాల‌యం కూడా ఇక‌పై వారంలో మూడు రోజులు దేవీప‌ట్నంలో, మూడు రోజులు ఇందుకూరుపేట‌లో ప‌నిచేయ‌నుంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.

ముంపు ప్రాంతాల్లో మౌలిక వ‌సతుల క‌ల్ప‌న‌లో ఎంత మాత్రం నిర్ల‌క్ష్యం లేద‌న్న కార్తికేయ‌, ముంపు బాధితుల కోసం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.

బోటు ప్ర‌మాదం త‌రవాత మాట్లాడుతున్న ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుని, ముంపు గ్రామాల్లో మౌలిక వ‌స‌తుల గురించి విలేక‌ర్లు ప్ర‌శ్నిస్తే, "ఎంత వ‌ర‌కూ వెహిక‌ల్స్ రావ‌డానికి అవ‌స‌రం ఉందో అవ‌న్నీ చేయమ‌ని చెప్పాను" అని ఆయన అన్నారు.

కానీ ఇవ‌న్నీ పోల‌వ‌రం ముంపు గ్రామాలు. కాబట్టి ముఖ్యమంత్రి హామీలు నెరవేరతాయో లేదోనన్నది అనుమానమే. దాదాపు 2006 నుంచి వీళ్ల జీవితాలు ఊగిస‌లాట‌లో ఉన్నాయి. ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. కానీ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు దాదాపు లేవు. ఈ ప‌రిస్థితుల్లో త‌మ‌కు రోడ్లు వ‌స్తాయ‌ని స్థానికులు కూడా అనుకోవ‌డం లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు